e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home Top Slides Telangana : మ‌న చ‌రిత్ర‌.. నత్తలగుట్ట మర్మమేమిటి?

Telangana : మ‌న చ‌రిత్ర‌.. నత్తలగుట్ట మర్మమేమిటి?

‘భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో.. ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో..’ రెండు లైన్లలో మొత్తం మానవ పరిణామశాస్ర్తాన్ని నిర్వచించిన మహాకవి దాశరథి.

మానవ అవతరణకు ముందు తెలంగాణ నేల మీద జరిగిన మార్పుల్ని అర్థం చేసుకునే క్రమంలో చేస్తున్న పరిశోధన.. ‘నమస్తే తెలంగాణ’ పాఠకులకు చరిత్రను శాస్త్రీయంగా, సజీవంగా అందించాలన్న తపన.. దట్టమైన అడవి మధ్య గుట్టలలో కోట్ల సంవత్సరాల కింద బతికి ఇప్పుడు శిలాజ రూపంలో ఉన్న నత్తల ఉనికిని వెలుగులోకి తెచ్చింది.

- Advertisement -

ఏ జీవి అయినా ప్రాణం కోల్పోయిన తర్వాత మట్టిలో కలిసిపోతుంది. కొన్ని సందర్భాలలో – మట్టి, ఖనిజాలతో కలిసిపోయినప్పుడు కంకాళం అదే రూపంతో మిగిలిపోయి శిలాజం అవుతుంది. మనిషి కంటే కొన్ని కోట్ల ఏండ్ల ముందే ఈ తెలంగాణ నేలమీద పురుడు పోసుకున్న ఎన్నోజీవుల ముద్రలు శిలాజాల రూపంలో మిగిలి ఉన్నాయి. కోట్ల ఏండ్ల నుంచి లక్షల ఏండ్ల వరకు ఇక్కడ బతికిన చెట్లు, ఆకులు, రకరకాల జంతువులు.. అన్నీ ఏదో ఒక రూపంలో అంటే శిలాజాలుగా లేక ‘శిలాజ ముద్రలు’గా దొరుకుతున్నాయి. ఆసిఫాబాద్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌ ప్రాంతాలు; దక్షిణ తెలంగాణలో పరిగి, వికారాబాద్‌, తాండూర్‌ ప్రాంతాలు శిలాజాల నిక్షేపాలు.

మనం శిలాజాల గురించి చెప్పుకోవడానికి ఇంకో కారణం ఏమంటే, ఏదో ఒక రూపంలో మనం వాటితో బంధంలో ఉన్నాం. పాత రాతియుగంలో మానవులు శిలాజాలను చెక్కుకొని వేటకు, ఇతర పనులకు పనిముట్లుగా వాడినట్టు ఏటూరునాగారం ప్రాంతంలో ఆధారాలు దొరికినయి. శిలాజాల్ని ఆభరణాల రూపంలో ఆదివాసులు ఇప్పటికీ వాడుతుంటారు. అమెరికాలో డైనోసార్ల ఎముకలతో చేసిన ‘డైనోసార్‌ బోన్‌ రింగ్స్‌’ లక్షల్లో ధర పలుకుతుంటాయి.

‘గిన్నెధారి’లో నత్తల గుట్టలు
ఆసిఫాబాద్‌ జిల్లా, గిన్నెధారి ఫారెస్ట్‌ రేంజ్‌లో గోయెనా ప్రాంతంలో రెండు గుట్టలు.. సుమారు 6 కోట్ల 70 లక్షల ఏండ్ల కింద జీవించిన ఫైజా జాతి (Genus) జీవుల ఖజానా. పరిశోధకులకు ఒకటీ ఆరా శిలాజాలు దొరికితేనే సంబురంగా ఉంటుంది. ఇక్కడ మా బృందానికి రెండు గుట్టల నిండా రాళ్లలో శిలాజాలుగా మారిన నత్తలు వందలకొద్దీ కనిపించాయి. వృక్ష శిలాజాలు నేలను పొడుచుకు వచ్చాయి. ఇక్కడ కనిపిస్తున్న నత్తలు ‘ఫైజా తిర్పొలెన్సిస్‌’ అనే జీవులు అని పురా జీవశాస్త్రవేత్తల భావన. 1986లో జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) జియాలజిస్ట్‌ కె.అయ్యసామి సంగారెడ్డి జిల్లా తేర్పోల్‌ గ్రామంలో కనుగొన్నందున ఈ రకమైన నత్తలకు ‘ఫై జాతిర్పొలెన్సిస్‌’ అని పేరు పెట్టారు.

గిన్నెధారిలోని గోయెనా ప్రాంతంలో కోట్ల ఏండ్ల కింద ఒక సరస్సు ఉండేది. భూగర్భంలో జరిగిన విస్ఫోటంతో సరస్సుపై లావా చేరి, సరస్సులోని జీవులు మట్టి, సిలికా (ఇసుక)తో కలిసి క్రమంగా శిలాజాలుగా మారిపోయినాయి. ఈ నత్తల ప్రధాన లక్షణం ఏమంటే వీటి శంఖం ఇప్పుడు మనం చూస్తున్న నత్తల్లా కాకుండా ఎడమవైపునకు తెరుచుకుని ఉంటుంది. శంఖాల్లో ఎడమ వైపునకు తెరుచుకుని ఉండే వాటిని పవిత్రంగా భావించి ‘దక్షిణావృత శంఖాలు’ అంటా రు. అలాంటివే ఇవికూడా. మహారాష్ట్రలో మొదలైన దక్కన్‌ ట్రాప్స్‌ మన హైదరాబాద్‌ పశ్చిమ సరిహద్దు వరకు విస్తరించి ఉండటంతో తెలంగాణ నేల లోపలి పొరల్లో ఇలాంటి శిలాజాలు ఉన్నాయని భూగర్భశాస్త్ర పరిశోధనలు తేల్చినయి.

గిన్నెధారి గుట్టల్లోని నేలను పరిశీలిస్తే ఇక్కడ ఒక సరస్సు ఉండేదని, అందులోని బురద, నల్ల చెకుముకిరాయి కలిసి ఈ నత్తలు శిలాజాలుగా మారిపోయాయని తెలుస్తున్నది. ఈ గుట్టల మీద రాళ్లలో శాస్త్రీయంగా పరిశోధన చేస్తే కేవలం నత్తలే కాదు, ‘కారోఫైట్‌’ అనే ఆల్గే శిలాజం, ఇంకా ఎన్నో జీవాల సూక్ష్మశిలాజాలు దొరుకుతాయని జీఎస్‌ఐ విశ్రాంత డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ చకిలం వేణుగోపాలరావు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో దొరికిన శిలాజాలు పెద్దగా మార్పులకు గురికాకుండా ఉండటంతో ఈ గుట్టలు కోట్ల ఏండ్ల నాటి శిలాజాల మ్యూజియంగా మనకు మిగిలాయి.

భూమి పొరల్లో బూడిద రాశులు
తెలంగాణలో లక్షల ఏండ్లలో ఎన్నోసార్లు, భూమిపొరల్లో ఉన్న రంధ్రాలనుంచి పెల్లుబికిన లావా బయటకు వచ్చి.. పెద్దపెద్ద వాగులు, నదుల ఒడ్డున బూడిద రూపంలో మిగిలి ఉంది. ఈ మధ్యనే ఈ వ్యాసకర్త క్షేత్రపరిశోధనలో మెదక్‌ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో పేరూరు గ్రామంలో మంజీరా నది ఒడ్డున ఇటువంటి లావా అవక్షేపం ఆధారం దొరికింది. జీఎస్‌ఐ ఇంకా రికార్డు చేయని ఈ జియోలాజికల్‌ సైట్‌లో శాస్త్రీయ పరిశోధనలు జరిపితే మరింత అవగాహన పెరగొచ్చు. ఇక్కడ సర్పయాగం జరిగిందనే స్థానికుల నమ్మకానికి ఇక్కడి నీటిలో లావా బూడిద కలిసి ఉండటమే ఆధారం అయి ఉంటుంది. కొత్తగూడెం దగ్గర గంగారం గ్రామంలో కిన్నెరసాని ఉప వాగు అయిన ముర్రేరు ఒడ్డున కూడా అగ్నిపర్వతపు లావాతో ఏర్పడిన బూడిద జీఎస్‌ఐ రికార్డుల్లో ఉంది. సుమారు 70 వేల ఏండ్ల క్రితం సుమత్రా దీవుల్లోని టోబా అనే అగ్నిపర్వతం బద్దలై గాలి ద్వారా మన ఖమ్మం వరకు చేరిన లావా వల్ల ఇది ఏర్పడింది.

శిలాజ పార్కులు నెలకొల్పాలి
గోయెనా గుట్టల్లో నత్తల శిలాజాల్ని, స్థానిక ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్‌ తోడిశెట్టి ప్రణయ్‌ వెలుగులోకి తెచ్చారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఔత్సాహిక చరిత్ర, పురాతత్వ అన్వేషకులు శిలాజాలపై దృష్టి సారించారు. సముద్రాల సునీల్‌ అనే అన్వేషకుడు రామగుండం ప్రాంతంలో చేప శిలాజం, చెన్నూరులో శిలాజంపై ఆకు ముద్రవంటివి సేకరించారు. ఇంకా ఎన్నెన్నో వెలుగులోకి రావాల్సినవి ఉన్నాయి. హిమాచల్‌ప్రదేశ్‌ సాకేతిలో హిమాలయ పర్వత సానువుల్లో దొరికిన శిలాజాలతో ‘శివాలిక్‌ ఫాసిల్‌ పార్క్‌’ను ఏర్పాటుచేశారు. తమిళనాడు, మహారాష్ట్రలలో ఫాసిల్‌ వుడ్‌ పార్కులు ఉన్నాయి. మన తెలంగాణలో శిలాజ సంపదను వెలికి తీయాలన్నా, కాపాడుకోవాలన్నా ఇలాంటి ఫాసిల్‌ పార్కులు చాలా అవసరం. ఇవి తెలంగాణ నేల వైవిధ్యాన్ని, పురాతత్వాన్ని రాబోయే తరాలకు అందించడమే కాదు, భవిష్యత్తులో పరిశోధనలకు ప్రేరణ ఇస్తాయి. ఎందుకంటే భూగర్భశాస్త్ర కోణంలో చూస్తే యావత్‌ తెలంగాణ ఒకపెద్ద ఫాసిల్‌ పార్క్‌.

తెలంగాణ గడ్డమీద మానవ శిలాజాలున్నాయా?
కర్నూలు జిల్లా మొగసర-యానిగొంది గుహల్లో జీఎస్‌ఐ శాస్త్రవేత్తలు వేణుగోపాలరావు, డాక్టర్‌ సి.వి.ఎన్‌.కె.రావులకు దొరికిన మనిషి దవడ శిలాజం మనకు గీటురాయి. దేశంలోనే గుహల్లో దొరికిన మానవ శిలాజపు మొదటి ఆధారం ఇది. ఈ శిలాజం 1.26 లక్షల ఏండ్లనుంచి 11,500 ఏండ్ల మధ్య అంటే, చరిత్రలో పాతరాతియుగం కాలం నాటిది. కర్నూలు ప్రాంతంలో జరిగిన భూగర్భ మార్పులు, మన తెలంగాణ భూగర్భంలో జరిగిన మార్పులు దాదాపు ఒకేలా ఉన్నందున, తెలంగాణ భూపొరల్లో డైనోసార్లు, నత్తలు, వృక్ష శిలాజాలే కాదు మానవ శిలాజాలు కూడా దొరుకవచ్చు.

ప్రాణహిత-గోదావరి మధ్యప్రాంతంలో కాళ్లరిగేలా తిరిగి శిలాజ అస్థికలు, రాతి పనిముట్లు సేకరించి ఏదో ఒకరోజున మనిషి పూర్వీకుల అస్థికలు లేక ఆస్థి పంజరం దొరుకుతుందని ఆశపడ్డ ఠాకూర్‌ రాజారాం సింగ్‌ కలను పరిశోధకుల అన్వేషణ సాకారం చేస్తే.. తెలంగాణలో మానవ వికాసానికి సంబంధించిన ఒక ఖాళీని పూరించినట్టవుతుంది.

సింగరేణిలో ఏనుగు దంతం
గత ఏడాది మేడిపల్లి ఓపెన్‌కాస్ట్‌ బొగ్గు గనిలో ఇప్పటి ఏనుగుకు పూర్వ రూపమైన ‘స్టెగోడాన్‌’ దంతాల శిలాజ భాగాలు దొరికాయి. 20 మీటర్ల లోతులో గని కార్మికులకు 1.5 మీటర్లు, 1.17 మీటర్ల పొడుగున్న ఈ శిలాజాలు దొరికాయి. సాధారణంగా హిమాలయ పర్వత సానువుల్లో ఎక్కువగా లభించే స్టెగోడాన్‌ శిలాజాలు దక్షిణ భారతదేశంలో దొరకటం ఇదే తొలిసారి. స్టెగోడాన్‌లు కోటి 16 లక్షల ఏండ్ల నుంచి 11,700 ఏండ్ల కిందటి వరకు జీవించాయని అంచనా. దట్టమైన అడవులు ఉంటే తప్ప అవి మనుగడ సాగించలేవు కాబట్టి సింగరేణి ప్రాంతంలో ఒకప్పుడు దట్టమైన అడవులు ఉండేవని తెలుస్తున్నది. అంతే కాకుండా మన రాతియుగపు చిత్రాల్లో ఉన్న ఏనుగును పోలిన జంతువులు ఈ స్టెగోడాన్లు కూడా కావొచ్చేమో పరిశీలించాల్సిన సందర్భం వచ్చింది.

శిలాజానికి ఆదివాసుల పూజలు
మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఒక శిలాజాన్ని స్థానిక ఆదివాసులు పూజిస్తున్నా రు. క్షీరదాల్ని పోలిన సరీసృప జాతికి చెందిన ఒక జీవి వెన్నెముక, పక్కటెముకల శిలాజం ఇది. 1985లో జీఎస్‌ఐ సైంటిస్టులు రికార్డు చేసిన ‘డైసినోడాన్ట్‌’ శిలాజం ఇది. అసాధారణమైన రూపం ఉన్న వాటిని ప్రకృతికీ, అతీత శక్తికీ అనుసంధానం చేసే ఆలోచన మనిషికి చరిత్రపూర్వయుగం నుంచీ ఉంది. అది నేటికీ కొనసాగుతున్నది. ఒక శిలాజం పూజలు అందుకోవడమే దీనికి నిదర్శనం.

ఎం.ఏ. శ్రీనివాసన్‌
81069 35000

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana