సాగు ఆగమాగం
‘కంపతారు సెట్లు గొట్టి అమ్ముకునే కాలమొచ్చింది.. సేతానమేడుందిరా.. తెలగాణ సేలన్నీ బీడాయెరా’ అని గోరటి వెంకన్న రాసిన పాట ఉద్యమకాలంలో మారుమోగింది. ఆ తర్వాత తెలంగాణ సాధించుకున్నాక, కేసీఆర్ నాయకత్వంలో తొమ్మిదిన్నరేండ్లపాటు సాగులో స్వర్ణయుగాన్ని చూసినం.
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచినం. నాణ్యమైన విత్తనాలు, మేలైన ఎరువులు, 24 గంటల ఉచిత విద్యుత్తు, సత్వరమే పూర్తయిన ప్రాజెక్టుల నుంచి దండిగా సాగునీరు, పంట పెట్టుబడి, రైతు బీమా ఇలా తీరొక్క చేయూతతో సాగు బాగుపడింది. కానీ మాయదారి కాంగ్రెస్ కల్లబొల్లి హామీలతో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగుబడి గ్రాఫ్ పడిపోయింది. రాష్ట్రంలో పాలకులు ప్రాజెక్టులను పండబెట్టి, పొలాలను ఎడబెట్టారు. ఇక్కడ రైతులు గొడగొడ విలపిస్తుంటే కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వీధుల్లో వీరంగం వేసేందుకు ఉరుక్కుంట పోయారు. బీఆర్ఎస్ హయాంలో మూడో పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వాలని గొంతులు చించుకున్న కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు రెండో పంటనే వేయొద్దని రైతులకు పిలుపునిస్తున్నారు. సాగునీళ్లు లేవు కనుక యాసంగిలో వరిపంట వేయొద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారు.
సాగునీటి కష్టాలకు కరెంటు కోతలు కూడా తోడు కావడంతో రైతులు తల్లడిల్లిపో తున్నారు. కండ్లముందే ఎండుతున్న పొలాలను కాపాడుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. దిగుబడి అడుగంటి, పెట్టుబడి మట్టిపాలయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎరువులు, విత్తనాలు అడిగితే రైతుల రక్తం కండ్ల జూసిన కాంగ్రెస్ సర్కార్, నీళ్లు, కరెంటు కోసం రైతులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేస్తుంటే నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి దారుణంగా వేధిస్తున్నది. అటు సర్కార్ పెద్దలేమో తగుదునమ్మా అంటూ ఢిల్లీలో నిరసన హక్కు గొప్పతనం గురించి శ్రీరంగనీతులు చెప్తున్నారు.
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సమయంలో తెలంగాణలో సాధారణం కంటే సుమారు 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని ఈ నెల 11న వెలువడిన నివేదిక పేర్కొన్నది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 18 జిల్లాలు లోటు వర్షపాతాన్ని ఎదుర్కొంటున్నాయి. సుమారు 215 నుంచి 235 మండలాల్లో కరువు తరహా పరిస్థితులు నెలకొన్నట్టు వివిధ అంచనాలు సూ చిస్తున్నాయి. 21,500కు పైగా చెరువుల్లో దాదాపు 17,700 తటాకాల్లో నిల్వలు సగం కంటే తక్కువగా ఉన్నట్టు నివేదికలు వెల్లడించాయి.
ఇవి వ్యవసాయానికి మాత్రమే కాదు, తాగునీటి అవసరాలకు కూడా నీరు లేదని ఆందోళన కలిగించే పరిణామాలు ఏర్పడ్డాయి. పరిస్థితి ఇలాగే ఉంటే పిడుక్కీ, బియ్యానికీ ఒక్కటే మంత్రం అన్నట్టు సాగు సమస్యలన్నిటినీ ఎల్ నినో ఖాతాలో వేసి కాంగ్రెస్ సర్కార్ తప్పించుకోవాలని చూస్తున్నది. వాతావరణ మార్పులు, ఎల్ నినో కరువు వంటి అంశాలు ప్రభుత్వ నియంత్రణలో ఉండకపోవచ్చు. కానీ వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడం మాత్రం ప్రభుత్వ బాధ్య త. అయినా రాష్ట్ర సర్కార్ ఇటు కరెంటు సరఫరా గురించి గానీ, అటు సాగునీటిని ఒడిసిపట్టడం మీద గానీ ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు.
గత ఆగస్టులోనే కరెంటు లోటు ఏర్పడింది. ఆ నేపథ్యంలోనే కేంద్రం రాష్ర్టాన్ని హెచ్చరించింది. కానీ మూడు నెలలు గడుస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడంతో పరిస్థితి రోజురోజుకూ విషమిస్తున్నది. ఇక తెలంగాణ జలప్రదాయిని కాళేశ్వరాన్ని కాంగ్రెస్ పాలకులు కేసీఆర్ మీద అక్కసుతో దాదాపు మూడేండ్లుగా పడావు పెట్టారు. గోదావరి, కృష్ణా జలాలను పొరుగు రాష్ర్టాల కు విడిచిపెట్టే దివాళాకోరు విధానాలతో నీటిపారుదల రంగం అస్తవ్యస్తమైపోయింది. ఓవైపు కరువు వేగంగా తరుముకు వస్తున్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులపై కాలయాపన చేస్తూ రాష్ర్టాన్ని సర్కార్ సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది. సాగునీళ్ల మాట దేవుడెరుగు, కనీసం తాగునీరు కూడా అందించలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. చేతగాని, చేవలేని కాంగ్రెస్ పాలనలో మళ్లీ ‘సేతానమేడుందిరా’ అని పాడుకునే రోజులు దాపురిస్తున్నట్టే కనిపిస్తున్నది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

