రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సుమారు ఏడాది కావస్తున్నది. కానీ, అభివృద్ధిలో మాత్రం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగానే ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆయన మంత్రివర్గం మాత్రం ప్రజాపాలన ముసుగులో రాజకీయ కక్షసాధింపులపై దృష్టి కేంద్రీకరిస్తున్నది. ఇచ్చిన హామీల ఊసెత్తకుండా రోజుకో తుస్సు బాంబును పేలుస్తూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నది.
ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఇద్దరూ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తూనే రైతుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న నిరక్ష్యాన్ని, పాలనాపరమైన లోపాలను ఎత్తిచూపుతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలుచేసిన వివిధ సంక్షేమ పథకాలను ఈ ప్రభుత్వం కొనసాగించకపోవడం ద్వారా రైతన్నలు సంక్షోభంలో కూరుకుపోయారు. రోజురోజుకూ నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల హామీల్లో భాగంగా చేసిన ఆరు గ్యారెంటీలను అమలుచేయాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.
కానీ, తెలంగాణ తిరోగమన స్థితిని పట్టించుకోకుండా భజనొక్కటే పరమావధిగా కొంతమంది మేధావులు మాత్రం ‘సారే దునియా ఏక్తరఫ్, సాలే బౌనే ఏక్తరఫ్’ అంటూ హిందీ భాషలోని సామెతలను ప్రయోగిస్తూ కేటీఆర్, హరీశ్‌లపై వ్యంగ్య కథనాలు రాస్తున్నారు. ఇది వారి పైశాచికానందానికి పరాకాష్ఠ. నిజానికి ‘సాలే బౌనే’ (బావ, బామ్మర్దులు) అనేది కుటుంబ వ్యవస్థలోనే చెల్లుబాటవుతుంది. అంతేకానీ, ప్రజాక్షేత్రంలో కాదు. ఎందుకంటే ఒక్కసారి రాజ్యాంగబద్ధంగా ప్రజాక్షేత్రంలో దిగాక తన, మన అనే భేదాలుండవు. ప్రజలను మెప్పించి, ఒప్పించడమే పరమావధిగా ముందుకుసాగాలి. అయినా, ప్రజాసేవ కోసం పోటీ పడితే తప్పేంటి? గొర్రె బలిస్తే గొల్లకే కదా లాభం? పోటీ వల్ల ప్రజలకు మెరుగైన పాలన అందుతుంది కదా? దేశ చరిత్రలో వెన్నుపోటు రాజకీయాలను చూశాం, వారసత్వ రాజకీయాలను చూశాం, ఇప్పుడు పోటీతత్వ రాజకీయాలను చూస్తున్నాం. ఇవి రాజకీయాల్లో ఆరోగ్యకరమైన పరిణామాలే కదా?
ప్రతిపక్ష హోదాలో కేటీఆర్, హరీశ్‌రావులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఊకదంపుడు ఆరోపణలని హేళన చేస్తున్నారు. వీరిద్దరూ ‘ఊ’ అంటే, ‘ఆ’ అంటే కాంగ్రె స్ ప్రభుత్వ పాలనపై ఆరోపణలు చేస్తుండ్రని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టిలో ప్రశ్నిస్తే ఆరోపణలు చేసినట్టేనా? ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ఎండగడితే ఫిర్యాదులు చేసినట్టా? గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెండు దఫాలలో రుణమాఫీ చేసినప్పుడు ఆ గ్యాప్‌లో కేసీఆర్‌ను ఇష్టారీతిన బద్నాం చేసిన అప్ప టి కాంగ్రెస్ నాయకులే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నది. అంటే కాంగ్రెస్ చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారమా? సుమారు ఏడాది కాంగ్రెస్ పాలనలో ఆరు గ్యారెంటీలలో ఒక్క మహిళలకు ఫ్రీ బస్ తప్ప మిగతా ఏ హామీ కూడా అమలు కాలేదు. ఆ హామీల అమలు కోసం యావత్ తెలంగాణ ఎండిన డొక్కలతో ఎదురుచూస్తున్నది.
ఈ ఏడాదిలో ఒక్క సిరిసిల్లలోనే ముప్ఫై మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకున్నారు. ఫుడ్ ఫాయిజన్‌తో 42 మంది విద్యార్థులు మరణించారు. ఈ మరణాలకు బాధ్యులెవరు? ఇవి ప్రభుత్వ హత్యలు కావా? ఫార్ములా ఈ-రేస్‌లో భాగంగా కేటీఆర్ అవినీతి చేశాడంటూ బద్నాం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆధారాలు మాత్రం చూపలేకపోతున్నది. నాయకులు అవినీతి చేస్తే ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టాలి కానీ, బట్టకాల్చి మీదేయడం సబబేనా? ఇలా చేస్తే ప్రజల్లో సదరు నాయకుడు పలుచనవుతారని ఆశించడం అత్యాశే అవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు విజ్ఞులు. ఎవరు ఎలాంటివారో తెలుసుకోలేనంత అమాయకులు కారనేది కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి.
పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లింది. ఎక్కడో ఎందుకు మీ తలాపు నే మిడ్ మానేరు 25.87 టీఎంసీల కెపాసిటీతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 3 టీఎంసీల నీళ్లను ఎత్తిపోసుకుంటున్న విషయం కపటనిద్రకు కానరాకపోవడం సహజమే కదా? మీరైతే ప్రభుత్వంపై స్వామి భక్తి చూపించవచ్చు, ఇతరులు నిజా లు చెప్తే మాత్రం అది భజన కింద లెక్కగడతారు. కవులు, రచయితలని చెప్పుకునేటోళ్లు మంచి చెడులను బేరీజు వేసుకునేటప్పుడు వాస్తవాలను వాస్తవాలుగానే చూపాలి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల నుంచే వృద్ధులకు పింఛన్ రూ.4 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలు ఆ మాటే ఎత్తడం లేదు. ఎందుకో ఏ మేధావీ దీనిపై మాట్లాడడు. లక్షల మంది పింఛన్‌దారుల గోస మీకు వినపడదెందుకు? పక్కరాష్ట్రం హామీ ఇయ్యకున్నా పిం ఛన్ పెంచి అమలుచేస్తున్నది. అయినా జాడే లేని జూకంటి లాంటి మహాత్ములు జాగ ఏర్పర్చుకునే ప్రయత్నంలో భాగమే ఈ వ్యంగ్య కథనాలను వండి వడ్డిస్తున్నారు.
– ఆర్ఆర్ఆర్