ఈ దేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా సామాజిక వివక్షను ఎదుర్కొంటూ, ఆర్థిక దోపిడీకి గురవుతున్నవారు అణగారిన వర్గాలే. ఈ నేపథ్యంలో అణగారిన వర్గాలు, మహిళపై చిన్నచూపు చూస్తున్న సమాజంపై కొందరు సంఘసంస్కర్తలు శంఖం పూరించారు. యాదృచ్ఛికంగా వారిలో చాలామంది జయంతులు, వర్ధంతులు ఏప్రిల్‌లోనే ఉండటం విశేషం.
ఏప్రిల్ 3న శివాజీ వర్ధంతి, ఏప్రిల్ 5న బాపు జగ్జీవన్‌రామ్ జయంతి, ఏప్రిల్ 11న మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి, ఏప్రిల్ 13న బీపీ మండల్ వర్ధంతి, ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 16న కందుకూరి వీరేశలింగం జయంతి, ఏప్రిల్ 18న దొండో కేశవ్ కార్వే జయంతి, ఏప్రిల్ 23న విఠల్ రాంజీ షిండే జయంతి, ఏప్రిల్ 26న బాబా ఆమ్టే జయంతి. ఇలా ఈ మాసాంతం సంఘ సంస్కరణ కోసం పాటుపడిన మహనీయుల జయంతో, వర్ధంతో జరుపుకుంటూ వారి సేవలను స్మరించుకుందాం.
క్షత్రియులే కాదు, అణగారిన వర్గాలు కూడా రాజ్యాధికారాన్ని చేపట్టి రాజ్యాలను ఏర్పాటు చేయగలరని నిరూపించిన యోధుడు శివాజీ. తరతరాలుగా సామాజిక వివక్షకు గురవుతున్నవారి పక్షాన ఫూలే పోరాడారు. ఒకవైపు అక్షర జ్ఞానం నేర్పుతూనే మరోవైపు సామాజిక పరివర్తనకు నడుంకట్టి వేల ఏండ్లుగా వస్తున్న దురాచారాలను పెకిలించారు.
ఫూలే మరణించిన ఏడాది తర్వాత 1891 ఏప్రిల్ 14 మరో సామాజిక విప్లవ యోధుడు అంబేద్కర్ జన్మించారు. సామాజిక వివక్షతోపాటు, ఆర్థిక దోపిడీ, రాజకీయ అసమానతలపై ఆయన పోరు సలిపారు. స్వాతంత్య్ర భారతదేశంలో ‘నా జాతుల స్థానం ఏమిట’ని ప్రశ్నించారు. రాజ్యాధికారంలో ప్రాతినిధ్యం లేని జాతులు అంతరిస్తాయని పేర్కొంటూ రాజకీయ చైతన్యం కోసం పోరాడారు. తరతరాలుగా దోపిడీకి గురైన వర్గాలకు రాజ్యాంగ రక్షణ కల్పించారు. ఇతర వెనకబడిన తరగతులకు కూడా రాజ్యాంగ హక్కులు ఉండాలని 340 లాంటి ఆర్టికల్స్‌ను రాజ్యాంగంలో పొందుపరిచారు.
పూలే, అంబేద్కర్ లాగానే మరో సామాజిక యోధుడు బీపీ మండల్. ఉన్నత ఉద్యోగాన్ని కాదని వెనుకబడిన వర్గాల కోసం రాజకీయ పోరాటం నడిపారు. రామ్ మనోహర్ లోహియా ప్రేరణతో సంయుక్త సోషలిస్ట్ పార్టీలో చేరి, ఆరోగ్యశాఖ మంత్రిగా సేవలందించారు. 1967 షోషిత్ దళ్ పార్టీని స్థాపించి, బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. సీఎంగా, ఎంపీగా సేవలందించినప్పటికీ రెండో ఓబీసీ కమిషన్ చైర్మన్‌గానే ఆయన గుర్తింపు పొందారు. ఇతర వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా ప్రయోజనాల కోసం బీసీ కమిషన్ చైర్మన్‌గా 40 సిఫారసులను కేంద్ర ప్రభుత్వానికి అందించారు. వీపీ సింగ్ హయాంలో విద్యా, ఉద్యోగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చేశారు. సామాజిక సంస్కరణల కోసం పాటుపడిన ఎందరో మహనీయుల జయంతులు, వర్ధంతులు ఈ నెలలోనే ఉన్నాయి. అందుకే ఇది మహనీయుల మాసం.
– జుర్రు నారాయణ యాదవ్, 94940 19270