ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాదు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అనేక సందర్భాల్లో చెప్పారు. కానీ, అమలుకు నోచుకోవడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, జర్నలిస్టులకు జారీచేసిన హెల్త్‌కార్డులు ఎక్కడా పని చేయడం లేదు. ఇవి దేనికీ పనికిరావని, ముందుగా నగదు చెల్లించి రీయింబర్స్మెంట్ చేయించుకోవాలని ఆసుపత్రుల యాజమన్యాలు ఉచిత సలహాలు ఇస్తున్నాయి. అయితే వైద్యానికి భారీగా ఖర్చవుతుంటే ప్రభుత్వం మాత్రం రూ.2 లక్షలలోపే రీయింబర్స్మెంట్ ఇవ్వడం సరికాదు. ప్రజా ప్రభుత్వం అంటున్న రేవంత్ సర్కార్.. ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు, వారి కుటుంబసభ్యుల విషయంలో ఉదాసీనంగా వ్యవహరించడం సబబు కాదు. ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా ఈ వర్గాలవారు అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో నగదు రహిత వైద్యాన్ని అందించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, అన్నిరకాల దవాఖానల్లో హెల్త్‌కార్డులు చెల్లుబాటు అయ్యేటట్టు ఉత్తర్వులు జారీ చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్లు కోరుతున్నారు.