తెలంగాణలో తలసరి ఆదాయం దేశంలోనే అత్యధికం అనే వార్తలు వచ్చినా, తెలంగాణలో అభివృద్ధికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా ఏ గణాంకాలు వచ్చినా చంద్రబాబు స్పందిస్తూ ఉంటారు. అన్నింటికీ ‘నేనే కారణం’ అని చెప్తుంటారు. తన జీవిత కాలంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సందర్శించని యాదగిరిగుట్ట అభివృద్ధికి కూడా తానే కారణం అని చెప్పుకొంటారు. చివరకు తాజాగా తెలంగాణ తన బ్రెయిన్‌చైల్డ్ అని చెప్పారు. 2014లో రాష్ట్ర విభజన జరిగి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక ఎక్కడికి వెళ్లినా ఏదో చేస్తానంటూ చెప్పుకొనేవారు. ఏపీలో చేసిందేమీ లేక ఇంకా తెలంగాణ, హైదరాబాద్‌కు ఏదో చేసినట్టు ‘నేనే నేనే’ అని చెప్పుకొని తిరుగుతున్నారు.
తెలంగాణకు సంబంధించినంత వరకు చంద్రబాబు చివరి విజయం 1999 ఎన్నికల్లో అంటే 27 ఏండ్ల క్రితం. 1999లో టీడీపీ విజయం సాధించి 2004 వరకు అధికారంలో ఉన్నది. కానీ 2001లో టీఆర్ఎస్ ఆవిర్భవించిన తర్వాత ఏ ఉపఎన్నిక జరిగినా తెలంగాణలో టీడీపీ డిపాజిట్లు గల్లంతయ్యాయి. 2004 నుంచి లెక్కబెట్టినా చంద్రబాబు తెలంగాణాలో అధికారం చెలాయించి 22 ఏండ్లు గడిచిపోయాయి.
చంద్రబాబు పాలనలో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధించిందని చెప్పుకొంటున్నారు. కానీ చంద్రబాబు పాలన అంటే తెలంగాణ ప్రజలకు ఒక పీడకల. ఆనాటి పరిస్థితులు గుర్తుకొస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. రైతుల ఆత్మహత్యలు, కరువు, వలసలు, విద్యుత్తు ఉద్యమాలు, రైతులపై పోలీసుల కాల్పులు కండ్ల ముందు కనిపిస్తాయి. ఆ తీవ్ర సంక్షోభ పరిస్థితుల్లోనే కదా మలిదశ తెలంగాణ ఉద్యమం మళ్లీ పురుడుపోసుకున్నది. బాబు పాలనలో తెలంగాణలో ఎం తటి దయనీయమైన పరిస్థితులు ఉండేవో నాటి టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికే సాక్ష్యం. తెలుగుదేశం పార్టీ రికార్డులను చంద్రబాబు ఓ సారి ‘రెండు కండ్ల’తో చూసుకుంటే ఆనాటి తెలంగాణ ఎలా ఉండేదో అర్థమవుతుంది. ఆ సమయంలో మెదక్ జిల్లాలో రైతుల ఆత్మహత్యలు జరిగాయి. అప్పుడు కడపకు చెందిన టీడీపీ రాజ్యసభ సభ్యుడు సి.రామచంద్రయ్య నేతృత్వంలో ఒక నిజ నిర్ధారణ కమిటీ వేశారు.
మెదక్‌లో ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించి నివేదిక ఇవ్వాలని సూచించారు. తెలంగాణలో అప్పటి పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబ దుస్థితి చూసి ఆయన చలించిపోయారు. మీడియాతో ఎన్టీఆర్ భవన్లో తన మనసులోని బాధను ఇష్టాగోష్టిలో వివరించారు. ఎన్నికలకు ముందు వరకు చంద్రబాబు జిల్లాల వారీగా గ్రోత్ రేట్లు వివరించేవారు. ఉభయ గోదావరి జిల్లాల కన్నా మెదక్ జిల్లాలో గ్రోత్‌రేట్ ఎక్కువ అని చంద్రబాబు లెక్కలు చెప్పారు. ఆత్మహత్య చేసుకొన్న రైతు భార్యను పరామర్శించేందుకు సి.రామచంద్రయ్య వెళ్లారు. ‘ఆమె ముఖం నిర్జీవంగా ఉన్నది. అంతకుముందే కొడుకును పోగొట్టుకున్నది.. ఇప్పుడు భర్త పోయాడు. నిర్జీవంగా ఉన్న ఆమెను చూసి ఓదార్చటానికి కూడా నాకు మాటలు రాలేదు’ అని రామచంద్రయ్య విలేకరులకు చెప్పారు.
చంద్రబాబు వద్దకు వెళ్లి ‘ఏం గ్రోత్ రేట్లు సార్. అక్కడ వారి ముఖాల్లో జీవమే లేదు. మనం గ్రోత్ రేట్లు చూపిస్తున్నాం అని బాబుతోనే చెప్పాను’ అని రామచంద్రయ్య రిపోర్టర్స్‌కు చెప్పారు. ‘రాజకీయ నాయకునిగా ఎన్నోసార్లు పరామర్శించడానికి వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. బాధపడడానికి కూడా ముఖంలో జీవం ఉంటుంది. కానీ ఆ రైతు భార్య ముఖంలో అసలు జీవం లేదు. ఏమని పరామర్శించాలి’ అని రామచంద్రయ్య విలేకరులతో తన ఆవేదన పంచుకున్నారు.
తెలంగాణ ఏర్పడిన ఆరు నెలల తర్వాత పరిస్థితులు మారడం మొదలైంది. అభివృద్ధి పనులు ఒక్కొక్కటిగా పట్టాలెక్కాయి. కేసీఆర్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బంధు గ్రామీణ తెలంగాణలో గణనీయమైన మార్పు తీసుకువచ్చాయి. హైదరాబాద్ శివారు నుంచి 50-60 కిలో మీటర్ల పరిధిలో వ్యవసాయ పొలాలు ఎకరం కోటి రూపాయలకు పైగానే పలుకుతున్నది. తెలంగాణ రాష్ట్ర శివారుల్లో సైతం వ్యవసాయ పొలాల ధరలు ఆకాశంలో ఉన్నాయి. పంట నష్టపోతే, బిడ్డ పెండ్లికి ఖర్చు కండ్ల ముందు కదలాడితే ఆనాటి రైతులు కొందరు ఆత్మహత్యనే శరణ్యం అనుకునేవారు. తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల తెలంగాణ గ్రామీణ స్వరూపం మారిపోయింది. ‘అవసరమైతే అర ఎకరం పొలం అమ్మి అయినా బిడ్డ పెండ్లి ఘనంగా చేస్తా’ అని రైతులు ఆత్మవిశ్వాసంతో పలికే రోజులు వచ్చాయి.
కరోనా భయం వీడిన కొత్తలో భువనగిరి సమీపంలోని గ్రామానికి చెందిన మా బంధువుల పెండ్లికి వెళ్తే ‘మనవరాలికి రెండు కోట్లు ఇచ్చాను’ అని బంధువు చెప్పారు. సాధారణ ఉద్యోగికి రెండు కోట్లు ఎలా వచ్చాయని ఆలోచిస్తుంటే ‘రెండు ఎకరాలు ఇచ్చాను.. ఎకరం కోటి’ అన్నారు. ఆ తర్వాత ధర ఇంకా పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత భూమి ధర స్తబ్దతగా ఉన్నది. కానీ బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో రైతులు సగర్వంగా తలెత్తుకున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అంటే కరువు నిలయంగా ఉండేది. బీఆర్ఎస్ పాలనలో కరువు పరిస్థితులను అధిగమించి, దేశంలోనే అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా రికార్డు సృష్టించింది.
‘నేను తలుచుకుంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తా’ అని చంద్రబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ‘మీరు చెప్తే హైదరాబాద్ నుంచి పరిశ్రమలు కాదు, కనీసం కొబ్బరి బొండాల బండి కూడా వెళ్లిపోదు’ అని అప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెలంగాణ వాదులు చంద్రబాబుకు గట్టిగానే సమాధానం చెప్పారు. మరోవైపు ఏపీలో బాబుకు చెప్పుకోవడానికి ఏమీ లేవు. బలమైన మీడియా అండ తప్ప ‘ఇదుగో ఇది చేశాను’ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. ‘తెలంగాణ నా బ్రెయిన్ చైల్డ్, తెలంగాణను ఎప్పుడూ వ్యతిరేకించలేదు’ అని చంద్రబాబు చెప్తున్నారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆంధ్ర సీఎంగా చంద్రబాబు 2014లో పారిశ్రామికవేత్తలతో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలో దిల్సుఖ్నగర్, కోఠి, లుంబినీపార్క్ లో జరిగిన ఉగ్రవాదుల బాంబు పేలుళ్లు, మావోయిస్టుల హింసాత్మక ఘటనల దృశ్యాలు చూపిస్తూ ‘తెలంగాణ ఎప్పుడూ ఉద్యమాలు, హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతుంది. ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఎలాం టి ఉద్యమాలూ ఉండవు’ అని తెలంగాణపై తన అక్కసును ప్రదర్శించారు. ఓటుకు నోటు ద్వారా తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూశారు. ఆ తర్వాత ఏమైందో అందరికీ తెలిసిందే.
సమైక్య రాష్ట్రం నాటి పరిస్థితిని మరోసారి గుర్తుచేసుకుంటే 1995లో చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రం సీఎం అయ్యారు. మూడేండ్లలో హైటెక్ సిటీ నిర్మాణం పూర్తి చేసి హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టినట్టు ఇప్పుడు చెప్పుకొంటున్నారు. ఎవరికైనా ప్రతిభాపాటవాలు రోజు రోజుకు పెరుగుతాయి, తగ్గవు కదా? 2014లో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి అయ్యాక ఐదేండ్లు పాలించారు. మరి ఆంధ్రను ప్రపంచ పటంలో పెట్టే విధంగా ఏం చేశారు? ఐదేండ్ల పాలనా కాలంలో చెప్పుకోవడానికి ఏం చేశారు? ఇప్పుడు రెండవసారి ఆంధ్రాలో అధికారంలోకి వచ్చి రెండేండ్లు అవుతున్నది. అంటే విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం ఏడేండ్లలో సాధించిన అభివృద్ధి ఇదీ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. వర్షం వస్తే నీళ్లలో మునిగిపోయేవి, నీళ్లు కారేవి తాత్కాలిక సచివాలయ నిర్మాణాలు తప్ప ఏమీ లేవు.
2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఓ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఏప్రిల్ 2న జరిగిన సభలో మాట్లాడుతూ ‘ఆంధ్రప్రదేశ్‌లో 20 హైదరాబాద్‌లను తయారు చేస్తా’ అని ప్రకటించారు. ఇప్పటికే ఆంధ్రను ఏడేండ్లు పాలించారు. ఇప్పటికీ ఏపీలో హైదరాబాద్ లాంటి ఎన్ని నగరాలను తయారు చేశారో! వచ్చే ఎన్నికల్లోనూ చంద్రబాబు హైదరాబాద్ పేరు చెప్పుకొని ఏపీలో ఎన్నికల్లో ప్రయోజనం పొందాలి అని చూస్తున్నారు. 22 ఏండ్ల క్రితం పాలించిన హైదరాబాద్ గురించి ఇంకా మాట్లాడుతున్నారు.
ఏడేండ్లలో ఆంధ్రకు ఏం చేశారు? అని మీడియా అడగదు, ప్రజల నుంచి ఆ ప్రశ్న రాకుండా మీడియా, టీడీపీ రెండూ శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాయి. ఆంధ్రాలో చెప్పుకోవడానికి ఏమీ లేకపోవడంతో తెలంగాణ, హైదరాబాద్ పేరు చెప్పుకోవడమే చంద్రబాబుకు గతి. అది కూడా తన ఘనత లేకుండానే. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబును వదిలించుకున్నట్టు తెలంగాణ ప్రజలు భావిస్తుంటే… చంద్రబాబు మాత్రం నిను వీడను నీడను ‘నేనే’ అన్నట్టుగా చంద్రబాబు ప్రవర్తిస్తున్నారు.
– బుద్దా మురళి