పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో గానీ పోదని పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ డీఎన్ఏలోనే నిరంకుశత్వం, ఇష్టారాజ్యం పెనవేసుకుపోయి ఉన్నది. ఎమర్జెన్సీ పేరిట పౌరుల హక్కులను ఉక్కుపాదం కింద తొక్కేసిన ఘనచరిత్ర ఆ పార్టీ సొంతం. ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే అతివృద్ధ పార్టీ ఆచారం. రాష్ట్రంలో పదేం డ్ల విరామం తర్వాత కల్లబొల్లి హామీలిచ్చి, అధికారంలోకి వచ్చి, వాటిని అమలుచేయలేక చతికిల బడుతున్నది. ఇదేమని నిలదీస్తే ఎగిరిపడుతున్నది. ఎగబడి కేసులు పెట్టే దుర్మార్గానికి తెగబడుతున్నది. అందుకు పోలీసులను పావులు గా వాడుకుంటూ అరాచకం సృష్టిస్తున్నది.
ఈ దూకుడుకు ఉన్నత న్యాయస్థానం ఎట్టకేలకు ముకుతాడు వేసింది. చెవులు పిండి చెంపపెట్టు లాంటి తీర్పును వెలువరించింది. ప్రజలకు వాక్ స్వాతంత్య్రం అనేది రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కు. ఈ సూత్రం సోషల్ మీడియాకూ వర్తిస్తుంది. కానీ చేతకాని, చేవలే ని కాంగ్రెస్ పాలకులు తమను నిలదీసే సోషల్ మీడియా వారియర్స్‌పై కేసులు పెడుతున్నారు. కాదు కాదు.. తృతీయ పక్షం ద్వారా ఎక్కడెక్కడో కేసులు పెట్టిస్తున్నారు. ఇదే వారికి తెలిసిన ‘ప్రజాపాలన’. రాజ్యాంగం, చట్టం ప్రకా రం పనిచేయాల్సిన పోలీసులు తమ రాజకీయ బాసుల హుకూంలకు జీ హుజూర్ అంటూ ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తున్నారు.
ఈ కుళ్లుమోతు కూటనీతి కేసులు ఇంకానా ‘ఇకపై చెల్లవు’ అని సోషల్ మీడియా యాక్టివిస్టు శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు కేసులో హైకోర్టు తేల్చిచెప్పింది. అతనిపై సర్కారు చట్టవిరుద్ధంగా పోలీసులతో నమోదు చేయించిన మూడు ఎఫ్ఐఆర్లను కొట్టివేస్తూ కీలక తీర్పును వెలువరించింది. కాంగ్రెస్ సర్కారు సోషల్ మీడియా వారియర్స్‌పై అక్కసు వెళ్లగక్కడం ఇదే మొదటిసారి కాదు. తాను అష్టావక్ర పాలన అందించవచ్చు. కానీ, దానిని ఎత్తిచూపడమే తప్పు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. రాజకీయ విమర్శలను నేరపూరితంగా చూస్తూ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకే ఎసరు పెడుతున్నది.
పనికిమాలిన కేసులతో వేధిస్తున్నది. ఆ కేసులు కూడా ఏకకాలంలో పలుచోట్ల దాఖలు చేయించడం కేవలం వేధింపు తప్ప మరోటి కాదు. గత ఒకటిన్నర సంవత్సరాల పైచిలుకు కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు కొణతం దిలీప్‌పై 12 కేసులు, మన్నె క్రిశాంక్‌పై 23 కేసులు దాఖలయ్యాయి. ఇక భౌతిక దాడులకైతే లెక్కే లేదు. లోపాలు ఎత్తిచూపితే చాలు పుట్టగొడుగుల్లా కేసులు పుట్టుకొస్తున్నాయి. అంతేకాదు, కోర్టులు అడ్డుచెప్తున్నా అరెస్టులు చేసి సతాయించడమూ చూస్తున్నాం. తిరిగి కోర్టుల మందలింపుతోనే వారు విడుదల కావడమూ తెలిసిందే.
ఇలా రాజకీయ పోస్టులను సాకుగా చూపి క్రిమినల్ కేసులు పెట్టే కుటిల పన్నాగాలు కుదరవని బుధవారం నాటి తీర్పులో హైకో ర్టు స్పష్టం చేసింది. రాజకీయ బాసుల కోసం చట్టాన్ని వంచొద్దని పరోక్షంగా చురకలు వేసింది. పోలీసుల తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉన్నదని చట్టం ప్రకారం వారు నడుచుకోవాలని అక్షింతలు వేసింది. కేసులు బనాయిస్తే వారిపైనా చర్యలు తప్పవనేది హైకోర్టు తీర్పు సారాంశం. నేత పరువు పోయిందని కార్యకర్త పరువునష్టం దావా వేసే ధోరణినీ కట్టడి చేయడం విశేషం. పోస్టుల వల్ల ఎవరు పరువు నష్టమైందని భావిస్తున్నా రో వారే కేసు వేయాలని, తామరతంపరగా కేసులు వేయించే ధోరణికి అడ్డుకట్ట వేయడం గమనార్హం.
పోస్టులను అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా కేసులు వేస్తున్న సర్కారుకు ఈ తీర్పు ఓ చెంపపెట్టు. ఈ మైలురాయి తరహా తీర్పు తో పాటుగా ఉన్నత న్యాయస్థానం పోలీసులకు, మెజిస్ట్రేట్లకూ మార్గదర్శకాలు జారీచేసింది. నిజంగా చట్ట ఉల్లంఘన జరిగిందని పోలీసుల భావిస్తే మెజిస్ట్రేట్ అనుమతి తీసుకొని ఆపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నొక్కిచెప్పడం ఈ మార్గదర్శకాల్లో ప్రధానాంశం. వేధింపులే లక్ష్యంగా నమోదయ్యే కాంగ్రెస్ మార్కు కేసులకు ఇకనైనా తెరపడుతుందని ఆశిద్దాం.