ఫేక్ ఫేసుబుక్కు అకౌంట్‌తో
ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి
నీ ఫోన్ల దూరుతడు…
ఎంత సక్కంగున్నవేనంటూ ఎంటపడుతడు…
‘ఒక్క సెల్ఫీ ప్లీజ్’ అంటూ సతాయిస్తడు…
వాట్సాప్ మెసేజ్‌లతో
ప్రేమ లొల్లి షురూ జేస్తడు
ఆడి మాయమాటలకు,
కల్లబొల్లి కబుర్లకు మురిసినవనుకో…
నీ ఫొటోలన్నీ బజాట్ల వేలం పాటకు పెడతడు…
ముక్కు మొఖం తెలియనోన్ని నమ్మి
సైబర్ ఉచ్చుల సిక్కుకోకే చెల్లీ
నీ బంగరు బతుకును
బుగ్గిపాలు చేసుకోకే తల్లీ…
జర పైలం!
ఉచితం అంటూ ఊరిస్తడు
ఉన్నదంత ఊడ్చేస్తడు!
కోట్ల బహుమతి ఒచ్చిందంటడు
ఓటీపీ సెప్పమంటడు నీ వేలు జారిందంటే సాలు
నీ బ్యాంకుల పైసలన్నీ ఖతం జేస్తడు
సైబర్ ఉచ్చుల సిక్కుకోకు తమ్మీ…
తల్లెలమ్మి చెప్పులు కొనుక్కోకుర తమ్మీ…
జర పైలం!
ఆపదలో ఉన్ననంటడు
అద్దె మొఖంతో అడుక్కుంటడు
నమ్మి సాయం జేయకమ్మి
నట్టింట్ల ఏడుస్తూ కూర్చోకు అమ్మి…
నెట్టింట్ల నట సామ్రాట్ల
మోసాలు తెలుసుకో సుమ్మి… జర్ర జాగ్రత్త!
ఏమున్నయో దాన్లంటూ
తెలియని యాపులల్ల
తొంగి సూడకన్న
నొక్కినవంటే జైలు
సెల్‌లోకి జారినట్టేనన్న
జర పైలం!
బోలెడు పుస్తకాలు సక్కగ
సదువుకోండ్రి
తెలియనివి గూగులమ్మను అడిగి తెలుసుకోండ్రి
చేతులు కాలినంక… ఆకులు పట్టుకోకుండ్రి
సోంచాయించి అడుగు ముందుకేయుండ్రి!
సైబర్ ఉచ్చుల సిక్కుకోకుండ్రి
నెట్టింటి ఊబిలకు జర్రున జారిపోకుండ్రి…
అయ్యలూ… అమ్మలూ… అక్కలూ… అన్నలూ
చెల్లె తమ్ముళ్లూ… జర పైలం!
చంద్రకళ దీకొండ
93813 61384