ఆలోచన సరైంది కాకపోతే ఆచరణ వ్యర్థమవుతుంది. సంకల్పం మంచిది కాకుంటే ఫలితం బెడిసి కొడుతుంది. ప్రజా ప్రయోజనాలు పట్టకుండా.. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా మారి ఒక్కటైన ఏ బంధమైనా ఎక్కువకాలం నిలబడదు. దేశభక్తి ముసుగు వేసుకొన్న ఓ పార్టీ, నా కంటే దేశభక్తుడే లేడంటూ రంకెలేసే ఓ జర్నలిస్టు గురించే ఈ ఉపోద్ఘాతమంతా! పరస్పర ప్రయోజనాల మధ్య వాటాల పంపిణీ కుదరకపోవడంతో తెగదెంపులు చేసుకొన్న ఆ ఇద్దరి ఆసక్తికర కథ ఇది.
‘కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు. మరియా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు’ అన్నట్టు.. మొన్నటివరకూ ఆ పార్టీని అకాశానికెత్తి, ఆ పార్టీ పెద్దలు ఏంచేసినా దేశ శ్రేయస్సు కోసమేనంటూ కలరింగ్ ఇచ్చిన ఆ అరుపుల జర్నలిస్ట్ ఉన్నట్టుండి ప్లేటు ఫిరాయించాడు. అప్పటివరకూ భుజాన మోసిన పార్టీనే లక్ష్యంగా చేసుకొంటూ వాక్బాణాలు సంధిస్తున్నాడు. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంపై సర్వత్రా చర్చ మొదలైంది. అయితే, కౌటిల్యుడికి కూడా అందని ఓ కుటిల ఆర్థిక-అసూయాపర్వం ఈ విరసంలో దాగున్నదని జర్నలిస్టు వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఆ కథా కమామీషు పూర్తిగా అర్థం కావాలంటే ఓ 20 ఏండ్ల వెనక్కి వెళ్లాలి.
మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆ అరుపుల జర్నలిస్ట్ ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి వచ్చాడు. విద్యాభ్యాసం తదితరాల గురించి వదిలిపెడితే, దేశంలోని ప్రఖ్యాత ఇంగ్లీష్ మీడియా ఛానళ్లలో ఆయన పనిచేశాడు. ఓ ప్రధాన ఛానల్లో ప్రైమ్‌టైమ్‌లో ప్రసారమైన ‘నేషన్ వాంట్స్ టూ నో’ అనే షోలో ఈ జర్నలిస్ట్ అరిచిన అరుపులకు ఆయనకు పెద్ద క్రేజ్ వచ్చిపడింది. దేశభక్తి ముసుగేసుకొన్న ఓ పార్టీని మోస్తూ.. తనకు తానుగా ఓ గొప్ప దేశభక్తుడిగా ఫీలయ్యే ఈ జర్నలిస్ట్ జీవితం 2014లో మలుపుతిరిగిందనే చెప్పాలి. తాను మోసే పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడంతో ఈ జర్నలిస్టు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. అంతే కాదండోయ్.. 2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీని తొలిసారిగా ఇంటర్వ్యూ చేసింది కూడా ఈ అరుపుల మహాశయుడే.
హనీమూన్ పీరియడ్: అప్పటికే పలు ఛానళ్లలో యాంకర్‌గా పనిచేసి అనుభవాన్ని గడించిన ఈ అరుపుల జర్నలిస్టు.. ఓ ఇంగ్లీష్ న్యూస్ ఛానల్‌ను స్వతహాగా ప్రారంభించాలనుకున్నాడు. అంతే, ‘రాజు తలుచుకొంటే..’ అన్నట్టు అరుపుల జర్నలిస్ట్ ప్రారంభించే ఛానల్లో దేశభక్తి ముసుగు పార్టీకి చెందిన ఓ కీలక నేత ప్రధాన పెట్టుబడిదారిగా చేరాడు. ఓ ప్రధాన సాఫ్ట్వేర్ కంపెనీలో ఉన్నత హోదాలో పనిచేసిన మరొక వ్యక్తి కూడా సహ పెట్టుబడిదారిగా చేరడంతో నిధులకు లోటు లేకుండాపోయింది.
2017లో ప్రారంభమైన ఈ ఛానల్లో పొద్దస్తమానం ముసుగు పార్టీ భజనే. ఆ పార్టీని విమర్శించేవారిని లైవ్‌లోనే చీల్చిచెండాడుతూ స్వామిభక్తిని చాటుకోవడమే లక్ష్యమన్నట్టు ఈ జర్నలిస్ట్ వ్యవహరించేవాడు. తమ రాజకీయ ప్రయోజనాలు కాపాడుతున్న సదరు జర్నలిస్టుకు కూడా ఆ పార్టీ ఆర్థికంగా ఎంతో ఊతమిచ్చింది. సొంతంగా నిలదొక్కుకొనే స్థాయి రావడంతో తొలి పెట్టుబడిదారులకు ఎంతో కొంత లాభాలను ముట్టజెప్పి.. ఛానల్‌ను పూర్తిగా నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత హిందీ, బెంగాలీ, కన్నడలోనూ అదే బ్రాండ్ పేరిట ఇతర ఛానళ్లను ప్రారంభించాడు. అలా 2017లో మొదలైన ఈ అరుపుల జర్నలిస్టు సొంత మీడియా నెట్వర్క్ హనీమూన్ పీరియడ్ 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ నిరాటంకంగా సాగింది.
తేడా కొట్టిందిక్కడ..: 2024 లోక్‌సభ ఎన్నికల్లో దేశభక్తి ముసుగు పార్టీకి అనుకోని షాక్ తగిలింది. సింగిల్ మెజారిటీతో మూడోసారి అధికారంలోకి వస్తామనుకొంటే, మిత్రపక్షాల మద్దతు తప్పనిసరైంది. దీంతో ఆ పార్టీ కారణాలను వెతికే పనిలో పడింది. హిందీ బెల్ట్‌లో అనుకున్నన్ని సీట్లు రాలేదని గ్రహించింది. అరుపుల జర్నలిస్టును నమ్మే స్థితిలో ఎవరూ లేరని, అతని అతి ప్రచారమే ఒకవిధంగా తమ కొంప ముంచిందని విశ్లేషణకు వచ్చింది.
ఇదే సమయంలో బెంగాల్, కర్ణాటకల్లో తన ప్రత్యర్థి పార్టీలతో ప్రకటనల కోసం అరుపుల జర్నలిస్టు ప్రయత్నాలు ముమ్మరం చేశాడని ముసుగు పార్టీ పెద్దలకు ఎవరో ఉప్పందించారు. దీంతో అరుపుల జర్నలిస్టును వదిలించుకోవడమే గాకుండా, తమకు మంచి ప్రచారం కల్పించే మార్గాలను ముసుగు పార్టీ పెద్దలు వెతకడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే అరుపుల జర్నలిస్టుకు సమ ఉజ్జీలుగా చెప్పుకొనే ప్రధాన హిందీ న్యూస్ ఛానల్ ఆజ్‌తక్‌లో పనిచేసే యాంకర్లు సుధీర్ చౌదరీ, అంజనా ఓం కశ్యప్‌పై, అలాగే అంబానీకి చెందిన మరో ఛానల్ న్యూస్ 18లో పనిచేసే మరో లేడీ యాంకర్ రుబికా లియాఖత్‌కు ముసుగు పార్టీ ఆశీర్వాదం లభించింది. అంతేకాదు, సుధీర్‌కు ఏకంగా ప్రభుత్వ మీడియా ఛానల్‌ను అప్పగించింది ఆ ముసుగు పార్టీ.
అయితే, తనను కాదని తన దగ్గర ఓనమాలు నేర్చుకొన్నవారికి ముసుగు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం అరుపుల జర్నలిస్టుకు నచ్చలేదు. పార్టీ కోసం తాను ఇంత చేస్తే.. తనను నట్టేట ముంచేస్తారా? అనే భావన ఆ జర్నలిస్టులో క్రమంగా పెరిగింది. అగ్గికి ఆజ్యం పోసినట్టు.. ఇటీవల కలెక్షన్ల వర్షం కురిపించిన ఓ బాలీవుడ్ గూఢచారి సినిమాలో ముంబై పేలుళ్ల సీన్‌ను అడ్డుపెట్టుకొని తనను ముసుగు పార్టీ పెద్దలు పరోక్షంగా టార్గెట్ చేయడాన్ని అరుపుల జర్నలిస్టు జీర్ణించుకోలేకపోయాడు. దీంతో ముసుగు పార్టీ సోషల్ మీడియా కన్వీనర్తోనే వాగ్వివాదానికి దిగాడు. అయితే, ఊహించనివిధంగా ఈ అరుపుల జర్నలిస్టుకు అటునుంచి బెదిరింపులు వచ్చాయి. గతంలో నమోదైన కేసుల చిట్టా బయటపడుతుందని అటువైపు వారు బ్లాక్‌మెయిల్‌కు దిగారు. దీంతో పాలుపోని అరుపుల జర్నలిస్టు తన రూటు మార్చాడు.
అందుకే ఆ ఛేంజ్: గడిచిన 20 ఏండ్లుగా గుర్తుకురాని జర్నలిజం విలువలు.. ఉన్నట్టుండి గుర్తొచ్చినట్టు నటించడం ప్రారంభించాడు ఈ అరుపుల జర్నలిస్ట్. ఆరావళి మైనింగ్, కార్మిక చట్టాలు, ఢిల్లీ కాలుష్యం, ఇండిగో సంక్షోభం, కుల్దీప్సింగ్ సెంగార్.. ఇలా ఏ విషయాన్ని తీసుకున్నా ముసుగు పార్టీని టార్గెట్ చేస్తూ మాటల తూటాలు పేల్చడం మొదలుపెట్టాడు. మొన్నటివరకూ ముసుగు పార్టీని ఆకాశానికి ఎత్తిన ఈ అరుపుల జర్నలిస్ట్.. ఉన్నట్టుండి యూటర్న్ తీసుకోవడమేంటని? అందరూ చర్చించుకోవడం మొదలెట్టారు.
తాను స్వతంత్ర జర్నలిస్టునని, దేశం కోసమే మాట్లాడుతానని నమ్మించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు అరుపుల జర్నలిస్ట్. అయితే, అప్పటికే, జరగాల్సిన నష్టం జరిగింది. అరుపుల జర్నలిస్టును నమ్మే స్థితిలో ఇప్పుడు ఎవరూ లేరు. అయితే, అరుపుల జర్నలిస్టును నమ్మని జనం.. అతను చెప్తున్న తాజా విషయాలను మాత్రం విశ్వసిస్తున్నారు. ఎందుకో తెలుసా.. అవన్నీ నిజాలు కాబట్టి!! మొత్తంగా ప్రజా ప్రయోజనాలు పట్టకుండా.. స్వార్థ ప్రయోజనాలే పరమావధిగా మారి ఒక్కటైన ఈ బంధం ప్రస్తుతానికైతే విచ్ఛినమైంది. అయితే, భవిష్యత్తులో ఈ బంధం తిరిగి ఒక్కటైనా ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే.. ఈ రెండూ దొందూ దొందే బాపతు కాబట్టి!!
– ఎడిటోరియల్ డెస్క్