ఉద్యమకాలంలో ఉవ్వెత్తున ఎగసిన పోరు పాట మూగవోయింది! లలిత సినీ గేయ రచనలో ఒక ఒరవడిని సృష్టించిన ప్రముఖ కవి, రచయిత డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ 76 ఏండ్లకే పరమపదించారు. జీవితాంతం లలిత కళకు అంకితమైన ఆయన తన చివరి రోజుల్లోనూ కళామతల్లికి సేవలందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పాటల తూటాలెక్కుపెట్టిన ఆయన జన్మభూమి రుణం తీర్చుకున్నారు.
తెలంగాణ సాహిత్యానికి వడ్డేపల్లి కృష్ణ చేసిన సేవ అపారం. ఆయన పాటలు ఉద్యమానికి ఊతమై చిందులు వేశాయి. ఇటీవల తెలుగు సినీ రచయితల సంఘం జీవన సాఫల్య పురస్కారంతో ఆయనను సత్కరించింది. ఇది జరిగిన కొన్నిరోజులకే ఆయన తీవ్ర అనారోగ్యం పాలై తుది శ్వాస విడవటం తెలంగా ణ సాహితీ లోకానికి తీరని లోటు.
సిరిసిల్ల జిల్లాలోని ఓ చేనేత కుటుంబంలో జన్మించి న డాక్టర్ వడ్డేపల్లి కృష్ణ, హైదరాబాద్లో స్థిరపడ్డారు. తపాలాశాఖలో పదవీ విరమణ చేసిన ఆయనకు లలిత కళలంటే ఎంతో మక్కువ. లలిత కళలకు తన జీవితాన్ని ధారపోసిన ఆయన అనేక గీతాలను రచించారు. పిల్ల జమీందార్ చిత్రంలో ‘నీ చూపులోన విరజాజి వాన’, పెద్దరికం సినిమాలోని ‘ముద్దుల జానకి పెళ్లికి మబ్బుల పల్లకి తేవలెనే’, భైరవ ద్వీపం చిత్రంలో ‘అంబా శాం భవి’.. సహా అనేక ఆణిముత్యాల్లాంటి గీతాలను రచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘జయ జయ హే తెలంగాణ’ నృత్య రూపకం రచించగా అన్ని వేదికలపై అది మార్మోగింది. సాహిత్యరంగంలో 25 ప్రక్రియల్లోనూ రచనలు చేసిన ఏకైక రచయితగా వడ్డేపల్లి కృష్ణ ప్రత్యేక గుర్తింపును పొందారు.
వందేండ్లలో వెలువడిన పది వేల లలిత గీతాలపై పరిశోధనలు చేసిన వడ్డేపల్లి.. పీహెచ్డీ కూడా అందుకున్నారు. ఆయన రచించిన వందలాది లలిత గీతాలు ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారమయ్యా యి. 40 పైగా నృత్యరూపకాలు కూడా రాశారు. ఎన్నో పుస్తకాలు ప్రచురించారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలకపాత్ర పోషించారు.
రెండు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎక్కడికి వెళ్తుందో మనసు’ చిత్రంలో సాయికుమార్ హీరోగా నటించారు. ఇటీవల కాలంలో సంచలనం సృష్టించిన బలగం సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు.
తన సాహిత్య జీవితంలో ఆయన ఎన్నో పురస్కారాలందుకున్నారు. ఆటా, తానా వేడుకల్లో, సాహి త్య చర్చల్లో పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వం వహించి, నిర్మించిన ‘గోభాగ్యం’ లఘుచిత్రానికి అంతర్జాతీయంగా అనేక పురస్కారాలు లభించాయి. ‘బతుకమ్మ’, ‘రామప్ప రామణీయం’ లాంటి అనేక లఘు చిత్రాలకు నంది పురస్కారాలు వరించాయి. ఈ సందర్భంగా వడ్డేపల్లికి అశ్రునివాళి. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి.
– ఎడిటోరియల్ డెస్క్