కాసింత కాలం వెళ్ళిపోయాక
గుండెలో దిగులు తన్నుకొస్తుంది.
జ్ఞాపకాలు పిలుస్తున్నట్టు
ఊరిపొలిమేర పలవరిస్తున్నట్టు
ఇంకా సమయమౌతున్నట్టు
గూటికి చేరుకోమనే సందేశం
వంత పాడినట్టు
మనస్సంతా భారంగా ఉంటుంది
కళ్ళలో పొలాలు
కన్నీళ్ళలో అనుభవాలు
అనుబంధాలు దొర్లి
ఇప్పుడున్న చోట నిల్చోనీయవు.
పక్షులు ఎంత దూరం కదిలినా
గూటిని మరవనట్టు
చూపులు ఇంటివైపే
దుముకుతుంటాయి.
ఉద్దేశం విశ్వమానవుడిగానే
అయినా
కాలం పొరలు కదిలిన కొద్దీ
నా మట్టి వేళ్ళు లాగుతుంటాయి.
నా మట్టి ప్రేమ
నా మూలాలకు చేర్చుతుంది.
ఇప్పుడు కుదురుగా ఉండలేను
నా మట్టి పై అలా వాలేవరకూ.
గవిడి శ్రీనివాస్: 70192 78368