పావు వంతు పాలు
ముప్పావు వంతు నీళ్లు
నిరుడు
అటువైపే మొగ్గింది
కొన్ని జ్ఞపకాలు అత్తరు బుడ్లు
కొన్ని కలతగూళ్ళు
కాలం నెమలీక
పెయ్యి నిమురుతున్నది
పొద్దు మాపు గంజికుండ
నిత్య పరమాన్నం
రాత్రి వచ్చిన చుట్టంలా
ఇంకో ఏడాది
తెల్లవారక ముందే తోక ముడుచుకున్నది
ఎప్పటిలాగే
గోడమీది క్యాలెండరు ఎగిరిపోయింది
అలవాటు కొద్ది
తావు దొరకబట్టుకుని
మరో పన్నెండు రెక్కల పిట్ట
అక్కడే వాలిపోయింది
నవ్వేటోని ముందు బోర్లవడ్డట్టు
నిన్నటేడు
కాసులు రాలని కష్టానికి
కలలు వాడిపోయిన దుఃఖం
తిన్నది లేదు
దాచుకున్నది లేదు
కొత్త చుట్టం ముందు
కోడలు అంగలార్చుతున్నది…
– గజ్జెల రామకృష్ణ 89774 12795