‘నిప్పులోంచి అప్పుడప్పుడు పొగ పుడుతుంది/ నీళ్ళలోంచి విద్యుత్తను సెగ పుడుతుంది/ ఈ దానవ లోకంలో ఎన్నటికైనా/ మానవులని పిలువదగిన తెగ పుడుతుంది’ అంటూ మానవుల్లోని దానవ స్వభావాన్ని తెగడుతూనే, మనలో మార్పు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు మహాకవి దాశరథి. ఈ దానవ స్వభావం సమాజ చెరుపునకే పరిమితం కాలేదు. మొత్తం ప్రకృతినే విధ్వంసం చేస్తూ, భూగోళాన్ని వేడెక్కిస్తూ, సకల జీవరాసులను సర్వనాశనం చేసే దిశగా అడుగులు వేయిస్తున్నది. వాతావరణ మార్పుపై అంతర్ ప్రభుత్వ ప్యానెల్ (ఐపీసీసీ) తాజా నివేదిక రాబోయే విపత్తును మరోసారి మరింత విస్పష్టంగా హెచ్చరించింది. భూగోళంపైని అన్ని ప్రాంతాల్లోనూ, వాతావరణ వ్యవస్థలన్నీ మార్పునకు లోనవుతున్నాయని వెల్లడించింది. వెంటనే అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకున్నా, పరిస్థితి కుదుటపడటానికి ఇరువై నుంచి ముప్ఫై ఏండ్లు పట్టవచ్చునని ఈ నివేదికలో శాస్త్రవేత్తలు వివరించారు.
పదేండ్లకు, యాభై ఏండ్లకు ఒకసారి వచ్చే వైపరీత్యాలు తరచుగా, మరింత తీవ్రంగా వచ్చిపడతాయని శాస్త్రవేత్తలు ఈ నివేదికలో తెలిపారు. ఒక్కోసారి రెండురకాల బీభత్సాలు కలిసికట్టుగా రావచ్చు. ఎన్నడూ చూడని కొత్త ప్రాంతాలు కూడా ప్రకృతి ప్రకోపానికి వేదిక కావచ్చు. ఇటీవల కొన్ని వారాల కిందటే అనేక ప్రాంతాలు ప్రకృతి ఆగ్రహాన్ని చవిచూడటం గమనార్హం. కొన్ని వారాల వ్యవధిలోనే మనదేశంలోని కొన్ని ప్రాంతాలతో పాటు చైనాలో, యూరప్ దేశాలలో వరదలు వచ్చాయి. సైబీరియాను పొగ మేఘాలు ఆవరించాయి. అమెరికా, కెనడా, గ్రీస్, టర్కీ దేశాలలో కార్చిచ్చులు చెలరేగాయి. ప్రకృతి వైపరీత్యాలు శాస్త్రవేత్తల హెచ్చరికల స్థాయి నుంచి ప్రజల అనుభవంలోకి వచ్చాయి.
తాజా నివేదిక రూపకల్పన వెనుక అనేకమంది శాస్త్రవేత్తల పరిశోధన ఉన్నది. మానవ చర్యల వల్లనే భూగోళం వేడెక్కుతున్నదనీ, వాతావరణ మార్పు జరుగుతున్నదని రూఢీగా నిరూపించడం ఈ నివేదిక ప్రత్యేకత. భూగోళ తాపాన్ని కట్టడి చేయడం ఈ శతాబ్దాంతానికి సాధ్యమేనని శాస్త్రవేత్తలు వెల్లడించడం కొంత ఊరట కలిగిస్తున్నది. కానీ అన్నిదేశాలు సత్వర చర్యలు చేపడితేనే ఇది సాధ్యపడుతుంది. అయినా ఈ ప్రళయ హెచ్చరికలన్నీ బూటకమని బుకాయించే నాయకులున్నారు. మరికొందరు జరగబోయే ప్రమాదాన్ని అర్థం చేసుకోకుండా అలసత్వం వహిస్తున్నారు. ఐపీసీసీ తాజా నివేదిక నేపథ్యంలోనైనా, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు అప్రమత్తం కావాలి. ప్యారిస్ ఒడంబడికకు అనుగుణంగా విధానపరమైన చర్యలు తీసుకోవాలి. వచ్చే నవంబర్లో జరిగే వాతావరణ మహాసభలో నిర్దిష్ట నిర్ణయాలు తీసుకొని ముందడుగు వేయాలి. మానవాళి మనుగడకే ప్రమాదం వాటిల్లుతున్న అంశంపై ఉపేక్ష తగదు.