ఆయుధం లేకుండా
నెత్తురు బొట్టు రాలకుండా
ఒక్క సిరా చుక్కతోనే
మృత్యు ‘ఉపా’ఖ్యానం రాశారు
కళ్ళకు గంతలు కట్టుకొని
తూనిక రాళ్ళులేని తరాజు పట్టుకొని
గర్వంగా నిలబడ్డ తెల్లని దేవత కూడా
అటు వైపే మొగ్గింది
బతుకుకు భరోసానిచ్చే హక్కులను కాలరాచి
మనిషి చావును శ్వాసించవచ్చు..
కాలం కనీ వినీ ఎరుగని ఈ హత్యను చూసి
సిగ్గుతో తలదించుకుంది శిక్షాస్మృతి
పందొమ్మిదవ పుటకు చెదలు పట్టిందని
మూగగా రోదిస్తుంది సంవిధానం..
వచ్చే ఓటుకోసం తప్ప పోయిన ప్రాణం గురించి
బెంగ ఎవరికుంటుంది?
అసలు ప్రజాస్వామ్యరక్షణ ఎరుకే
ఇప్పుడు క్షమించరాని పాపం!
ప్రశ్నల ఇంద్ర ధనస్సును
పాశవికంగా తెగ నరకటమే
నేడు పవిత్ర ధర్మం!
పరమ నిశ్శబ్దంగా ఊపిరి దీపాలను చిదిమివేసే
ఈ వైకల్య వ్యవస్థ కోసం
వీల్‌చైర్‌ను విడిచిపెట్టి
దివ్య నక్షత్రమై అతను
గగనంలో మబ్బుల మీదికెక్కాడు.