ఏ సందర్భంలోనైనా మనిషికి అవసరమైనది ధైర్యమే. అది లోపించినప్పుడు మనిషి ఒకవిధమైన మానసిక ఆత్మన్యూనతకు లోనవుతుంటాడు. ఒక్కోసారి ఎంతటి పరాక్రమవంతుడైనా, ఎంతటి శక్తిమంతుడైనా అధైర్యానికి గురవుతుంటాడు. అది దుఃఖానికి దారితీస్తుంది. కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడి స్థితి సరిగ్గా అటువంటి మానసిక వేదనకు దారితీసింది. అప్పటివరకు అతని పరాక్రమ వెలుగు దుర్నిరీక్ష్యమై, శత్రువులు తేరిపార చూడగలిగే స్థాయిలో లేనిది. విరాటనగరిలో కౌరవులతో పోరిన సందర్భమైనా, గంధర్వులతో యుద్ధం చేసి దుర్యోధనాదులను విముక్తులను చేసినప్పుడు అర్జునుడు ఎంతటి శౌర్యధనుడో భారతం చెప్పింది. అయినా, అతనిలో ఆవరించిన ఒకానొక మాయ అర్జునుడిని ఆత్మన్యూనతకు, అంతులేని విషాదానికి లోనుచేసింది. ఒకవిధంగా పిరికివాణ్ని చేసింది. అప్పుడు స్వయంగా రథసారథిగా ఉన్న కృష్ణ పరమాత్ముడే జీవనసారథిగా సవ్యసాచిలోని ధీరుడైన అర్జునుడిని మేల్కొలిపాడు.
క్లెబ్యం మా స్మ గమః పార్థనైతత్త య్యుపపద్యతే
క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప॥ (2-3)
‘అర్జునా! ఏ మాత్రం అధైర్యపడకు. ఇది నీకు తగిన పనికాదు, నువ్వు పరంతపుడివి (శత్రువులను పీడించగలిగే వాడివి) కదా! లే!! నీచమైన హృదయ దౌర్బల్యాన్ని వీడు..’ అని శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించాడు. అర్జునుడికి మాత్రమే కాదు, మానవ సమాజానికి కూడా ఈ మాటలు అన్వయమవుతాయి. ఎప్పుడైనా అధైర్యమనేది అవాంఛనీయమైన గుణం. మనిషిలో ఆత్మవిశ్వాసానికి అది గొడ్డలిపెట్టు. పురోగమించాలన్న స్ఫూర్తికి అది ప్రధాన ప్రతిబంధకం. అశక్తత ఆవరించేవిధంగా మనిషిని బలహీనపరిచేది అధైర్యమే! అందుకే దౌర్బల్యం వీడమని స్వామి హెచ్చరించాడు. ‘ైక్లెబ్యం’ అనే మాటకు నపుంసకత్వం, అధైర్యం అనే అర్థాలున్నాయి. పౌరుషం ఎంతటి భయానక పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి పురోగమించేలా మనిషిని సిద్ధపరుస్తుంది. అందుకే అధైర్యాన్ని వదిలిపెట్టి, విల్లు ఎక్కుపెట్టమని ప్రోత్సహించేలా ధైర్యం నూరిపోశాడు. అర్జునుడి విషాదాన్ని పోగొట్టడానికి దేహం, దేహి వంటి అనేక విషయాలను బోధించి అతనిలో ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేశాడు శ్రీకృష్ణుడు.
ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రస్తావించిన ‘పరంతప’ పదం కూడా అర్జునుడి అసాధారణ శక్తిని స్ఫురింపజేస్తుంది. అర్జునుడి బలాన్ని, పరాక్రమాన్ని అతనికి మరోసారి జ్ఞప్తికి తెచ్చే ప్రయత్నం చేశాడు భగవానుడు. అతని స్వశక్తిపై గొప్ప విశ్వాసం కలిగించే దిశగా బలాలను గుర్తుచేశాడు. మనిషి కేవలం శారీరకంగా బలవంతుడు కావడమే కాకుండా, మానసికంగా కూడా శత్రు నిర్మూలనకు సంసిద్ధుడు కావాలి. శ్రీకృష్ణుడి బోధ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తుంది.
ఏ కాలంలో అయినా ధర్మ విరుద్ధంగా ప్రవర్తించేవారిని శిక్షించవలసిన బాధ్యత పౌరుషవంతులపై ఉంటుంది. అటువంటి శక్తిమంతులు ఉదాసీనులై ఊరకుండిపోవడమో, తమశక్తిని విస్మరించి ‘క్లీబత్వం’ (అధైర్యం)తో వెనకడుగు వేస్తే అది సమాజానికి ప్రమాదం. ‘యుద్ధమనే క్రూర కర్మను నేను చేయలేన’ని అర్జునుడు ఆవేదన వ్యక్తం చేస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ‘ఈ పిరికితనం నీకు వర్తించే గుణం కాదు. నీ మనసును ఒకానొక సమయంలో మాయపొర ఆవరించిన కారణంగా ఈ విధమైన విషాదాన్ని అనుభవిస్తున్నావ’ని అంటాడు శ్రీకృష్ణుడు. దుష్టశిక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం యుద్ధం చేయమని ప్రోత్సహించాడు.
ప్రతి వ్యక్తిలో బలాబలాలు రెండూ ఉంటాయి. కానీ, తన వివేచనాశక్తితో, ఆత్మ ప్రత్యయంతో వ్యవహరించి బాధ్యతను గుర్తించాలి. తన బలాన్ని రెండింతలు చేసుకొని ధర్మరక్షణకు సిద్ధపడాలి. తనలోని బలహీనతలన్నీ అధిగమించగలిగే మానసిక పరిణతిని మనిషి సాధించాలన్న భగవద్గీత అభిభాషణం సార్వకాలికం, సార్వజనీనం. సర్వదా ఆచరణీయం.
–గన్నమరాజు గిరిజామనోహరబాబు