మనిషికీ, జంతువుకు తేడా ఏమిటి అంటే చాలా మంది.. ‘మనం ఆలోచిస్తాం అవి ఆలోచించవు అనో, మనం నవ్వుతాం అవి నవ్వవు అనీ, మనం ఎమోషనల్ అనీ, అవి కాదనీ ’ ఇలాఎన్నో చెబుతారు. అసలు మనిషికీ జంతువుకూ తేడా ఏమంటే మనం ఒక పనిముట్టును, లేదా ఒక వస్తువును ఉత్పత్తి చేస్తాం, అవి చేయలేవు. జంతువులు ప్రకృతిలో దొరికే వాటిని వాడుకుంటాయి కానీ తమ అవసరానికి అనుగుణంగా మార్పులు చేసుకొని ఆహారాన్ని సంపాదించుకోలేవు. ఈ ప్రత్యేకత, ఈ నైపుణ్యం మనిషికే సాధ్యమైంది.
రాతి యుగం మొదలుకొని లిఖిత పూర్వక ఆధారాలకు ముందున్న కాలాన్ని చరిత్ర పూర్వ యుగం అంటారు. ఈ కాలపు మనిషి చరిత్రను తెలుసుకోవాలంటే ఎటువంటి రాతపూర్వక ఆధారాలు ఉండవు. ఈ లక్షల ఏండ్ల చరిత్ర నదీతీరాల్లో, భూమి పొరల్లో, కొండ గుహల్లో, రాతి గుట్టల్లో- రాయి, జంతువుల ఎముకలు, శిలాజాలతో చేసిన పనిముట్ల రూపంలో, గుహలు, గుట్టలలోని చిత్రాల రూపంలో, రాతిపై చెక్కిన‘పెట్రొగ్లిఫ్స్’ రూపంలోనో మనకు దొరుకుతాయి.
భూమ్మీద సుమారు 25 లక్షల ఏండ్ల కింద పాతరాతియుగం మొదలైంది. అయితే మన తెలంగాణలో పాత రాతియుగం 1,25,000 ఏండ్ల కింద మొదలై 10 వేల ఏండ్ల కిందటి వరకు కొనసాగిన ఆధారాలున్నాయి. ఈ విధంగా సుమారు లక్ష ఏండ్లున్న పాతరాతియుగ చరిత్రను మూడు దశలుగా చూడాలి.
1,25,000 నుంచి 40,000 ఏండ్ల క్రితంవరకు –
దిగువ పాతరాతియుగం
40,000 నుంచి 20,000 ఏండ్ల క్రితంవరకు –
మధ్యపాతరాతియుగం
20,000 నుంచి 10,500 ఏండ్ల క్రితంవరకు –
ఎగువ పాతరాతియుగం
తెలంగాణ నేల మీద జీవం పుట్టుక, అందులో భాగంగా మనిషి పరిణామక్రమానికి సంబంధించిన కథ ఎంతో ప్రాచీనమైనది. గోదావరి, కృష్ణా నదులు, వాటి ఉపనదులు వాటికి పాయలుగా ఉన్న ఏరులు పాత రాతియుగపు ఆనవాళ్లను ఇప్పటికీ మనకు అందిస్తూనే ఉన్నాయి. తెలంగాణ నిండా కనీసం వందస్థలాల్లో మనకు పాతరాతియుగపు పనిముట్ల నుంచి కొత్తరాతియుగం వరకు అన్నిదశల ఆధారాలు దొరుకుతున్నయి. ఎందుకంటే ఇక్కడ మనిషి జీవించడానికి కావలసిన నీరు, ఆహారంగా తీసుకోవటానికి వీలైన జంతువులు, ప్రాకృతిక సంపద, రాతి పనిముట్లకు కావాల్సిన ముడిరాయి విస్తృతంగా దొరుకుతుంది కాబట్టి.
అయితే కొద్ది మంది మాత్రమే తెలంగాణలో రాతియుగంపై పరిశోధనలు చేసినందున, కనుగొన్న ఆధారాల కాలాన్ని ‘రేడియో కార్బన్ డేటింగ్’ వంటి శాస్త్రీయ పద్ధతులద్వారా నిర్ధారించక పోవడంవల్ల తెలంగాణలో పాతరాతియుగానికి సంబంధించిన జ్ఞానానికి పరిమితులున్నాయి. అదే కొత్తరాతియుగం, బృహత్ శిలాయుగంపై తవ్వకాలు, సమాచారం విస్తృతంగా ఉంది.
తెలంగాణలో చరిత్ర పూర్వయుగ పరిశోధన నిజాం ప్రభుత్వ హయాంలో గులాం యజ్దానీ నేతృత్వంలోని ఆర్కియాలజీ శాఖతో మొదలైంది. ఆ తర్వాత కాలంలో విస్తృత పరిశోధన చేసిందీ, రాసిందీ మాత్రం ఇద్దరే. వారు ఠాకూర్ రాజారాం సింగ్, వీవీ కృష్ణశాస్త్రి.
అచ్చంపేట, మేడిమెనికల, అప్పాపూర్, బౌరాపూర్ – ఇవన్నీ నల్లమల అడవుల్లో పాతరాతియుగపు చేతి గొడ్డళ్లు, గోకుడురాళ్లు (స్క్రేపర్స్), మాంసాన్ని చీల్చడానికి వాడే రాతిపనిముట్లు (క్లీవర్స్, చోపర్స్) దొరికిన ప్రాంతాలు. క్వార్ట్ అంటే స్ఫటికం వంటి రాతితో చేసిన ఈ పనిముట్లు దొరకడంతో.. తెలంగాణలో దిగువ పాతరాతియుగం అంటే మానవ చరిత్ర తొలినాళ్లకు కృష్ణాలోయ చిరునామాగా నిలుస్తున్నది. నాగార్జునసాగర్‌లో మునిగిన ఏలేశ్వరం, జూరాల ప్రాజెక్టులో మునిగిన ఈర్లదిన్నె, కృష్ణాలోయలో ఉన్న క్యాతూర్, చంద్రగుప్తపట్టణం, ప్రాగటూరు, నల్లగొండ జిల్లాలోని హాలియా, డిండి.. ఇలా కొన్ని పదుల స్థలాల్లో పాతరాతియుగపు ఆనవాళ్లు దొరికాయి.
గోదావరి పరీవాహక ప్రాంతాన్ని చరిత్రపూర్వయుగ ఆధారాల కోసం జల్లెడ పట్టిన ఠాకూర్ రాజారాం సింగ్ కొన్ని వందల పాతరాతియుగపు స్థలాల్ని కనుగొన్నారు. కొన్నివేల రాతిపనిముట్లను, కొన్ని ప్రాంతాల్లో అయితే జంతుశిలాజాలతో సహా సేకరించి పనిముట్ల తయారీస్థలాలు, వేటాడి, తిన్న స్థలాలను సైతం వెలుగులోకి తెచ్చారు. చేతిగొడ్డళ్లు, చీలిక పనిముట్లు, గులకరాతి పనిముట్లు ఇలా ఎన్నోరకాలు దొరికినయి. రామగుండం, గోదావరిఖని, మంచిర్యాల దగ్గర నస్పూర్, వేమనపల్లి, పెద్దపల్లి జిల్లా మేడిపల్లి, సుందిళ్ల, సబ్బితం, ఆదిలాబాద్ జిల్లాలో పొచ్చెర జలపాతం దగ్గర, ములుగు జిల్లా ఎక్కెల, సెలిబాక.. ఇలా వందకు పైగా స్థలాల్లో పనిముట్లను సేకరించారు రాజారాం సింగ్. ఆయన సేకరించిన రాతి పనిముట్లతోనే ఒక చిన్న మ్యూజియం ఏర్పాటు చేయవచ్చంటే గోదావరి పరీవాహక ప్రాంతంలో చరిత్ర పూర్వయుగం ఎంతగా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్యే ప్రాణహిత-గోదావరి బేసిన్లో భాగం అయిన ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి, గిన్నెధారి ప్రాంతాల్లో ఈ వ్యాసకర్త సేకరించిన పాతరాతియుగపు చేతిగొడ్డలి ఇంకా మన పరిశోధన ఎంత విస్తరించవలసి ఉందో తెలియజేస్తుంది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో అప్పారెడ్డిపల్లి, సత్వార్ గ్రామాల్లో 1958-59లోనే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజిస్టు ఏవీ నరసింహమూర్తి పాతరాతియుగానికి చెందిన పనిముట్లను సేకరించారు. సుమారు రెండున్నర దశాబ్దాల తర్వాత 1982-83లో సింగూర్ ఆనకట్ట నిర్మాణానికి ముందు సింగూర్, జన్వాడ మధ్య 60 కిలోమీటర్ల ప్రాంతంలో 20,000- 10,000 ఏండ్ల మధ్యకాలానికి చెందిన పాతరాతియుగం నాటి గోకుడు రాళ్లు (స్క్రేపర్స్) డీఎల్ఎన్ శాస్త్రి అనే పరిశోధకుడికి దొరికినయి. గోదావరి, కృష్ణ, మంజీర గురించి చెప్పినామంటే కేవలం ఇక్కడమాత్రమే పాతరాతియుగం ఆధారాలు ఉన్నాయని కాదు. తెలంగాణలో కృష్ణా, గోదావరులు, వాటి ఉపనదులు, వాగులు అంతటా విస్తరించింది పాత రాతియుగం. నదుల తీరాల్లో, గుట్టల్లో చరిత్ర పరిశోధకుల వెతుకులాట చరిత్ర పూర్వయుగంతో సహా అన్నిచారిత్రక కాలాల్ని ఆవిష్కరిస్తుంది.
వేట, ఆహారసేకరణ ఈ రెండే మన మానవజాతిని లక్షల ఏళ్లు బతికించింది. గుంపుగా తిరుగుతూ వేటాడే వారు. నీరు, ఆహారం కోసం, వెతుకులాట వీరిని తిరుగుతూ ఉండేలా చేసింది. పాతరాతియుగపు ఆనవాళ్లతో పాటు ఆనాటి జంతువుల ఎముకలు కూడా దొరకడం నాటి పరిస్థితుల్ని, అప్పుడు ఉన్న జంతు, వృక్షరాసుల ఉనికినీ తెలుపుతుంది. అడవిదున్నలు (బైసన్), అడవినక్కలు, గేదెలు, లేళ్లు, కొమ్ముల జింకలు వంటి జంతువుల ఎముకలు తెలంగాణలో పాత రాతియుగం కాలంలో విస్తరించి ఉన్న అడవులను, విస్తృతంగా ఉన్న పచ్చదనాన్ని సూచిస్తాయి. అయితే మనదగ్గర పాతరాతియుగపు మానవులు గుహ ఆవాసాలకంటే, బహిరంగ ప్రదేశాలలోనే అంటే గుట్టల్లో, మైదానాల్లోనే నివసించారనే ఇప్పటి వరకు ఉన్న ఆధారాలు చెపుతున్నాయి. ఇప్పటికీ పాత రాతియుగపు మానవ జీవనానికి కొన్ని ఆదివాసి తెగలు సజీవ ఉదాహరణలుగా ఉన్నాయి. నల్లమలలో చెంచులు, మధ్య గోదావరిలో కొండ రెడ్లు, పూసలోళ్లు, ఎరుకల వాళ్లు, యానాదులు ఇప్పటికీ వేట, ఆహార సేకరణ పైనే ఎక్కువ మక్కువ చూపుతారు. వీరి వేటాడే పద్ధతులలో, ఉపయోగించే ఆయుధాలలో, జీవన విధానంలో రాతియుగపు కొనసాగింపు కనిపిస్తుంటుంది.
1982లో మధ్యప్రదేశ్ నర్మదా లోయలో హత్నోరా అనే గ్రామంలో దొరికిన మానవ కపాలాన్ని నిటారుగా నిలబడ్డ ‘హోమో ఎరెక్టస్’ అనే మానవజాతి కపాలంగా గుర్తించారు. దాదాపు 50వేల ఏండ్ల కిందటే మనిషి నిప్పును వాడినట్టు ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగరాజ్‌కు దగ్గరలోని బేలన్ లోయలో ఆధారాలు లభించినయి. మానవశాస్త్ర, పురావస్తు పరిశోధనలలో మైలురాళ్లలాంటి ఇలాంటి అంశాలు తెలంగాణలో ఇంకా లభించాల్సి ఉంది. ఇంకా ఇలాంటి పాత్ బ్రేకింగ్ ఆవిష్కరణలు లేకపోవడానికి కారణం తెలంగాణ మట్టిలో చరిత్ర పొరలు లేకపోవటం కాదు, సరైన దిశలో మన పరిశోధనలు జరగకపోవటమే.
రాతి పనిముట్లను ప్రధానంగా చెకుముకి (ఫ్లింట్), క్వార్ట్ (స్ఫటికం), చెర్ట్, చాల్సిడోనీ వంటి రకరకాల రాళ్లతో తయారుచేసుకున్నారు. రాళ్లు దొరికే స్థలంలోనే ముడిరాయిని పెచ్చులు ఊడదీయడం ద్వారా పనిముట్లు తయారు చేసుకునే వారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాళ్లుచెక్కిన ఆనవాళ్లు, విస్తారంగా రాతి పెచ్చులు కనిపిస్తాయి. చేతిగొడ్డళ్లు, చీలిక పనిముట్లు, చెక్కుడు పనిముట్లు, గోకుడు బిళ్లలు, రంధ్రం చేసే పనిముట్లు, చీల్చే పనిముట్లు, బాణపు ములుకుల వంటివి.. ఇలా ఎన్నో రకాలు మొత్తం పాతరాతియుగంలో విస్తరించాయి. కేవలం రాళ్లే కాకుండా జంతువుల ఎముకలు, శిలాజాలు కూడా నాటి పనిముట్లకు ముడిసరుకే.
డా. ఎం.ఏ. శ్రీనివాసన్
81069 35000