ఆశ చావదు చావనీయదు
ఆకాశమంత మేఘాన్ని కలగనటం
ఒక చినుకు రాలినా సంబురపడటం
కరువులో కూడా
సహపంక్తి భోజనం వడ్డిస్తాననుకోవటం ఆశ!
గ్రహణం గంటసేపేనని
చందమామలో ధైర్యం కల్పించటం
ప్రాణాంతక వ్యాధికీ మందు ఉందన్న భరోసాను
మానవాళిలో వెలిగించటం ఆశ!
నూరేండ్ల ఆయుష్షు నూటయాభైకి పెంచాలంటూ
దేవుడి రాజ్యాంగానికి సవరణ తేవటం ఆశ!
తుఫానులో తుషార బిందువు మీద
కార్చిచ్చులో చిగురుటాకు మీద
భూకంపంలో పురుటినొప్పుల మీద
దాని దృష్టి!
ఆశకు ఆచరణ తోడైనప్పుడే
మనిషిని చిరంజీవిని చేసే సంకల్పం
సాకారమవుతుంది
పర్యవసానం ఏదైనా..
అనాది మానవజాతి పరంపరకు
ఆశ ఆక్సిజన్..
నిరాశ పాయిజన్..
అమ్మంగి వేణుగోపాల్
94410 54637