ఓవైపు సముద్రదొంగలు, అక్రమ వలసలు, ఆయుధాల స్మగ్లింగ్, జలమార్గాల ద్వారా జరుగుతున్న ఉగ్రవాద దాడులు.. మరోవైపు అంతర్జాతీయ సముద్ర జలాల్లో చైనా ఒంటెత్తు పోకడలు, ఇంకోవైపు భారీఎత్తున వచ్చిపడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో కలుషితమవుతున్న సముద్రాలు మానవాళికి చేస్తున్న పర్యావరణ హెచ్చరికలు- చుట్టుముట్టిన ఇన్ని సమస్యల నేపథ్యంలో సాగర భద్రతపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఆలస్యంగానైనా స్పందించి ఓ సమగ్ర చర్చను చేపట్టటం, ఏకాభిప్రాయంతో తీర్మానాన్ని ఆమోదించటం ముందడుగే. ఈ నెలలో భద్రతామండలికి భారత్ అధ్యక్షత వహిస్తున్నందున ప్రధాని మోదీ సారథ్యంలో ఈ కీలక అంతర్జాతీయ సమావేశం జరిగింది. ఈ వేదికను ఉపయోగించుకుంటూ మోదీ కూడా సాగర భద్రతకు పంచసూత్రాలను సూచించారు.
సాగర భద్రత అనేది భారత్‌కు ఎంతో ముఖ్యమైన అంశం. ఎందుకంటే, దేశానికి 7,516 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. ఎగుమతులు, దిగుమతుల్లో అత్యధికం హిందూమహాసముద్ర మార్గాల నుంచే జరుగుతాయి. కాబట్టి, సముద్ర రవాణామార్గాలు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఉండటం భారత్‌కు అత్యావశ్యకం. అయితే, దీంట్లో వాణిజ్యమే కాదు.. అంతర్గత భద్రత, విదేశాంగవిధానం వంటి ఇతర కోణాలు కూడా ఉన్నాయి. 2008లో ముంబైపై దాడులకు పాల్పడిన పాకిస్థాన్ ఉగ్రవాదులు అరేబియా సముద్రం మీదుగానే నగరంలోకి చేరుకొని మారణహోమం జరిపారు. మరోవైపు, మనకు పక్కలో బల్లెంలా మసులుతున్న చైనా కూడా ఇటీవలికాలంలో సముద్ర జలాల్లో దాదాగిరిని ప్రదర్శిస్తున్నది. గతేడాది లఢక్‌లో ఇరుదేశాల సరిహద్దు వద్ద ఘర్షణ జరుగుతున్న సమయంలోనే.. హిందూమహాసముద్రంలోకి తమ నౌకను పంపించి, భారత్‌ను బెదిరించే ప్రయత్నం చేసింది. అంతకుముం దు 2019లో అండమాన్ నికోబార్ దీవుల వద్ద కూడా ఓ చైనా నౌక చక్కర్లు కొట్టి వెళ్లింది.
చైనా దుందుడుకుతనం ఇక్కడికే పరిమితం కాలేదు. దక్షిణచైనా సముద్రం అంతా తమదేనంటూ ‘ఆగ్నేయాసియా దేశాల కూటమి’ (ఆసియాన్)తో చైనా ఏ రకంగా గిల్లి కజ్జాలు పెట్టుకొంటున్నదో, ఏ విధంగా జబర్దస్తీకి పాల్పడుతూ అక్రమంగా సైనికస్థావరాలను నెలకొల్పుతున్నదో ప్రపంచానికంతటికీ ఎరుకే. ఈ నేపథ్యంలోనే సముద్ర రవాణామార్గాల్లో ఆటంకాలు లేని వాతావరణం సృష్టించటం ఎంత అవసరమో, జలవివాదాలను అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా, శాంతియుతంగా పరిష్కరించుకోవటం అంతే అవసరం. 10 డిసెంబరు 1982న ‘సముద్ర చట్టం’ పేరుతో వెలువరించిన ఐరాస నిబంధనలే సముద్రాల్లో అన్ని రకాల కార్యకలాపాలకు నేటికీ వర్తిస్తాయని, దీనికి కట్టుబడి ఉండాలని భద్రతామండలి తీర్మానం పిలుపునివ్వటం ఈ దిశగా ఒక మంచి పరిణామం.