దున్నే దుక్కినడుగు
కోసే కొడవలిని అడుగు
పండే పంటను అడుగు
కల్లంల గింజలనడుగు
కష్టజీవి ఎవరని
మ్యాతరి చెప్పు నడుగు
మాదిగ డప్పును అడుగు
మంగలి కత్తిని అడుగు
చాకిరేవు నడుగు
ఉతికే బట్టల నడుగు
ఉలి బాడిచేనడుగు
విసిరిన వల నడుగు
విరిగిపోయిన నాగలిని అడుగు
చెమట కార్చిన శ్రమజీవి ఎవరని
కుమ్మరి కుండ నడుగు
కమ్మరి కొలిమినడుగు
కంసాలి పొయ్యి నడుగు
వృత్తుల మీదే వృద్ధులవుతున్నారు
గొర్రె ఉన్ని గొంగడిని అడుగు
అగ్గిపెట్టెల పట్టిన చీర నడుగు
మగ్గం మీద వయసు మాగిపోతుంది
బండరాయిని కొట్టే గన్ను నడుగు
మట్టిని పిసికిన ఇటుక బట్టినడుగు
భవనం కట్టిన కార్మికుడు ఎవరని
బతుకు మారని బాధల శ్రామికుడు ఎవరని
అద్దాల మేడకు
అద్దిన రంగుల నడుగు
సత్తువ తాపిన శ్రామికుడు ఎవరని
శ్రమజీవిని కన్నోళ్లను
కొనుక్కున్నోళ్లను కడుపు నింపే కష్టజీవిని
ఆస్తిలేని అనాథని
ఆదాయము లేని అట్టడుగు నిరుపేదని
ఆదాయం ఆస్తి రెండు రెక్కలే
రెక్కాడినా డొక్కనిండని
కూడు లేని కూలి పేద
రాజ భోగం ఏడుంది తాతలు తండ్రులు
మన తరం మనుషులు
పనిముట్లతోటే పాడవుతుండ్రు
దేవరపాగ కృష్ణయ్య: 99634 49579