సీఎంకు ఎందుకీ అసహనం?
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పాలనా వైఫ్యలం గురించి ఎవరు ప్రశ్నించినా వారిపై ఎదురుదాడితోపాటు అసహనం ప్రదర్శిస్తున్నారు.
ఆరు గ్యారెంటీల సంగతి దేవుడెరుగు కానీ ప్రశ్నించడం ఏడో గ్యారెంటీ అని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైనా, అది జర్నలిస్ట్ అయినా ప్రశ్నిస్తే పెయిడ్ క్వశ్చన్స్ అంటున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన పాలనా వైఫ్యలం గురించి ఎవరు ప్రశ్నించినా వారిపై ఎదురుదాడితోపాటు అసహనం ప్రదర్శిస్తున్నారు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ఇటీవల మీడియా సమావేశంలో ఆయన వ్యవహారం బట్టబయలైంది.
‘కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని ఒడిసి పట్టుకొని ఉంటే ఎల్ నినో ప్రభావం అంతగా ఉండేది కాదు. గోదావరిలో అందుబాటులో ఉన్న నీటిని సమయానుకూలంగా రిజర్వాయర్లలో నింపి ఉంటే బాగుండేది కదా? వాటిని వదిలేసి బీఆర్ఎస్పై ఆరోపణలు చేస్తున్న మీరు.. మీ కుమార్తె చేపడుతున్న ప్రైవేట్ స్కూళ్ల నిర్మాణంలో, మీ కుటుంబ సభ్యులు ఒక దవాఖానలో యజమానులుగా మారడం ఏంటి’ అని సీఎంను ఓ రిపోర్టర్ ప్రశ్నించారు.
దానికి సీఎం చెప్పిన సమాధానం ఎదురుదాడిలా ఉన్నది. కాళేశ్వరంపై సమాధానం చెప్పలేదు. కానీ ప్రైవేట్ హాస్పిటల్ అంశంలో తనపై, తన కుటుంబీకులపై వచ్చిన అభియోగాలపై స్పందించారు. కొంతమంది జర్నలిస్టులు పెయిడ్ ప్రశ్నలు సంధిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇది ఎంతవరకు సమంజసం? ప్రశ్నలకు జవాబు చెప్పలేక ఎవరో అడిగిస్తున్నారంటూ జర్నలిస్ట్‌లపై ఆరోపణలు చేయడం అసహనమే కదా!
వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టు అవసరాన్ని, దాని ప్రాధాన్యతను కాంగ్రెస్ నేతలు అర్థం చేసుకోలేదు. ఎన్నికల ముందు నుంచీ ఈ ప్రాజెక్టుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. గత ప్రభుత్వంపై విమర్శలు చేయడంతోనే ఈ మూడేండ్లు కాలయాపన చేసి, ప్రజలను కష్టాలపాల్జేశారు. నీటి సమస్య గురించి సోయి కూడా కాంగ్రెస్ నేతలకు. ఏ పార్టీ వారైనా ఎన్నికల సమయంలో రాజకీయాల గురించి మాట్లాడుతారు. కానీ ప్రస్తుత సీఎం ప్రతి సందర్భంలోనూ రాజకీయమే మాట్లాడుతున్నారు. చివరికి మీడియా సమావేశంలో జర్నలిస్ట్‌ల ప్రశ్నలను కూడా ఆయన రాజకీయ కోణంలో చూశారు.
ఎల్ నినో లాంటి కష్టకాలంలో ఆదుకునే వరప్రదాయినే కాళేశ్వరం ప్రాజెక్టు. దీని ప్రాముఖ్యతను సీఎం అర్థం చేసుకోలేదు. గోదావరికి సీజన్లో నీళ్లు వచ్చేది కష్టమే. కానీ ఈసారి పుష్కలంగా నీళ్లు వచ్చాయి. ప్రాణహిత నుంచి, ఇటు ఇంద్రావతి నుంచి సమృద్ధిగా నీరు లభించింది. నీళ్లను మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, అటు నుంచి ఎల్లంపల్లి బరాజ్‌ల్లో లిఫ్టు చేసి ఉంటే ఏడాది పాటు నీళ్లకు ఇబ్బంది ఉండేది కాదు. భారీగా నీటిని నిల్వ చేసే రిజర్వాయర్లు కూడా మనకు ఉన్నాయి. రంగనాయకసాగర్, గంధమల్ల రిజర్వాయర్, కొమురవెల్లి మల్లన్నసాగర్ వీటిలో నీటిని నిల్వ చేసుకుంటే ఉత్తర తెలంగాణతోపాటు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల తాగు, సాగు నీటి సమస్య తీరేది. కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదు. ఫలితంగానే ప్రజలు ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాధాన్యత గురించి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సభ్యులతోపాటు యావత్తు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. కేసీఆర్ దూరదృష్టిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ కాంగ్రెస్ పాలకులు మాత్రం కేసీఆర్ ఆలోచనను తప్పుపడుతున్నారు. గోదావరి జలాలను ఆంధ్రాకు తరలించి, తెలంగాణలో రెండో పంటకు నీళ్లకు ఇవ్వడంలేదు. ఈ విషయం ప్రజలకు రూఢీ అయింది. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే తెలంగాణలో గోదావరి పొడవునా సుమారు 300 కిలోమీటర్ల మేర నీటి నిల్వ ఉండేది. దీని వలన బోర్లలో నీరు ఊరేది, బావుల్లో నీరు ఉండేది. వరద కాలువ ద్వారా కూడా నీటిని పంపింగ్ చేసుకునే అవకాశం కలిగేది. ఇవేవీ కాంగ్రెస్ వారికి పట్టడంలేదు.
ఇప్పుడు తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిస్తామని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తక్కువ ఎత్తులో నిర్మిస్తే తెలంగాణకు అనుకున్న మేరకు నీళ్లు రావు. ఎత్తు పెంచితే మహారాష్ట్ర వైపున్న వణ్యప్రాణి సంరక్షణ కేంద్రం మునుగుతుంది. దీని కారణంగానే గతంలో కేంద్ర అటవీ శాఖ ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు ఇవ్వలేదు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తొలి నుంచీ ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి అక్కడ అనుకున్న ఎత్తుతో ప్రాజెక్టు నిర్మించడం సాధ్యం కాదు.
ఎల్ నినో ప్రభావాన్ని ఎదుర్కోవడంలో కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనబడుతున్నది. దీనిపై ప్రశ్నలు అడిగిన రిపోర్టర్లను పెయిడ్ ప్రశ్నలు అడిగే వారిగా చిత్రీకరించేందుకు సీఎం యత్నం చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి కుటుంబ సభ్యుల వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ భూముల వ్యవహారం, ఫోర్త్ సిటీ, ఆయన కుమార్తె నైమిషారెడ్డి ప్రైవేట్ పాఠశాలలు, ప్రైవేట్ దవాఖానల కొనుగోలు వంటి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వీటిపై ఎన్నో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. వీటికి సీఎం సూటిగా సమాధానం చెప్పడం లేదు. పైగా బీఆర్ఎస్ నేతలపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం సీఎం పనితీరుపై జనం తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. సమయానికి కరెంట్, తాగు, సాగు నీరు, విత్తనాలు, ఎరువులు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల సమస్యలపై మాట్లాడే వారిపై సీఎం విమర్శలు చేస్తున్నారు. నిజాలు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. అందుకే ఆయనను ఎవరు ప్రశ్నించినా స్వీకరించే పరిస్థితిలో లేరు. ప్రశ్నలు వేసిన వారి పట్ల అసహనం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
-అస్కాని మారుతీ సాగర్, 9010756666
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

