గౌరవనీయులైన రేవంత్రెడ్డి గారు..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీరు, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సింది పోయి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ పట్ల రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న మీ దురహంకార తీరును నిరసిస్తూ ఈ బహిరంగ లేఖ రాస్తున్నాను. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని రాజకీయ దాడులు చేసినా.. తెలంగాణ సమాజం కేసీఆర్ను ఎప్పుడూ తన గుండెల్లోనే పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆయన కేవలం ఒక పార్టీకి అధ్యక్షుడు కాదు.. ఈ జాతి ఆత్మగౌరవానికి ప్రతీక. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక అజేయమైన శక్తి. కేసీఆర్ అంటే ఒక మనిషి కాదు.. ఆయన తెలంగాణ అస్తిత్వ జ్వాల! ఆయన్ని ఆర్పాలనుకోవడం నీ వల్ల కాదు సరికదా, ఆ ప్రయత్నంలో నీవు, నీ అహంకారమే భస్మమైపోతుంది.
అహంకారంతో, అధికారం చేతిలో ఉంది కదా అని కేసీఆర్ను రాజకీయంగా అణచివేయాలని చూస్తే.. అది కేవలం ఒక వ్యక్తిపై చేస్తున్న దాడి కాదు, అది తెలంగాణ ఆత్మగౌరవం మీద చేస్తున్న దాడి అని ప్రజలు భావిస్తున్నారు. పాలకుల అహంకారానికి, ప్రజల ఆత్మాభిమానానికి మధ్య జరిగే యుద్ధంలో ఎప్పుడూ ఆత్మాభిమానమే గెలుస్తుంది. ప్రపంచ చరిత్ర పాఠాలను ఒక్కసారి తిరగేయండి.. ఏ పోరాట యోధుడినైనా ఎంత అణగదొక్కాలని చూస్తే, ప్రజల్లో అంతటి సానుభూతి, అంతకు వెయ్యి రెట్లు ప్రజా మద్దతు వెల్లువెత్తుతుంది.
కేసీఆర్ ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఆయన ‘తెలంగాణ ఎమోషన్’. ఆయన పోరాటపటిమ, దార్శనికతకు నిలువుటద్దం. తన మేధస్సుతో, త్యాగశీల పోరాటంతో, అచంచలమైన దార్శనికతతో ఆంధ్రా పాలకుల సంకెళ్ళ నుండి తెలంగాణను విముక్తి చేయడమే కాదు. కునారిల్లిన ఈ నేలను ‘బంగారు తెలంగాణ’గా తీర్చిదిద్దిన అపర భగీరథుడు ఆయన. ఆ ఉక్కు సంకల్పం, కృషి, సాధించిన ప్రగతి ప్రజల కండ్ల ముందే ఉన్నాయి. రేవంత్రెడ్డి… ఒక్కటి మాత్రం గుర్తుంచుకో.. కేసీఆర్ అంటే కేవలం మూడు అక్షరాల పేరు కాదు.. ‘తెలంగాణ సింహనాదం’. కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు.. ఆయన కోట్లాది మంది తెలంగాణ ప్రజల గుండెచప్పుడు! మీ తప్పుడు కేసులతో, కేసీఆర్ ఈ గడ్డ విముక్తికోసం చేసిన మడమతిప్పని ప్రజాపోరాటాలను చెరిపివేయలేవు. మీ రాజకీయ కక్షసాధింపులు కేసీఆర్ స్థాయిని ఏమాత్రం తగ్గించలేవు. పైగా ఆయన పట్ల ప్రజలకున్న గౌరవాన్ని, ప్రేమాభిమానాలను మరింత పెంచుతాయి. మీరు సూర్యుడిపై ఉమ్మి వేస్తున్నారు అన్న విషయాన్ని గుర్తించకపోవడం, మీ మూర్ఖత్వం.
‘ప్రజాస్వామ్యంలో అధికారం అనేది శాశ్వతమైన ప్రైవేట్ ఎస్టేట్ పట్టా కాదు, అది ప్రజలు రాసిచ్చిన షరతులతో కూడిన కొద్దికాలపు నమ్మకం’ మాత్రమే. కుర్చీ మీద కూర్చున్నప్పుడు విర్రవీగడం కాదు, ఆ కుర్చీ దిగిపోయాక ప్రజలు నీ ముఖం చూసి ‘ఛీ’ అనకుండా ఉండటమే అసలైన విజయం. అధికారం అనేది కేవలం ఐదేండ్ల్ల ‘అద్దె ఇల్లు’ మాత్రమే. ఈరోజు అధికార డాబు, దర్పం, నీ చుట్టూ ఉన్న భజన బృందం, పోలీసులు, రేపు నీ పదవి పోయాక నీ నీడను కూడా తాకరు. అప్పుడు నీతో ఉండేది నువ్వు చేసిన మంచి పనులు మాత్రమే. అధికారాన్ని ప్రజల కష్టాలు తీర్చే వారధిగా వాడాలి తప్ప, ప్రత్యర్థుల గొంతు కోసే ‘కత్తి’గా వాడితే.. అదే కత్తి నీ మెడకు చుట్టుకుంటుందని మర్చిపోకు. ప్రజలు నిన్ను ఎన్నుకుంది ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడానికే తప్ప, ప్రతీకార క్షుద్ర రాజకీయాలు చేయడానికి కాదు.
నాయకుడు అంటే నిర్మించేవాడు,అహంకారంతో కండ్లు మూసుకుపోయి, విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగపరుస్తూ, ప్రత్యర్థులను హింసిస్తే, చరిత్ర నిన్ను ఒక ‘రాజకీయ విలన్’ గానే ముద్రవేస్తుంది. అధికారం ఉన్నప్పుడు అణచివేతకు పాల్పడే నాయకుడు, అధికారం పోయాక అనామకుడిగా మిగిలిపోతాడు. గుర్తుంచుకో.. కాలం ఎప్పుడూ నీ చుట్టే తిరగదు, అది తిరగబడినప్పుడు నీ అహంకారం నిన్ను కాపాడలేదు.
మీ చేతకానితనాన్ని, పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్పై అసభ్య పదజాలంతో విమర్శలు చేయడం, తప్పుడు కేసులతో వేధించడం మానుకోండి. చేతనైతే, మంచి పరిపాలన అందించండి. కేసీఆర్ కంటే అన్నిరంగాలలో మెరుగైన విజయాలు సాధించి చూపండి. విచ్చలవిడి అవినీతిని అరికట్టి, పారదర్శక పాలనను అందించడంపై దృష్టి పెట్టండి. అంతేకానీ, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు, మీ చేతకాని తనానికి, పరిపాలనపై పట్టు సాధించలేని అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు, కేసీఆర్పై దాడి చేస్తామంటే, అసభ్యపదజాలంతో అవమానిస్తానంటే, తప్పుడు కేసులతో వేధిస్తానంటే, మహాభారతంలో శిశుపాలుడి గతే మీకు, మీ ప్రభుత్వానికి పడుతుంది, రేవంత్ రెడ్డీ.. తస్మాత్ జాగ్రత్త!