ఇంకా పూయాల్సిన పూలు
వేయాల్సిన చిగుళ్లు
కాయాల్సిన కలలు
చాలా ఉన్నాయి
తొలగించాల్సిన చీడపీడలూ
కాచుకోవాల్సిన తుపాను గాలులూ
చాలానే ఉన్నాయి
అప్పుడు కదా
నా చెట్టింకా బలంగా
నిలబడగలుగుతుంది
తనను నమ్ముకున్న మా అందరికీ
నిలువ నీడనివ్వగలుగుతుంది
ఇది అసోంటిసొంటి చెట్టు కాదు
తరతరాల బానిసత్వంలోంచి
దొర గడీల పెత్తనంలోంచి
ఉద్యమపోరాట ఫలితమై
మొలుచుకొచ్చిన చెట్టు
ఈ చెట్టుపై వాలిన
పిట్టల కలలింకా నెరవేరాల్సి ఉంది
ఇది ఉద్యమాల ఊపిరుల మీద
నిలబడిన చెట్టు
త్యాగాల ఎరువుతో ఎదిగిన చెట్టు
ఈ చెట్టు చుట్టూ కంచెలా చేరి
ఎటువంటి వంచనలకు గరికాకుండా
మనందరం కాపాడుకోవాల్సిన
మన మూలధాతువు ఈ చెట్టు
– చిత్తలూరి
9133832246