ఒకప్పుడు వేళ్లపైన కూడా లెక్కించలేని అల్పస్థాయికి పరిమితమైన ఈ పండితలోకం ఇప్పుడు సర్వ బహుజనులతో కళకళలాడుతున్నది. అయితే, ఇది మరింత సార్వజనీనం కావాలన్న ఆకాంక్షను పలువురు సాహిత్యాభిమానులు వ్యక్తం చేస్తున్నారు. దీనికి కొనసాగింపుగానే ఇప్పుడు పలువురు బాలావధానులు అష్టావధానాలు నిర్వహిస్తున్నారు.
‘అవధానం’ అంటేనే ఒక రకమైన జ్ఞానోపాసన. చెక్కుచెదరని ఏకాగ్రతతో చేసే ఓ వైజ్ఞానిక తపస్సు. అటు అవధాని, ఇటు పృచ్ఛకులు, మధ్యలో ప్రేక్షకులు అంతా బయటకు చూడటానికి కుర్చీల్లో అలా నిశ్చలంగా కూర్చునే ఉంటారు కానీ, వాళ్లందరి బుద్ధి భావాకాశంలో పొందికైన పద మాధుర్యాల (అన్వేషణ) కోసం విహరిస్తూనే ఉంటుంది. చూడగలవాళ్లకు, అక్కడ గాలిలో చేతికి అందేంత ఎత్తులోనే ఆశ్చర్యకరంగా అక్షరాల సీతాకోక చిలుకలు రంగురంగుల పూలవోలె ఎగురాడుతూ దర్శనమిస్తాయి. సమస్త మానవజాతికే మణిమకుటం వలె ప్రకాశించే అతిగొప్ప సారస్వత ప్రక్రియగా ‘జ్ఞానావధానం’ గత కొన్ని శతాబ్దాలుగా సంస్కృతాంధ్ర (తెలుగు)లో భాసిస్తున్నదన్నది నమ్మక తప్పని నిజం.
భారతీయ సాహిత్యంలో, ఆ మాటకొస్తే ప్ర పంచ సాహిత్య చరిత్రలోనే కనీవినీ ఎరుగని మహోన్నత ‘సారస్వత ప్రక్రియ’ అయిన ‘అష్టావధానం’ గత కొన్నేళ్లుగా అనూహ్య రీతిలో రెండు తెలు గు రాష్ర్టాలలో మరీ ముఖ్యంగా తెలంగాణ నడిబొడ్డున భాగ్యనగరంలో పునర్వైభవాన్ని పొందుతున్నది. ఎప్పుడో రాజుల కాలంలో కేవలం ఎవరో కొందరు భా షావేత్తలు, కవి పండితులు మాత్రమే ప్రదర్శించగలిగిన ఈ విలక్షణ ప్రజ్ఞ ఈ ఆధునిక కాలంలోనూ, అదీ పద్యం కనుమరుగైన దయనీయ నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మనోభీష్టం మేరకు ఉద్యమస్థాయికి చేరింది. ప్రత్యేకించి తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వ ఆధ్వర్యంలోనే (ప్రపంచ తెలుగు మహాసభలు-2017) అత్యంత అరుదైన మహత్కార్యంగా ‘పద్యోద్యమాని’కి శ్రీకారం లభించింది. అప్పటి ప్రభుత్వ ఆస్థాన సాహిత్య ప్రక్రియగా మొదలైన ‘తెలంగాణ పద్యకవితా సౌరభం’ నుంచి ఇవాళ్టి ‘దశాబ్ది వైభవ’ వేడుకలలోనూ చోటు చేసుకోవడం అసలు కాకతాళీ యం కానే కాదు. ఈ రాష్ర్టావిర్భావ ఉత్సవాల సందర్భంగా ఇతర కళా రూపాలతో సమానంగా అష్టావధానాలు సైతం నిర్వహించాలని ముఖ్యమంత్రి స్వయం గా ఇటీవలె ప్రకటించారు. ఈ సంకల్పం ఇంతటితో ఆగక, ఆగకూడదన్న ఆశయంతో కొలిచాల (కోలాచలం) మల్లినాథ సూరి పేరిట, వారి పుట్టిన ఊళ్లోనే (కొల్చారం, మెదక్ జిల్లా) ఏకంగా ‘సంస్కృత విశ్వవిద్యాలయ’ స్థాపనకే నిర్ణయం జరిగిందంటే ఇది మన ‘సంస్కృత-తెలుగు పద్యాని’కి పట్టిన మహర్దశ (పట్టాభిషేకం)గా భావించి తీరవలసిందే.
నేటికి ముఖ్యంగా తెలంగాణ నాట నమ్మశక్యం కాని విధంగా అష్టావధానాలు, భువన విజయాల ప్రదర్శనలు అతిగొప్పగా ఒక సాత్విక శోభవలె ఊపందుకుంటున్నాయంటే దీనికి అసలు కారణం కేసీఆర్ రూపంలో అందివచ్చిన ‘రాజానుగ్రహమే’. అప్పటి (2014) వరకు ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా, తదనంతర కాలంలో తెలుగు సంస్కృత పద్యాల పూర్వవైభవానికి తెలంగాణ నడిబొడ్డున (హైదరాబాద్) బీ జం పడింది. అమూల్యమైన ఈ రాజాశ్రయమే కనుక లేకుంటే, కనుమరుగైన ‘అష్టావధానం’ అనే అద్భుత జ్ఞాన సముపార్జన ప్రక్రియ అంతటితో నిలిచి పోయేదనడంలో ఎలాంటి అతిశయోక్తి అక్కర్లేదు. ఒకవైపు ఇరు రాష్ర్టాల వ్యాప్తంగా ఈ సాహిత్య జ్ఞానోద్య మం అప్రతిహతంగా కొనసాగుతుంటే, మరోవైపు అత్యం త ప్రశంసనీయంగా అన్ని సామాజిక వర్గాల వారికీ చేరువవుతున్నది. ఇప్పటికే వందల సంఖ్యలో వివిధ మార్గాలలో తయారైన అష్టావధానులు, శతావధానులు, వారి నిరంతర, అనితర ప్రదర్శనలే ఇందుకు ప్రబల నిదర్శనం.
తెలుగేతర భాషా మాధ్యమ (ఇంగ్లీషు స్కూళ్లు, ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీలు) విద్యాసంస్థల్లో చది వే పిల్లలు, టీనేజీ యువకులేమిటి తెలుగు సంస్కృత పద్యాలను అలవోకగా సృష్టించడమేమిటి? అచ్చుతప్పులు లేకుండా, సంక్లిష్ట పదజాలాలు, దీర్ఘసమాసా లు, యతిప్రాసల ప్రభోజనంతో కూడిన సంస్కృత తెలుగు పద్యాలను వారు అలవోకగా, ఆశువుగా (వేగంగా), రాగయుక్తంగా, మధురగాత్రంతో, వినసొంపుగా వినిపించడమా? ఒక 9వ తరగతి పిల్లవాడు, ఓ మెడిసిన్ విద్యార్థి, ఒక ఐఐటీ స్టూడెంట్.. ఇలాంటివాళ్లు ఏకంగా అష్టావధానాలు చేయడమే? తెలుగు సాంప్రదాయిక పంచెకట్టు, బొట్టు ఆచారాది అలవాట్లకు భిన్నంగా ప్యాంటు, షర్టు వేసుకొన్న స్వచ్ఛమైన, ఆధునిక వైజ్ఞానిక యువత ‘పృచ్ఛకులు’గా కూర్చోవడం..? పదుల సంఖ్యలో ఇలాంటి భావితరం పద్యోపాసన పట్ల అమిత భయభక్తులు, శ్రద్ధాసక్తులు కనబరుస్తున్న అపురూప వైనం ఒకటి క్షేత్రస్థాయిలో ఈ రచయితకు తాజాగా దర్శనమిచ్చింది. అయితే, దీనికంతటికినీ మూలస్తంభాలుగా లాభాపేక్షలకు తావు లేని, నిలువెత్తు నిజాయితీకి ప్రతిరూపాల వంటి పలువురు ప్రసిద్ధ అవధాన శిరోమణులు, సాహిత్యవేత్తలు, కవి పండితులే ఉండటం విశేషం.
‘అష్టావధానం అంటే ఎవరు పడితే వారు (ఇంకా అందరూ లేదా ప్రతి ఒక్కరూ) చేయలేని బ్రహ్మవిద్య’ అన్న అభిప్రాయాన్ని పటాపంచలు చేసే ని‘శ్శబ్ద’ విప్లవంగా ‘అవధాన విద్యా వికాస పరిషత్’ (ఏవీవీపీ) కిందటేడాది ఆవిర్భవించింది. గురుకులాభ్యాస విధానాన్ని తలపించేలా ఒక బృహత్ లక్ష్యానికి ‘పునాది’ వేస్తూ, ఉచిత (సముచిత) ‘అవధాన విద్యార్జన- ప్రదర్శనల సాధన’ (ఏకకాలంలో)లతో కూడిన ‘శిక్షణా శిబిరాల’కు అంకురార్పణ చేసింది.
అద్భుత ఆధ్యాత్మిక ప్రవచనకర్త, మహా సహస్రావధాని, పద్మశ్రీ డా॥ గరికపాటి నరసింహారావు సమక్షంలో నిరాడంబరంగా పురుడు పోసుకొని, ఈ ఏటికి (ఇటీవలె) విజయశంఖం పూరించింది. గతేడాది శిక్షణ పొందిన 15 మంది విద్యార్థుల్లో ఇద్దరు ఈపాటికి ప్రజలమధ్య పలు ప్రత్యక్ష అష్టావధానాలను విజయవంతంగా నిర్వహించినట్లు నిర్వాహకులు వెల్లడించారు.
కులమతాలు, వయోలింగ భేదాలకు అతీతంగా, అన్ని సామాజిక వర్గాల వా రికీ సమాన ప్రాతినిధ్యంతో, పిల్లలనుం చి పెద్దలవరకు అందరికీ ‘అవధాన విద్య’ను అతి సరళతర పద్ధతిలో, సాధనాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన అసాధారణ ఘనతను ‘అవధాన విద్యా వికాస పరిషత్’ సొంతం చేసుకొన్నది. కిందటేడాది హైదరాబాద్ బర్కత్‌పురాలోని ‘బ్రాహ్మణ సంక్షేమ భవన్’ ప్రాం గణంలో పలువురు అనుభవజ్ఞులైన అవధానుల ఆధ్వర్యంలో ‘శిక్షణా శిబిరం’ మొదలైంది. పూ ర్తి పారదర్శకత, ప్రతిభా సంపన్నత, శ్రద్ధాసక్తుల పద్ధతిలోనే ఈ రెండో సంవత్సరం కూడా ఎం పిక చేసుకున్న ఇరవై మంది విద్యార్థులకు ‘అటు సాధ న- ఇటు ఆచరణ’లనే ప్రధాన లక్ష్యంగా చేసుకొని, ఇటీవల రెండో శిబిరం ముగింపు వేళ ‘తొలి విజయోత్సవాన్ని’ నమోదు చేసింది. పై సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మరుమాముల దత్తాత్రేయశర్మ మాట్లాడుతూ పిల్లలు పలు అష్టావధానాలను విజయవంతంగా నిర్వహించారని, ఈ పరంపర ఇంకా కొనసాగుతున్నదని తెలిపారు.
‘అవధాన విద్య వికాస పరిషత్’ అన్ని సామాజిక వర్గాల వారినీ శిక్షణ కోసం చేర్చుకొంటున్నది. సామాజిక స్పృహతో కూడిన అనేక సాంఘిక సమస్యలు, అంశాలను ఇతివృత్తాలుగా చేసుకొనే తాము అష్టావధానాలను నిర్వహిస్తున్నట్టు శతావధాని ఆముదాల మురళి అంటున్నారు. ఛందస్సు, పద్యనిర్మితి తెలియకున్నా, పద్యం పట్ల ఆసక్తి, అవగాహన, అంకితభావం ఉన్న పిల్లలు, యువతను సైతం శిక్షణకు ఎంపిక చేసుకుంటున్నట్టుపై సంస్థ వ్యవస్థాపక నిర్వాహకురాలు, శతావధాని డాక్టర్ బులుసు అపర్ణ వివరించారు.
ము గింపు సందర్భంగా సికింద్రాబాద్, పద్మారావునగర్‌లోని శ్రీ శివానంద ఆశ్రమంలో జరిగిన ‘విజయోత్సవ సభ’కు ముఖ్యఅతిథిగా హాజరైన సుప్రసిద్ధ పంచ సహస్రావధాని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అన్నమాచార్య ప్రాజెక్ట్ పూర్వ సంచాలకులు డాక్టర్ మేడసానిమోహన్ విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించి,అవధాన పరిషత్ నిస్వార్థ, చారిత్రాత్మక కృషిని అభినందించారు. భార త సాహిత్య పరిషత్ అధ్యక్షుడు ఆచా ర్య కసిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి ముఖ్య మంత్రి కేసీఆర్ ప్రజాసంబంధాల ముఖ్యాధికారి వనం జ్వాలా నరసింహారావు హాజరయ్యారు. కాగా, ‘అవధాన విద్య వికాస పరిషత్’కు ఈ ఏడాది నుంచి గౌరవాధ్యక్షులుగా విశ్రాంత ఐఏఎస్ డాక్టర్ కే వీ రమణాచారి వ్యవహరించనున్నారు.
దోర్బల బాలశేఖరశర్మ: 80966 77410