గత డిసెంబర్ 19న మొదలైన ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్- 2024’ 29వ తేదీతో ముగిసింది. ఈ 11 రోజులు పుస్తక ప్రియులకు అపురూపమైన కాలం. చదువుకునే పిల్లల నుంచి ఎనభై ఏండ్ల వృద్ధుల దాకా అందరూ పుస్తకాలతో తమ అనుబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. సుమారు 15 లక్షల మంది బుక్ ఫెయిర్‌ను సందర్శించారని నిర్వాహకుల లెక్క. రచయితల అలయ్ బలయ్, అభిమానులతో కరచాలనం, కొత్త పుస్తకాల పలకరింపు చిత్రాలు ఇంకా మొబైళ్లలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. యువ ప్రచురణకర్తల,రచయితల సందడి ఈ పండుగకు కొత్త అలంకారాలను తెచ్చిపెట్టింది.
నూతన కార్యవర్గం నిర్వహణలో ఈ 37వ బుక్ ఫెయిర్ కొత్త పుంతలు తొక్కింది. అధ్యక్షుడు కవి యాకూబ్, కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు ‘మలుపు’ బాల్‌రెడ్డి బుక్ ఫెయిర్ అవసరాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేపట్టారు. ప్రాంగణంలో రెండు వేదికలు ఏర్పాటు చేయడం ఎంతో సౌలభ్యాన్ని పెంచింది. ఈసారి బుక్ ఫెయిర్ ప్రాంగణానికి కవి దాశరథి పేరును పెట్టారు. లోపలి ప్రధాన సమావేశాల వేదికను డాక్టర్ బోయి విజయ భారతి పేరిట ఏర్పాటుచేశారు. పుస్తకాల ఆవిష్కరణ కోసం కొత్తగా గ్యాలరీగా ఏర్పాటుచేసిన మరో వేదికకు ‘తోపుడుబండి’ సాదిక్ పేరు పెట్టడం ఎంతో సముచితంగా ఉన్నది. 2024, సెప్టెంబర్ 7న ఆయన అకస్మాత్తుగా 61వ ఏట గుండెపోటుతో మరణించారు. పండ్ల బండి మాదిరి తోపుడుబండిలో పుస్తకాలు పెట్టుకొని ఆయన ఎన్నో ఊర్లు తిరిగి పుస్తకాలను పరిచయం చేసి పఠనాసక్తిని పెంచారు. మీడియా పాయింట్‌కు ఇటీవల మరణించిన రచయిత, పాత్రికేయుడు వుప్పల నర్సింహం పేరును, రైటర్స్ స్టాల్‌కు గుస్సాడీ కనకరాజు పేరును పెట్టారు.
‘బుక్ ఫెయిర్- 2024’ ఏర్పాట్లలో కొంత మెరుగుదల చూడవచ్చు. 300లకు పైగా స్టాళ్లతో కొలువుదీరిన పుస్తకాలు అన్ని వయసుల వారినే కాకుండా అన్ని భావజాలాల వారినీ అలరించాయి. సాధారణంగా పనిరోజుల్లో సాయంత్రం నాలుగింటి నుంచి మొదలయ్యే ప్రవేశ సమయం ఈసారి మధ్యాహ్నానికి మారింది. దీనివల్ల స్టాళ్లను నాలుగు గంటలు ఎక్కువగా సందర్శించే వీలు కలిగింది. ప్రత్యేకంగా ఈ మార్పు బయటి ప్రాంతాలను బుక్‌ఫెయిర్‌కు వచ్చేవారికి సౌలభ్యంగా ఉంటుంది. చీకటి పడకముందే వారు తమ ప్రాంతాలకు వెళ్లవచ్చు.
బుక్‌ఫెయిర్‌ను మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు 23న సరికొత్తగా ‘పుస్తక నడక/ బుక్ వాక్’ను నిర్వహించారు. ఈ పాద యాత్ర లోయర్ ట్యాంక్‌బండ్ నుంచి దాశరథి ప్రాంగణం దాకా సాగింది. సీనియర్ పాత్రికేయులు, రచయితలు, ప్రచురణకర్తలు పాల్గొన్నారు. కొత్తగా నిర్వహించిన సాహిత్యవేదిక-పుస్తక స్ఫూర్తి కార్యక్రమం గురించి విశేషంగా చెప్పుకోవాలి. ఇందులో రచయితలు తమకు నచ్చిన, తాను మెచ్చిన, తనను ప్రభావితం చేసిన పుస్తకంపై లఘు ప్రసంగం చేస్తారు. దీనివల్ల కొత్త పాఠకులకు మంచి పుస్తకాల సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి గంట ఒక సెషన్‌గా రాత్రి 10 దాకా… రోజు మూడు సెషన్లు నడపడం వల్ల అధిక సంఖ్యలో రచయితలకు అవకాశం లభిస్తున్నది. ఒక రోజు కవి, యువ కవి సమ్మేళనాలు జరిగాయి.
ఒక్కో సెషన్లో రచయితలు, కవుల సంఖ్య ఎక్కువగా ఉన్నందువల్ల సమయం సరిపోని పరిస్థితి ఏర్పడవచ్చు. ఆ సంఖ్యను తగ్గిస్తే బాగుంటుందేమో! గ్రామీణ గ్రంథాలయాల కోసం పుస్తకాలను విరాళంగా ఇచ్చేవారి కోసం హుండీ లాంటి ఏర్పాట్లుచేశారు. చాలా మంది ఇండ్లల్లో చదివిన, పాత పుస్తకాలు ఎన్నో ఉంటాయి. వాటిని తెచ్చి ఇందులో వేయాలనే ఆలోచన వస్తే ప్రయోజనం ఉంటుంది.
సాంకేతికత ఎంత పెరిగినా, పీడీఎఫ్ కాపీలు, ఆడియో పుస్తకాలు అందుబాటులోకి వచ్చినా పుస్తకం మాత్రం తన ప్రత్యేకతను, విలువను, గౌరవాన్ని కాపాడుకుంటూనే ఉన్నది. కాగితం మీద అక్షరాన్ని చదవడంలో ఉన్న సౌలభ్యం మరెక్కడా లేదని ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన బుక్‌ఫెయిర్ రుజువు చేసింది.
ఇదిలా ఉంటే నవంబర్‌లో వారం రోజుల పాటు బెంగళూరులో పుస్తకోత్సవం కొనసాగింది. భారీగా నిర్వహించే కోల్‌కతా ఇంటర్నేషనల్ బుక్‌ఫెయిర్ ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 9 దాకా ఉంటుంది. ఇలా జైపూర్, ఢిల్లీలలో కూడా పుస్తకాల పండుగ ఘనంగా ఉంటుంది. పుస్తకాల రెపరెపలతో పాటు, రచయితల, పాఠకుల సమ్మేళనం కేవలం పుస్తకోత్సవాల్లోనే సాధ్యపడుతుంది. ఒకరిని ఒకరు కలుసుకునే అవకాశాలు, అవసరాలు తగ్గుతున్న వేళ ఇలాంటి సంబురాలు మనుషులను తీర్చిదిద్దుతాయి. పుస్తక ప్రదర్శనలో అమ్మకాలు సాగాయి, వెచ్చని ఆలింగనాలు కూడా దొరికాయి. ఏటికేడు మరింత నూతనోత్సాహంతో ఈ పండుగ సాగాలి. పుస్తకాన్ని బతికించాలి.
– నర్సన్ బద్రి 94401 28169