ఆది నుండి
అర్థంకాని ప్రేమ సృష్టి
నిరంతర నిరాటంక
ఆలోచనల పుట్ట కాలం
కాల చరిత్రలో
మనిషి ఒక్కో అడుగు ఒక్కో పేజీగా
నడిచే అనుభవాలతో
గడిపే ఆలోచనలన్నీ
అపురూప ఘట్టాలే…
సృష్టిలో పవిత్ర ఆస్తులైన
నింగి, నీరు, నిప్పు,గాలి, మట్టిని
అవసరాలకు మలుచుకున్న
మనిషి దృష్టి, ప్రతి సృష్టి
కాలంలో అపూర్వ ప్రతిష్ఠలే…
సముద్రపు లోతు, భూమి అంచు
శిఖరపు కొన,ఆకాశపు హద్దు
మధ్యలో మనిషికి
కాలమెప్పుడూ ఓ సవాల్ .
అది నడిపే నైజమే
ఎన్నో ఆవిష్కరణలకు మూలం.
లోకంలో మనిషి ఒక్కడైనా
ఒక్కో ఆలోచన ఒక్కో అవతారమై
కన్ను సముద్రాల్ని ఈది,
గుండె ఖండాలని ఢీకొట్టి,
ఊహ ఆకాశాన్ని తాకి
ఆలోచన అంతరిక్షాన్ని గెలిచింది.
ఎంత ఎదిగినా
కాలమెప్పుడూ ప్రశ్నల ప్రతిరూపం
జీవితానికి ఎప్పుడూ పరీక్షే
రాసే కొద్దీ పదునెక్కిన విజ్ఞానం
మలిచేకొద్ది గెలిచే ఉపయోగాలే…
కాలం మనిషి కలబోతగా
సృష్టిలో అందిపుచ్చుకుని
అనుభవించే అదృష్టానికి
నడిచే ప్రతి క్షణం వరమే..
గడిపే ప్రతి రోజూ గర్వమే…
-చందలూరి నారాయణరావు, 9704437247