కిటికీలకు…మరోవైపు
అట్టహాసంగా సాగుతున్న అన్యాయాల ఊరేగింపులు,
గాలిలో కలిసిపోతున్న
పసివాడి ఆర్తనాదాలు!
ఎవరికీ వినబడని ఒక దీన గాథ.
ఆకలి తీరని ఒడ్డున
విసిరేయబడ్డ బాల్యం,
రాలిపోవడానికి సిద్ధంగా
ఉన్న కన్నీటి బిందువు.
‘వేదన’ ధనవంతుడి
అహంకారపు నవ్వుల మధ్యన..
అలికిడి లేని నిశ్శబ్ద సమాధిగా మిగిలిపోతోంది.
ముసుగులు ధరించిన
అణచివేతలు,
రంగులు మార్చుకొని
రాజమార్గాలపై
స్వేచ్ఛగా విహరిస్తుంటే..
మనం మాత్రం మన
సుఖాల గదిలో,
‘భద్రత’ అనే గాజుతెరల
వెనుక బందీలమైపోయాం.
మన కిటికీల
రెక్కలు తెరిచే ఉన్నా..
చూపులకు దొరికేది
కేవలం ఆ నీలి ఆకాశమే!
ఆ శూన్యంలో దాగి
ఉన్న ఆర్తనాదాలు,
మన చైతన్యానికి
అందని అగోచర దృశ్యాలే.
ఇంకెంతకాలం ఇలా?
మనమెప్పుడు మేల్కొంటాం?.
-రాము కోలా ,98490 01201