ఆ తోలు బర్రెదో దున్నదో ఎరుగను నేను
తోలు కుట్టు సంచి
నాకిచ్చింది జనమెరుగని శాస్త్రవేత్త
ఊరి చివరన ఇంట్లో
అక్షరం తెలువకున్న తరాల పనితనం
నాకో పనిముట్ల సంచికి అంకురార్పణ!
భుజానికి తగిలించుకుని
ఊరూరా గిరగిరా తిరిగి
చకచకా బొచ్చు కొరిగి
తృణమో, ఫణమో
పొట్ట నింపేది!
ఇళ్ళలోకెళ్ళలేని అంతరం
రచ్చబండ కాడో
పెరట్లోనో ఊరి చివరనో
నా కత్తి పదును తేలేది
అందాన్ని పెంచడమే తెల్సు కత్తికి
అందలమెక్కడం తెలీదు!
ప్రపంచీకరణ నా కత్తినీ, వృత్తినీ మింగేసి
బడాబాబుల కత్తులు
నా గొంతుపై వేలాడుతుంటే
అసిపెలు కొక్కేనికి
నేనేమో నిసత్తువతో..
నరునికీ, నాగరికతకూ
పురుడు పోసిన కత్తి
కొత్త సృష్టికి పురుడు పోయాలని
అసంకల్పితంగా నా పిడికిలి బిగుసుకుంది..
గిరిప్రసాద్
చెలమల్లు
9493388201