కేసీఆర్ను గద్దె దించుతం.. అంటూ అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్న తెలంగాణను చూసి ఓర్వలేని కొందరు వ్యక్తులు అదేపనిగా విద్వేషం గక్కుతున్నారు. ఎందుకు? రాష్ట్రం మొత్తాన్ని కేసీఆర్ తన
కుటుంబంగా భావిస్తున్నందుకా? అన్నివర్గాల ప్రజల ఆపదలు తీరుస్తున్నందుకా? అడగకముందే
ఆసరా పింఛన్లు ఇచ్చి కన్న కొడుకై ఆదుకుంటున్నందుకా?ఎందుకు గద్దె దించుతరు? ఎవరి ప్రయోజనాల కోసం? ఎవరిని అందలం ఎక్కిస్తరు? ఈ సంక్షేమ పాలనను కాదని ఏ అరాచకాన్ని అందలమెక్కిస్తరు?
ఇప్పుడు రాష్ట్రంలో ఏం తక్కువైందని! ఏ వర్గం ప్రజల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఈ కక్షపూరిత విమర్శలు. అభివృద్ధి, సంక్షేమాలను రెండు కండ్లుగా రాష్ట్రంలో పాలన సాగుతుంటే.. ఈ ఈర్ష్యాద్వేషాలెందుకు? వలసబాటలు బట్టి పట్టణాలకు బతుకవోయిన బాధల నుంచి ఇయ్యాల ఉన్న ఊర్లెనే ఇంత బతుకుదెరువు చూపించినందుకా? రైతులకు ఉచిత కరెంటును ఇస్తున్నందుకా? రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధు ఇస్తున్నందుకా? ఇంటి ఆడపిల్లను కల్యాణలక్ష్మిగా తయారు చేస్తున్నందుకా? ఎందుకు? ఎందుకు గద్దె దించుతరు?
ఒకప్పుడు భూ తనఖా బ్యాంకులకు భయపడి ఇండ్లిడిసిపోయిన రోజులు మర్చిపోయిండ్రా? తలుపులు పీక్కపోతే పాతగోడల్ల సోకాలు బెట్టిన సంగతి మర్చిపోయిండ్రా? ఎండకాలమొస్తే గొడ్లకు నీళ్లు లేక నీళ్ల ట్యాంకులు తెచ్చిన సంగతి మర్చిపోయిండ్రా? వచ్చీరాని గుడ్డి కరెంటుతో ఎన్ని అవస్థలు తీసినమో మర్చిపోయిండ్రా? మోటర్లు, స్టాటర్లు గాలి, కారుకు అరవై సార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే పొలాలు ఎండబెట్టి, ఎడ్లను మేపిన సంగతి మర్చిపోయిండ్రా? ఇట్ల ఎన్నని చెప్పాలె? ఎంత అరిగోస పడ్డమో ఎరుకలేదా?
ఏనాడైనా అనుకున్నామా ఇట్ల 24 గంటల కరెంటు ఉంటదని, మల్లా మన వాగులల్ల నీళ్లు పారుతయని! మన చెరువులు అలుగులు దుంకుతయని! ఏండ్ల తరబడి పునాదిరాళ్లతోనే ఎక్కిరించిన ప్రాజెక్టులు ఏకబిగిన పూర్తయితయని అనుకున్నమా? సముద్రంలో కలిసే నీళ్లు ఎనుకకు మళ్లి కాళేశ్వరస్వామి కాళ్ళు కడుగుతయని, మల్లన్నసాగర్ నిండి మన బీళ్లలో పంట పండుతదని ఊహించినమా? అసాధ్యం అనుకున్న ఎన్నింటినో సుసాధ్యం చేస్తున్నది కేసీఆర్ కాదా? చిరకాల దరిద్రం పోయి, ఆత్మగౌరవంతో తలెత్తుకొని నిలుచున్నం అంటే దానికి కేసీఆర్ కారణం కాదా?
ఎందుకింత బేమాన్గొట్టుతనం..? కేసీఆర్ తన ప్రాణాలను పణంగా పెట్టి రాష్ర్టాన్ని సాధించినందుకా? దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపినందుకా? నిజంగా మనం మనుషులమైతే ఇన్నితీర్ల జనం బాగోగులు చూసే ముఖ్యమంత్రి పట్ల ఎంత కృతజ్ఞతగా ఉండాలె. ఎన్ని జన్మలకు రుణపడి ఉండాలె. ఏది మన నిజాయితీ?. మీరు చేయబోయేదేమి? ఢిల్లీ పెత్తనమో, ఆంధ్రా పెత్తనమో మా మీద రుద్దడం తప్ప మీరు ఇంతకుముందు చేసిందేమిటి? భవిష్యత్తులో చేయబోయేదేమిటి? పచ్చి బేమాన్ మాటలు గాకుంటే కండ్లముందు జరిగిన ఇంత మార్పు కనిపిస్తలేదా? ఇప్పటిదాక దేశాన్ని ఏలినోళ్లు, ఈ రాష్ర్టాన్ని పాలించినోళ్లు ఏం జేసిండ్రు?
తిని మరిచిపోయే నేలగాదు మన తెలంగాణ. తిన్నోడు మర్చిపోయినా పెట్టినోని గురించి చూసినోడు చెప్పాలన్న ఒకే ఒక్క కారణంతో ఈ నాలుగు విషయాలు. నిజం నిష్ఠూరంగనే ఉంటది. నిజాన్ని ఒప్పుకోవడమంటే నిప్పును అరచేతిలో పట్టుకోవడమే కదా? అది మీకెట్లాగు సాధ్యం కాదు. కట్టుకథలు జెప్పి కయ్యాలు పెడుతుంటే ఏం జెయ్యాలె? ప్రజాస్వామ్యమని, పత్రికాస్వామ్యమని వ్యక్తిగత విమర్శలతో విషం గక్కుతుంటే చేతులు ముడుచుకోవాల్నా? చేష్టలుడిగి చూడాల్నా? తిడుతోన్ని తిట్టనిచ్చి, కొడుతోన్ని కొట్టనియ్యడమేనా ప్రజాస్వామ్యమంటే!
బతుకంతా కొట్లాడి అలిసిపోయిన తెలంగాణ ఇప్పుడు కదా జరంత నిమ్మలంగున్నది. ఈ ఆరేడేండ్ల నుంచే కదా ఏ బాధ లేకుంట బతుకుతున్నది. రోడ్లు ఏసే కాడ, ప్రాజెక్టులు కట్టేకాడ, నష్టపరిహారం చెల్లించేకాడ కొంత ఎనకముందు కాదా? ఎనకో ముందో అందరికి న్యాయం జరుగుతలేదా? ఉన్నఫలంగ అంతా తేటగ కావాలంటే అయ్యేదేనా?
ఇప్పటికీ ఇక్కడింకా ఆంధ్ర కీలుబొమ్మలాట కొనసాగుతూనే ఉందన్న సంగతిని గమనించలేమా? ‘ఓటుకు నోటు’ వెనుక ఉన్న భాగోతమేంది? ఉద్యమనేతగా కేసీఆర్ వేయికండ్లతో కాపలా కాయడం వల్ల గదా మనం ఇయ్యాల ఇంత నిమ్మలంగున్నది. లేకుంటే మనల్ని బతుకనిస్తరా, బాగుపడనిస్తరా? కోడి తన రెక్కల కింద పిల్లల్ని దాసినట్టు, ఎన్ని గద్దలు ఏకమై వచ్చినా మనలను రక్షించటానికి కేసీఆర్ ఎప్పుడూ అప్రమత్తంగానే ఉన్నరు, ఉంటున్నరు.
కేసీఆర్ ఓ సామాజిక ఉద్యమకారుడే కాదు, జ్ఞానసంపన్నుడైన పాలకుడు. అధికార దాహంతో వెంపర్లాడే అజ్ఞానులకు ఏనాడూ అర్థం కాడు. పద్నాలుగేండ్లు పక్కెంట నడిసినోళ్లం. పేగుబంధమై పెనవేసుకున్నోల్లం. మనం కాకపోతే కేసీఆర్ను అర్థం చేసుకునేదెవ్వరు, ఆయనకు అండగా నిలబడేదెవ్వరు? ఆంధ్రా, కేంద్రశక్తుల బేమాన్తనం వికృతరూపం దాల్చుతున్న ప్రస్తుత తరుణంలో తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది.