మనం ఒక దారిలో వెళ్లాలంటే ఆ దారి సాఫీగా ఉన్నదా, లేదా? అనేది చూసుకోవాలి. అలాంటిది రాజ్యాంగబద్ధంగా బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న కేంద్రప్రభుత్వం ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు మరెన్ని జాగ్రత్తలు తీసుకోవాలి? కనీసం ఆ తోవలోని చిక్కుముళ్లను విప్పి ముందుకుపోవాలి కదా!
రాజ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన కేంద్రప్రభుత్వం.. విధ్యుక్తధర్మాన్ని పక్కనబెట్టి ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమే ‘తెలుగు రాష్ర్టాల పరిధిలోని కృష్ణా, గోదావరిపై ఉన్న ప్రాజెక్టులను తన చేతుల్లోకి తీసుకోవడం.’ అందుకే కేంద్రం గెజిట్ జారీ చేయటాన్ని రాజ్యాంగ విశ్లేషకులు సైతం తీవ్రస్థాయిలో తప్పుబట్టారు. కేంద్రం వైఖరిపై సహజంగానే తెలంగాణ సమాజం ఒక్కసారిగా కన్నెర్రజేసింది. ‘ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014’, బచావత్ ట్రిబ్యునల్‌కు అనుగుణంగా తన బాధ్యతలను నెరవేర్చాల్సిన కేంద్రం.. అదే బచావత్ ట్రిబ్యునల్‌లోని అనేక అంశాలను ఐదారేండ్లుగా పరిష్కరించకుండా కాలయాపన చేయటాన్ని సాగునీటి రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బాధ్యతను మరిచి పెత్తనం చేయటం ఏమిటని నిలదీస్తున్నారు.
బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ-1).. తమ పరిధిలోని రాష్ర్టాలకు కృష్ణాజలాల పంపిణీలో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 75 శాతం డిపెండబిలిటీపై ప్రాజెక్టులవారీగా కాకుండా గంపగుత్తగా 811 టీఎంసీలు కేటాయించింది. ఆ తర్వాత బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ- 2) చేపట్టిన పంపిణీలో ఉమ్మడి రాష్ర్టానికి అదనంగా 194 టీఎంసీలు వచ్చాయి. అంటే మొత్తంగా ఉమ్మడి రాష్ర్టానికి ట్రిబ్యునళ్లు 1005 టీఎంసీలు కేటాయించాయి. కానీ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అమలుపై సుప్రీంకోర్టులో కేసు పెండింగులో ఉన్న దరిమిలా ఆ ట్రిబ్యునల్ కేటాయింపులు అమల్లోకి రాలేవు. అంటే రాజ్యాంగబద్ధంగా.. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం- 2014 అమలుకు బచావత్ ప్రామాణికం. మరి కేంద్రం తన గెజిట్‌లో ఉమ్మడి ఏపీకి బచావత్ కేటాయించిన ఈ 811 టీఎంసీలను ఎలా పంపిణీ చేస్తుందనే విధానాన్ని ప్రకటించకుండా.. నిర్వహణ అంశాన్ని ఎలా నిర్వహించగలుగుతుంది?
తెలంగాణ మొండికేస్తే కేంద్రం ఏం చేస్తది?
ఇప్పటివరకు రెండు రాష్ర్టాలు ఏటా తాత్కాలిక ఒప్పందానికి వచ్చి పంపిణీ చేసుకుంటున్నాయే తప్ప ఆంధ్రప్రదేశ్‌కు 63.13 శాతం (512 టీఎంసీలు), తెలంగాణకు 36.86 శాతం (299 టీఎంసీలు) అనేది ట్రిబ్యునల్ కేటాయింపులు కావు. సుదీర్ఘ పరీవాహకప్రాంతం ఉన్న తమకు సుమారు 600 టీఎంసీలు కావాలని బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు తెలంగాణ వాదిస్తుండటంతోపాటు కేంద్రానికి, కృష్ణా బోర్డుకు కూడా లేఖలు రాసింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఈ క్రమంలో రైతుల శ్రేయస్సు దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం.. బచావత్ కేటాయింపుల్లో 50 శాతం ఇవ్వాల్సిందేనని మొండికేస్తే?! కేంద్రంగానీ, కృష్ణా బోర్డుగానీ ఏం చేస్తాయి? మరీ ముఖ్యంగా సెక్షన్- 3 కింద 2014లోనే రాష్ర్టానికి నీటి వాటాలు తేల్చాలంటూ తెలంగాణ దరఖాస్తు చేసుకుంటే ఆరేండ్లకు పైగా కాలయాపన చేసిన కేంద్రానికి తెలంగాణపై ఒత్తిడి చేసే నైతికత ఉన్నదా? సెక్షన్-3 కింద ఏడాదిలో ట్రిబ్యునల్ వేయాల్సిన కేంద్రం నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంతో తెలంగాణ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును ఉపసంహరించుకుంటే తాము నీటి వాటాలను తేల్చే బాధ్యతను తీసుకుంటామని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్వయంగా ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఆ కేసును ఉపసంహరించుకునేందుకు అంగీకరించింది. మరి ఇచ్చిన హామీ మేరకు రెండు రాష్ర్టాల మధ్య వాటాలు నిర్ధారించిన తర్వాత గానీ కేంద్రం అడుగులు ముందుకు వేయకూడదు. కానీ కీలకమైన బాధ్యతను నెరవేర్చకుండా హడావుడిగా ప్రాజెక్టులపై పెత్తనానికి ఆరాటపడటమనేది రాజ్యాంగస్ఫూర్తి ఎలా అవుతుందో కేంద్రమే చెప్పాలి.
బచావత్ అమలు ఎక్కడ?
ఒక నది నుంచి తమ ఇంటికి సరఫరా అయిన నీటిలో ఆ ఇంటిసభ్యులు తాగునీటికి, ఇతర అవసరాలకు 20 శాతం మాత్రమే గ్రహిస్తారని, మిగిలిన 80 శాతం వివిధ రూపాల్లో బయటకు వెళ్లి వాగులు, వంకలు, ఉపనదుల ద్వారా తిరిగి అదే నదిలో కలుస్తుందనేది హేతుబద్ధమైన సూత్రీకరణ. అందుకు అనుగుణంగా బచావత్ ట్రిబ్యునల్ ఏడో క్లాజులో తాగునీటి కోసం గృహాలకు అందిస్తున్న నదీజలాల్లో కేవలం 20 శాతం మాత్రమే వినియోగ లెక్కల్లోకి తీసుకోవాలని ఉంది. ఈ మేరకు హైదరాబాద్ మహా నగరానికి ఏటా సరఫరా చేస్తున్న 16.5 టీఎంసీల తాగునీటితో పాటు మిషన్‌భగీరథ కింద సరఫరా చేసే జలాలతో సహా మొత్తం 36.5 టీఎంసీల్లో కేవలం 20 శాతం మాత్రమే వినియోగ ఖాతాలో వేయాలని తెలంగాణ గత కొన్నేండ్లుగా పదుల సంఖ్యలో కేంద్రానికి, బోర్డుకు లేఖలు రాసింది. కానీ ఇప్పటివరకు బోర్డుగానీ కేంద్రంగానీ దీనిపై ఒక స్పష్టమైన వైఖరి ప్రకటించకుండా పెత్తనానికి మాత్రం సిద్ధం కావడం హాస్యాస్పదం.
గుడ్డి లెక్కలతో నియంత్రణ సాధ్యమా?
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం కృష్ణా, గోదావరిపై ఉన్న తెలుగు రాష్ర్టాల ప్రాజెక్టులన్నింటినీ కేంద్రం తన పరిధిలోకి తీసుకున్నది. హైదరాబాద్ స్టేట్‌లో నిర్మించిన చిన్నా, చితకా ప్రాజెక్టులు, కాల్వలను కూడా ఆ జాబితాలో చేర్చి ప్రతి బొట్టును లెక్కిస్తామంటున్నది. మరి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుంచి ఏపీ ఏకంగా 350 టీఎంసీలకు పైగా కృష్ణా జలాలను పెన్నా బేసిన్‌కు తరలించి వాడుకుంటున్న నీటిని ఎలా లెక్కిస్తుంది?
చెన్నైకి తాగునీరు పేరిట నిర్మించిన పోతిరెడ్డిపాడులో వాస్తవంగా 189 కిలోమీటర్ల (చెన్నముక్కపల్లె)వద్ద ఆఫ్‌టేక్‌ను నెలకొల్పారు. పెన్నా బేసిన్లో ఉన్న ఆ ఆఫ్టేక్ పాయింట్ వద్ద చెన్నై తాగునీటికి ఎంత వదిలారు? శ్రీశైలం నుంచి విడుదలైన జలాల్లో 189 కిలోమీటర్ల మేర, ఒప్పందానికి విరుద్ధంగా సాగుకు ఎంత మళ్లిస్తున్నారు? ఇలాంటి వివరాలన్నీ సేకరించాల్సిన నైతిక బాధ్యత కృష్ణా బోర్డుపై ఉంది. కృష్ణా బేసిన్‌కే పరిమితమైన ఈ బోర్డు పెన్నా బేసిన్లో ఈ నీటి వినియోగ లెక్కలను ప్రత్యక్షంగా తమ ఇంజినీర్లతో తీసుకుంటున్నదా? శ్రీశైలం, సాగర్ వద్ద హెడ్ రెగ్యులేటర్ లెక్కలనే సరిపెట్టుకుంటామని సర్దిచెప్పొచ్చు. అలాంటప్పుడు తెలంగాణ కోణంలో కూడా ప్రధాన జలాశయాల వద్ద లెక్కలు తీసుకుంటే సరిపోతుంది. కానీ మధ్యతరహా ప్రాజెక్టులు, కాల్వలన్నింటినీ తన పరిధిలోకి ఎందుకు తీసుకున్నది? మంచి వరద ఉంటే తెలుగు రాష్ర్టాలు ఏటా సగటున వెయ్యి టీఎంసీల నీటిని వాడుకుంటాయి. ఇందులో ఏపీ పెన్నా బేసిన్లో ఏటా వాడుకునే 350 టీఎంసీల (35 శాతం) కృష్ణాజలాల వినియోగంపై ప్రత్యక్ష పర్యవేక్షణ సాధ్యం కాని కృష్ణా బోర్డుకు అసలు పరిధి ఎందుకు?
ఇతర రాష్ర్టాలకు ఉన్న హక్కు తెలంగాణకు ఉండొద్దా?
ప్రస్తుతం అమల్లో ఉన్న బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారమే కృష్ణా బోర్డు ద్వారా కేంద్రం ప్రాజెక్టులపై నియంత్రణ చేపడుతుందనేది నిర్వివాదాంశం. మరి అదే బచావత్ ట్రిబ్యునల్‌లో ఉన్న పోలవరం వివాదాన్ని తేల్చకుండా ఆరేండ్లుగా కేంద్రం నానబెడుతున్నది. పోలవరం పనులు మొదలైనప్పటి నుంచి ఆ ప్రాజెక్టు ద్వారా ఏపీ.. కృష్ణా బేసిన్లో వాడుకునే 80 టీఎంసీల గోదావరి జలాలకు అనుగుణంగా సాగర్‌కు ఎగువనున్న రాష్ర్టాలకు కృష్ణా జలాల్లో వాటా కల్పించాలని స్పష్టంగా ఉంది. గత ఐదారేండ్లుగా ఏపీ పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లిస్తున్నందున ఆ మేరకు మహారాష్ట్ర, కర్ణాటక బచావత్‌కు అనుగుణంగా తమకు హక్కుగా వచ్చిన 35 టీఎంసీలను కృష్ణాలో అదనంగా అనుభవిస్తున్నా యి. కానీ ఆ రెండు రాష్ర్టాలతో పాటు ఎగువనున్న తెలంగాణకు కృష్ణాలో ఆ మేరకు వాటా ఎందుకు దక్కడం లేదు? ఇతర రాష్ర్టాల మాదిరిగానే ఒక రాష్ట్రంగా మనుగడ సాధిస్తున్న తెలంగాణ బచావత్ ట్రిబ్యునల్‌లో కల్పించిన ప్రయోజనాన్ని అనుభవించవద్దా?
గుండాల కృష్ణ