కాలంతో పాటు అన్నీ మారుతాయని విన్నాం. ఒకప్పుడు గొప్ప విలువగా ఉన్నది మారిన పరిస్థితుల్లో కాలం చెల్లినదిగా మారిపోతుంది. దీన్ని ఏ సామాజిక విలువకైనా వర్తింపజేసుకోవచ్చు. కానీ గత రెండు దశాబ్దాలుగా సరళీకరణ ఆర్థిక విధానాల నేపథ్యంలో అన్నీ మారిపోయాయి. అనేక విషయాలు, విలువలు తలకిందులుగా దర్శనమిస్తున్నాయి. 90వ దశకంలో ముందుకువచ్చిన ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ‘సంస్కరణలు’ అన్న పదం దాని మూలార్థం మార్చుకొని వికృతమైపోయింది.
ఇన్నాళ్లూ దేశభక్తి అనేది తమ గుత్తసొత్తుగా ప్రగల్బాలు పలికిన ఈ కుహనా జాతీయవాదులు ఇవ్వాళ జాతిసంపదను తెగనమ్మటం నిస్సిగ్గుగా చేస్తున్నారు. మతాన్ని, కులాన్ని చివరికి దేవుడిని రాజకీయం చేసి పబ్బం గడుపుకుంటున్న వారు రాబోయే కాలంలో దేశాన్ని ఏ దిశగా తీసుకుపోదలిచారో ప్రస్ఫుటంగానే కనిపిస్తున్నది.
సంస్కరణ అంటే.. గతం కన్నా సంస్కరించబడి ఉన్నతీకరణ చెందిన అభివృద్ధికి వ్యక్తీకరణ. కానీ దేశ పాలకుల విధాన నిర్ణయాల పుణ్యమాని సంస్కరణలు అంటే విధ్వంసంగా, విధానపరంగా వెనక్కిపోవడంగా, విలువపరంగా తలకిందులు కావటంగా తయారైంది. ఇంకా చెప్పాలంటే.. ఆర్థిక సంస్కరణలంటే విదేశీ పెట్టుబడులకు గేట్లు తెరవటంగా, పారిశ్రామిక సంస్కరణలంటే.. ప్రభుత్వరంగ సంస్థలను మొత్తం అమ్మటంగా మారిపోయింది.
స్వాతంత్య్రోద్యమ కాలంలో విదేశీ పెట్టుబడులు అంటే మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలను హరించే ఉరితాళ్లని జాతీయోద్యమ నాయకుడు దాదాభాయి నౌరోజీ అన్నారు. అనటమే కాదు, నాటి విదేశీ పెట్టుబడులన్నింటికీ వ్యతిరేకంగా ఉద్యమించారు. విదేశీ పెట్టుబడులను వ్యతిరేకించటమే దేశభక్తి. అలాంటిదిప్పుడు విదేశీ పెట్టుబడులు తేవటమే గొప్పతనంగా, దేశభక్తిగా మారిపోవటం ఓ పెద్ద సామాజిక విషాదం. ఇది కాలం తెచ్చిన మార్పు కాదు. నేటి పాలకుల్లో జాతీయభావనలో, దేశ ప్రజల భవిష్యత్తు పట్ల నిబద్ధతలో వచ్చిన వికృత మార్పు.
ఈ నేపథ్యంలోనే.. ఈ మధ్య కేంద్రం తరపున ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ రూ.6 లక్షల కోట్ల సేకరణ లక్ష్యంతో ప్రభుత్వరంగ ఆస్తులను టోకుగా ప్రైవేటుకు అప్పగిస్తున్నారు. గతంలో అయితే.. పారిశ్రామిక సంస్కరణల పేరిట నష్టాల్లో నడుస్తూ ప్రభుత్వానికి గుదిబండగా తయారైన ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటుకు అప్పగించేవారు. ఇలా దేశవ్యాప్తంగా నష్టాల ఊబిలో చిక్కి ఖాయిలాపడిన పరిశ్రమలను ప్రభుత్వం వదిలించుకున్న సందర్భాలున్నాయి. నష్టాల్లో ఉన్న ఒక పరిశ్రమను లాభాల కోసమే తాపత్రయపడే ప్రైవేటువారు ఎందుకు కొంటారు? ఎలా కొన్నారు? అనేది వేరే ప్రశ్న. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరో అడుగు ముందుకేసి లాభాల్లో ఉన్న సంస్థలనూ అమ్మకానికి పెడుతున్నారు. అదేమంటే.. నష్టాల్లో ఉన్నవాటిని ఎవరు మాత్రం ఎందుకు కొంటారని ఎదురు ప్రశ్న వేస్తున్న దుస్థితి ఏర్పడింది. లాభాల్లో ఉన్నవాటిని ఎందుకు అమ్మాలని ఎవరైనా అంటే అభివృద్ధి నిరోధకులుగా, జాతి వ్యతిరేకులుగా ముద్రవేసే రోజులొచ్చాయి.
మోదీ ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వరంగ సంస్థలుగా ఉన్న పరిశ్రమలనే కాకుండా.. దేశ సంపదగా స్థిర, చరాస్తులుగా ఉన్నవాటిని కూడా ప్రైవేటుకు అప్పగించింది. వాటిలో రైళ్లు, రైల్వేస్టేషన్లు, విమానాశ్రయాలు, క్రీడా మైదానాలు, అంతర్జాతీయ స్టేడియంలు, జాతీయ రహదారులు, ఓడరేవులు, పోర్టులు, పోర్టుల్లోని ప్రాజెక్టులు, జాతీయ సహజవాయు పైపులైన్లు, బొగ్గు గనులను ప్రైవేటు వారికి అప్పగించటానికి ఉబలాటపడుతున్నది. ఈ లెక్కన ఇవన్నీ ప్రైవేటుపరం అయిన తర్వాత గడపదాటి కాలు బయపెట్టడానికి ప్రైవేటువారి ఆమోదం అవసరం అవుతుంది. ప్రతి అడుగుకూ పన్ను కట్టాల్సి వస్తుంది. ఇప్పటికే జాతీయ రహదారులను అభివృద్ధి చేసే పేరిట రహదారులను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పటం ఫలితంగా వారు టోల్గేట్ల పేరుతో ఏ తీరున ప్రజల నుంచి వసూలు చేస్తున్నారో చూస్తు న్నాం. ఒక్కో టోల్గేట్లో ఇర వై, ముప్పై ఏండ్ల పాటు వారి వసూళ్లు వారిని ఎంత కుబేరుల ను చేస్తాయో ఊహకందనిది. రోడ్లను అభివృద్ధి చేసే పేరిట సాగిన ది ఎవరికోసమో, ఎవరి ప్రయోజనా ల కోసమో అనుభవంలోకి వస్తున్నదే.
ఇప్పటిదాకా మన ఏలికలు నష్టా ల్లో ఉన్నవాటిని ప్రైవేటుపరం చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవ్వాళ ఓడరేవులు, పోర్టు లు, బొగ్గు గనులు, విమానాశ్రయా లు, క్రీడా మైదానాలు, జాతీయపార్కులు ఎందుకు ప్రైవేటువారికి అప్పనంగా అప్పజెప్పుతున్నారో ఎవరికైనా చెప్పారా? ఇదిలాగే కొనసాగి ఎక్కడిదాకా పోతుందో ఊహించుకుంటేనే గుండెలు గుభేల్మంటున్నాయి. చివరికి గాలిని కూడా ప్రైవేటుపరం చేస్తారనటానికి సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్కులను, స్టేడియంలను ప్రైవేటుకు అప్పగిస్తున్న పరిస్థితుల్లో గాలి మిగిలి ఉంటుందని ఆశించటం అత్యాశే అవుతుంది.
ఇదంతా నేటి పాలకులు దేశ భక్తిపేరిట, జాతీయవాదం పేరిట చేయటం మరీ విడ్డూరం. ఇన్నాళ్లూ దేశ భక్తి అనేది తమ గుత్తసొత్తుగా ప్రగల్బాలు పలికిన ఈ కుహనా జాతీయవాదులు ఇవ్వాళ జాతిసంపదను నిస్సిగ్గుగా తెగనమ్ము తున్నారు. మతాన్ని, కులాన్ని చివరికి దేవుడిని రాజకీయం చేసి పబ్బం గడుపుకొంటున్నవారు రాబోయేకాలంలో దేశా న్ని ఏ దిశగా తీసుకుపోదలిచారో ప్రస్ఫుటంగానే కనిపిస్తున్నది. అంబానీ, అదాని లాంటి కుటుంబాలకు దేశ సంపదనంతా కట్టబెట్టి దేశ ప్రజలను బానిసలుగా మార్చే ప్రక్రియ వేగంగా సాగుతున్నది. ఈ అప్రజాస్వామిక, నియంతృత్వ పోకడలను ఎదిరించి నిలువరించకపోతే దేశ భవిష్యత్తు అంధకార బంధురమే.
(వ్యాసకర్త: ప్రముఖ వైద్యులు)
డాక్టర్ బండారి నరేందర్‌రావు