చరిత్ర పరిశోధన కథ లాంటిది. నేల పొరల్లో, శిథిలాల మధ్యలో, కొండ గుట్టల్లో, శాసనాల్లో, అక్షరాల మధ్యలో దాన్ని వెతుక్కొని కాలం కథను చెప్పాల్సి ఉంటుంది. తొలి కాకతీయుల కథ అలా పరిశోధించి రాయాల్సిందే. మొదటి ప్రోల తర్వాత వచ్చిన రెండవ బేత ప్రోలేశ్వర, బేతేశ్వర ఆలయాల పోషణ కోసం కొంత భూమి, ఒక ఇల్లు, దీపాలకు కావలసిన నూనెను సృష్టిలో చంద్రుడు, తారకలున్నంత వరకు అందించేందుకు ఒక గానుగను దానం చేసినట్టు అనుమకొండలోని ఒక శాసనంలో ఉంది. దీని ప్రకారం ప్రోలేశ్వరాలయం వరంగల్ జిల్లా గీసుకొండ మండలం ఎల్కుర్తి గ్రామంలో ఉన్నదని భావిస్తున్నారు. బేతేశ్వరాలయం నేటి కాజీపేట దర్గా ప్రాంతంలోనే ఉండి ఉండాలి.
రెండవ బేత అనుమకొండకు నైరుతి దిశలో శివపురం గ్రామాన్ని నిర్మించి రామేశ్వర పండితుడి కాళ్ళు కడిగి ఆయన శిష్యులకు ఆ గ్రామాన్ని దానం చేసిన సంగతి కాజీపేట దర్గా శాసనంలో ఉన్నది. దీనిప్రకారం ఆ కాలంలో కాల ముఖం అనే శైవ శాఖ వర్ధిల్లినట్లు తెలుస్తున్నది. ఈ శాసనాన్ని రాసిన దేవణభట్టు ‘ఒంటి కొండ ప్రభో దేవణ భట్టస్య మహాకవే కావ్య మిదం’ అన్నారు. అంటే ఒంటి కొండ వాసి అయిన మహాకవి దేవణ భట్టు ఈ శాసన రచయిత అని చెప్పుకున్నాడు. ఇప్పటి వరంగల్‌ను ఓరుగల్లు అనే వారనీ, దానినే ఒంటి కొండ అన్నారని తెలుస్తుంది. ‘ఒరు’ అంటే ద్రావిడ భాషలో ఒకటి అని, కల్లు అంటే రాయి అని అర్థం. అందుకే ఒక కొండ, ఒరుకల్లుగా, ఓరుగల్లు గా మారింది. మరి బేత రాజు కట్టించి కాలాముఖులకు దానం చేసిన శివపురం ఎక్కడుంది? మడికొండ, మెట్టుగుట్ట ప్రాంతాలే శివపురం అని కొందరు పరిశోధకుల అభిప్రాయం. శాసనంలో చెప్పినట్టుగా హనుమకొండకు నైరుతి దిక్కునే మడికొండ ప్రాంతం ఉంది. ఇక్కడ ఊరిలో ఉన్న రెండు ఆలయాలు, మెట్టుగుట్ట మీద రామలింగేశ్వర ఆలయం కాకతీయుల కాలం నాటివే కావటంతో ఈ వాదనకు బలం చేకూరింది.
కరీంనగర్ కలెక్టర్ బంగళాలో ఉన్న రుద్రదేవుడి మంత్రి గంగాధర కాలం (క్రీ.శ.1171) నాటి శాసనం మడికొండకు, హిడింబకు ఉన్న సంబంధాన్ని శాసనబద్ధం చేసింది. గంగాధర కట్టించిన గుళ్ళు అనుమకొండ, హిడింబాచల, నగునూరులలో ఉన్నాయని ఈ శాసనంలో ఉన్నది. ఇక హిడింబాచలం గురించి ‘హిడింబ తీర్థంబున బాడవోత్తము లుదాత్త మతులు మును భీమనాథ గేహంబు మొదల్గం బెక్కు డివిజయాలయములు సృజియించి’ అని ఉంది. దీనిలో ఉన్న హిడింబ తీర్థం, పాండవోత్తములు, భీమ వంటి పదాలు మడికొండ దగ్గరి హిడింబ కథ కాకతీయకాలంలో కూడా ఉన్నదని, ఇక్కడ కాకతీయులు కట్టించిన గుళ్ళున్నాయనీ తెలుస్తున్నది.
ఈ ప్రాంతంలో ఉన్న పెద్ద శిలల్ని హిడింబ ఆడిన గచ్చకాయలు అంటారు. ఇది పుక్కిటి పురాణం. భూమి ఏర్పడే క్రమంలో తయారైన ఈ శిలలు ఒకదాని మీద ఒకటి ఉండి విచిత్రమైన ఆకృతిలో ఉన్నందువల్ల ఇవి ప్రత్యేకత పొందాయి. హిడింబ గచ్చకాయల గుట్ట దగ్గర 1990-95ల మధ్య రాష్ట్ర పురావస్తు శాఖ చేసిన సర్వేలో మధ్య రాతి యుగపు సూక్ష్మ రాతి పనిముట్లు, కొత్త రాతి యుగపు చేతి గొ డ్డళ్లు వంటివి దొరికినాయి. ఎక్కడ రాతి యుగపు ఆనవాళ్ళున్నా ఆ గుట్టలను పాండవులకు అన్వయించడం ప్రజల్లో ఆనవాయితీగా మారిన విషయం తెలిసిందే.
వరంగల్‌కు పై భాగంలో ఉన్న గోండులు తాము భీముడికీ, హిడింబకు పుట్టిన సంతానమని భావిస్తారని కొందరు మానవ శాస్త్ర శాస్త్రజులు (ఆంత్రోపాలజిస్టులు) పేర్కొన్నారు. దీని మీద ఇంకొంచెం ఆలోచన, పరిశోధన జరిగితే హిడింబ కల్పనలకు ఉన్న నేపథ్యం బయట పడవచ్చు.