గాడ్సే నిజమైన దేశభక్తుడే అయితే, తాను నమ్మిన సిద్ధాంతాల సాధన కోసం జనంలోకి వెళ్ళాల్సింది. ఓటు హక్కు అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చు. కానీ, విద్యావంతుడైనప్పటికీ గాడ్సే ఒక మొరటు పద్ధతిని ఎంచుకుని, ప్రపంచం చేత జాతి, కుల, మతాలకు అతీతంగా మహాత్ముడిగా కొనియాడబడుతున్న గాంధీజీని హత్య చేయడం అత్యంత హేయమైన చర్య.
గాంధీ జయంతి నాడు కొందరు నాథూరామ్ గాడ్సేనే దేశభక్తుడంటూ, జాతిపిత గాంధీజీ హంతకుడిని కీర్తించినట్టు వార్తా పత్రికలలోనూ, సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ కావడం అత్యంత బాధాకరం. మన దేశపు ప్రాచీన అహింసా తత్త్వం, మత సామరస్య విధానం ప్రపంచానికి తెలిసింది గాంధీజీ వల్లనే. గాంధీజీ సత్యాగ్రహ సిద్ధాంతం, నిరాడంబరత ప్రపంచ నాయకుల దృష్టిని ఆకర్షించాయి. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్నే ఆయుధంగా చేసుకుని ఇంత పెద్ద దేశానికి స్వాతంత్య్రం తేవడం ప్రపంచ నాయకులను అబ్బురపరిచింది.
గాంధీజీ సిద్ధాంతాలు సర్వకాలికమైనవి. అవి ఈనాటికీ విజయవంతంగా కొనసాగుతున్నాయి. నల్లజాతి నాయకుడు నెల్సన్ మండేలా గాంధీజీ సత్యాగ్రహ సూత్రాలను పాటించి, దక్షిణాఫ్రికాలో జాతి వివక్షను అంతమొందించారు. మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ అమెరికాలో నల్లజాతీయులు పట్ల దౌర్జన్యాలను గాంధీజీ సిద్ధాంతాలతోనే ఎదుర్కొని విజయాన్ని సాధించారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో మరొక నల్లజాతీయుడు సీజర్ ఛావెజ్ గాంధీజీ సిద్ధాంతాలతోనే తన కార్మిక ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించి గొప్ప నాయకుడిగా కీర్తి పొందాడు.
మహాత్మా గాంధీ విగ్రహాలు అమెరికాలో లెక్కకు మించి ఉన్నాయి. బరాక్ ఒబామాతో సహా అంతకు ముందటి చాలా మంది అమెరికా అధ్యక్షులు గాంధీజీ సిద్ధాంతాల పట్ల గౌరవాదరాలు కలిగినవారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్‌స్టీన్.. ‘గాంధీజీ వంటి ఒక వ్యక్తి రక్తమాంసాలతో ఈ భూమిపై నడయాడాడంటే ముందుతరాల వారికి నమ్మశక్యం కాదు’ అన్నారు.
జీవితాంతం గాంధీజీ సత్యం, అహింస ధర్మాలను పాటించారు. శ్రమలేని సంపద, వివేకాన్ని విస్మరించే విలాసం, మానవత్వంలేని శాస్త్రవిజ్ఞానం, శీలం కొరవడిన ప్రతిభ, నియమావళి లోపించిన రాజకీయం, నైతికతలేని వాణిజ్యం, త్యాగం కొరవడిన పూజ – వీటన్నిటినీ గాంధీజీ తప్పుపట్టారు.
భారతీయ చింతనలో అతిముఖ్యమైన అహింసను గాంధీజీ ఆయుధంగానూ, ఒక రాజకీయవ్యూహంగానూ చేసుకుని బ్రిటిష్ సామ్రాజ్యంపై పోరాటం ప్రకటించారు. 1920లో గాంధీజీ వ్యూహాత్మకంగా ఇచ్చిన విదేశీ వస్తు బహిష్కరణ ప్రభావంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోయి, ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరింది. అప్పటి వరకూ భారతదేశానికి ఎగుమతుల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వం 90.6 మిలియన్ స్టెర్లింగ్ పౌండ్లు ఆర్జించగా, 1930 నాటికి అది 52.9 మిలియన్ పౌండ్లకు పడిపోయింది. దీనితో బ్రిటిష్ ప్రభుత్వానికి దిక్కు తోచని పరిస్థితి ఏర్పడింది. గాంధీజీ దేశ స్వాత్రంత్య్రం కోసం మాత్రమే పోరాడలేదు. మహిళల హక్కుల కోసం, కుల వివక్షను రూపుమాపడానికి, పరిశుభ్రత కోసం కృషి చేశారు. మతవిద్వేషాలకు ఎదురు నిలిచారు. పేదరికమే అత్యంత హీనమైన హింస అని గాంధీజీ నమ్మి సామ్యవాదాన్ని ప్రచారం చేశారు.
గాంధీజీ సిద్ధాంతాలు ఈనాటికీ ఆచరణయోగ్యమే అనడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఒక మంచి ఉదాహరణ. ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏండ్ల పాటు నిర్విరామంగా గాంధీజీ సిద్ధాంతాలను పాటిస్తూ, శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపి విజయం సాధించారు. ఆరోజు గాంధీజీని అహింసతో స్వాతంత్య్రం వస్తుందా అని అవహేళన చేసినట్టే, కేసీఆర్‌ను కూడా ఎంతోమంది ఈ ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా అని హేళన చేశారు. అయినా ఆయన మనోనిబ్బరం కోల్పోకుండా ప్రాణాలకు తెగించి, ఉద్యమాన్ని శాంతియుతంగా ముందుకు నడిపారు. స్వరాష్ర్టాన్ని సాధించి తెలంగాణ గాంధీగానూ, తెలంగాణ జాతిపితగానూ కీర్తించబడుతున్నారు.
గాడ్సే నిజమైన దేశభక్తుడే అయితే, తాను నమ్మిన సిద్ధాంతాల సాధన కోసం జనంలోకి వెళ్ళాల్సింది. అప్పటికే దేశానికి స్వాతంత్య్రం లభించింది. ఓటు హక్కు అనే ఆయుధంతో ఏదైనా సాధించవచ్చు. కానీ, విద్యావంతుడైనప్పటికీ నాథూరామ్ గాడ్సే ఒక మొరటు పద్ధతిని ఎంచుకుని, యావత్ ప్రపంచం చేత జాతి, కుల, మతాలకు అతీతంగా మహాత్ముడిగా కొనియాడబడుతున్న గాంధీజీని హత్య చేయడం అత్యంత హేయమైన చర్య. ఈ విషయాన్ని నాథూరామ్ గాడ్సేని కీర్తించే వారందరూ గుర్తించాలి.
(తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్, చైర్మన్)
కోలేటి దామోదర్