ముస్లింవాద రచయితలు తెలుగు భాషను సొంతం చేసుకొని తమదైన యాసలో ఉర్దూ పదాలతో కూడిన తెలుగు భాషలో ఒక ప్రత్యేక శైలిని సృష్టించుకొని తమవైన భావచిత్రాలతో, ఉపమానాలతో రచనలు చేశారు. ఒకప్పుడు ‘ఉర్దూ’పై ముస్లింల భాష అనే భావన ఉండేది. కానీ ఇప్పుడు ముస్లిం యువ రచయితలు తెలుగులో ప్రతిభావంతంగా రచనలు చేసి ఒక ప్రత్యేక భాషాశైలిని సృష్టించారు. అఫ్సర్, అలీ, యాకూబ్, స్కైబాబా, కరీముల్లా, ఖాజా, అన్వర్, ఖాదర్ మొహియొద్దీన్, షాజహానా, హనీఫ్, దిలావర్, జమిలా నిషాత్, అనీస్ పర్వీన్ మొదలైన వారెందరో కథలు, కవిత్వం రాస్తున్నారు. మరే ప్రాంతం నుంచి లేనంతగా ముస్లిం వాద సాహిత్యం తెలంగాణ నుంచి వచ్చింది.
ఆంధ్రా ప్రాంతంలో ‘ఇస్లాం వాదం’ పేరుతో కొన్ని రచనలు వచ్చాయి. కానీ ఆ వాదం నిలువలేకపోయింది. ఖాజా ముస్లిం వాద తాత్త్వికతను చర్చిస్తూ మంచి విమర్శా గ్రంథం రచించాడు. ‘ముస్లిం వాదం’ అనేది ఒక్క తెలుగులోనే బలంగా వినిపిస్తుండటం గమనార్హం. దేశంలో ఏ ప్రాంతం నుంచి ఏ భాషలో కూడా ముస్లిం వాదం అనేది ఇంత బలంగా కన్పించటం లేదు. తెలంగాణ రచయితలే ఆ వాదాన్ని బలంగా వ్యక్తీకరిస్తూ రచనలు చేయటం గమనించదగినది.
‘గ్లోబలైజేషన్’ అనే పదాన్ని మనం తెలుగులో ‘ప్రపంచీకరణ’ పేరుతో అనువదించుకొంటున్నాం. ఈ ప్రపంచీకరణలో ప్రపంచమంతా ఒకే మార్కెట్‌గా మారిపోయి దేశాలన్నీ దగ్గరైనాయి. ఆధునిక సమాచార సాంకేతికతతో ప్రపంచమంతా ఒక కుగ్రామంగా మారిపోయింది. పెట్టుబడిదారీ రాజ్యాలు తమ పెట్టుబడులను అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెట్టడంతో వారి భాషా, సంస్కృతులను తమ మీద రుద్దుతున్నాయని ఆయా దేశాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ క్రమంలోంచే తమ భాషా సంస్కృతుల మీద అభిమానం పెంచుకున్నారు. ప్రపంచీకరణలో ఒక దేశం మరో దేశం మీద ఆర్థిక, సామాజిక పెత్తనం చెలాయిస్తున్నదని ప్రపంచ దేశాలు ముఖ్యంగా వెనుకబడిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. అలాంటి స్పందన తెలంగాణలో కూడా ప్రతిబింబించింది.
ముఖ్యంగా 90ల తర్వాత సాహిత్యంలో ప్రపంచీకరణ, సామ్రాజ్యవాద పెత్తనం ప్రధాన వస్తువు అయింది. ప్రపంచీకరణను ఎదిరిస్తూ విమర్శిస్తూ తెలుగులో విస్తారంగా సాహిత్య సృష్టి జరిగింది. ప్రపంచీకరణను నిరసిస్తూ, వ్యతిరేకిస్తూ కవిత్వం, నవల, పాట తెలుగు సమాజాన్ని జాగృతం చేసింది.
గోరటి వెంకన్న రాసిన పాట- ‘పల్లే కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రల’, అందెశ్రీ రాసిన ‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడూ.. మచ్చుకైన లేడు సూడు మానవత్వం ఉన్నవాడూ…’ పాటలు ప్రపంచీకరణ ప్రమాదాన్ని విప్పిచెప్పాయి. ప్రపంచీకరణ దృష్టికోణంలో తెలంగాణ సాహిత్యకారులు మరో ప్రాంతం ఆధిపత్యాన్ని, దోపిడీని, వివక్షను, వెక్కిరింతలను నిరసిస్తూ సాహిత్య సృజన చేశారు. ఈ నేపథ్యంలోంచే 1990 దశకం ప్రారంభంలో తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వవాదం ఆరంభమైంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆకాంక్ష మొదలైంది. ఆంధ్రా ప్రాంతం వాళ్లు తమ వనరులను, నీళ్లను, నిధులను దోచుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తున్నారని గుర్తించి వ్యతిరేకించారు. ఆ క్రమంలోనే వారి (సీమాంధ్ర) భాషా సంస్కృతిని తెలంగాణ మీద రుద్దుతున్నారని తెలంగాణ రచయితలు ఆక్షేపించారు. ఈ క్రమంలోంచే తెలంగాణ సమాజంలో, సాహిత్యంలో ప్రాంతీయ అస్తిత్వవాదం పురుడుపోసుకున్నది.
గతంలో కూడా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలనే డిమాండ్‌తో ఉద్యమాలు జరిగాయి. 1952 లోనే
‘ఇడ్లీ-సాంబార్ గో బ్యాక్’ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాత కాలంలో 1969లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం జరిగింది. తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు, కాలేజీల విద్యార్థులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. పోరాటం మధ్యలో రాజకీయ నాయకుడు మర్రి చెన్నారెడ్డి ప్రవేశించి తెలంగాణ ఉద్యమానికి నాయకుడిగా నిలిచాడు.
సీమాంద్ర వలస పాలక ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంపై తీవ్ర దమనకాండను ప్రయోగించింది. 369 మంది పోలీసు కాల్పుల్లో చనిపోయారు.రాజకీయ నాయకత్వం కూడా నాడున్న జాతీయ, స్థానిక ప్రత్యేక పరిస్థితుల కారణంగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేకపోయింది. తెలంగాణ సాధన ఆకాంక్ష, కలగానే మిగిలిపోయింది.
కానీ 1990ల నుంచి ఊపిరి పోసుకున్న మలిదశ తెలంగాణ ఉద్యమానికి తెలంగాణలో అప్పటికే వేళ్లూనుకొని సాగుతున్న ప్రజా ఉద్యమాలు వెన్నుదన్నుగా నిలిచాయి. తెలంగాణవాదం స్థిరీకరణ పొంది విస్తృతమైందంటే ఉద్యమాలే కారణమని చెప్పక తప్పదు.
-ముదిగంటి సుజాతారెడ్డి , 99634 31606