విభజించి పాలించు అనేది బ్రిటిష్ రాజనీతి అయితే పునర్విభజించి పాలించు అనేది బీజేపీ పన్నిన కూటనీతి. అందుకు మహిళలను అడ్డుపెట్టుకుని గట్టు దాటేందుకు ప్రయత్నించి భంగపడటం తాజా పరిణామంగా చెప్పుకోవాలి. కేవలం మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించటమైతే ఎవరికీ ఏ అభ్యంతరం లేదు. కానీ ఆ ముసుగులో నియోజకవర్గాల పునర్విభజనకు దారి సుగమం చేసుకోవాలని అనుకోవడంలోనే అసలు కీలకం ఉన్నది. అంతిమంగా మరోసారి మహిళా బిల్లు రాజకీయాల దొంతరలో చిక్కుకుని వెనుకకు పోవడం మన ప్రజాస్వామిక వ్యవస్థ నిజాయితీకి, నిబద్ధతకు అద్దం పడుతున్నది.
మహిళా బిల్లు ముసుగులో తన సొంత ఎజెండా అయిన నియోజకవర్గాల పునర్విభజనను ముందుకు తేవడంలోనే బీజేపీ ఎత్తుగడ దాగున్నది. 2023లోనే ఆమోదం పొంది అమలును వాయిదా వేసిన మహిళా బిల్లును బెంగాల్, తమిళనాడు సహా ఐదు రాష్ర్టాల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ అస్త్రంగా మోదీ సర్కార్ ముందుకు తెచ్చిందనేది నిర్వివాదాంశం. రాజ్యాంగ సవరణ బిల్లు మూడింట రెండొంతుల మెజారిటీ లేకుండా ఆమోదం పొందలేదని, అంత బలం తమకు సొంతంగా లేదని వారికి తెలియదని అనుకోలేం.
మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలనే ప్రయత్నాలు ఈనాటివి కావు. రాజ్యాంగ సభ చర్చల్లోనే ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. నవ స్వతంత్ర భారతానికి రాజ్యాంగాన్ని రచించే ఆ సభలో 389 మంది సభ్యులుంటే అందులో కేవలం 15 మంది మాత్రమే మహిళలు. అయితే రిజర్వేషన్ కల్పించాలనే ప్రతిపాదన వచ్చేసరికి వాదోపవాదాలు జరిగాయి. చివరికి ఆ విషయం దిగ్విజయంగా అటకెక్కింది. దాదాపు ఆ కాలంలోనే ఏర్పాటైన మధ్యంతర పార్లమెంటులోనూ మహిళల ప్రాతినిధ్యం అడుగంటిపోవడం చర్చకు వచ్చింది. మహిళలకు చోటు కల్పించేందుకు వ్యవస్థ దానంతట అదే జాగ్రత్తలు తీసుకుంటుందనే ఆకాంక్షతోనే మహిళలు తమ స్థానాలను మగవారికి వదిలేశారని రాజ్యాంగ సభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భోగరాజు పట్టాభి సీతారామయ్య భరోసా వ్యక్తం చేశారు. దీనికీ ఆయన ‘జెంటిల్మెన్స్ అగ్రిమెంట్’ అని పేరు పెట్టడం గమనార్హం.
ఆ తర్వాత 50 సంవత్సరాల వరకూ మహిళల ప్రాతినిధ్యం నానాటికీ తీసికట్టు అవుతూ వచ్చింది. 1996 నాటి లెక్క తీస్తే 543 మంది సభ్యుల్లో 6.5 శాతం మాత్రమే మహిళలు ఉండటంతో జెంటిల్మెన్ అగ్రిమెంట్ అనేది ఉత్త డొల్ల అని రూఢీ అయింది. 1996 సెప్టెంబర్ 12న 33 శాతం మహిళా రిజర్వేషన్ కోసం ఉద్దేశించిన బిల్లుపై 10 నిమిషాల పాటు చేపట్టిన చర్చ భీకర వాగ్యుద్ధంగా పరిణమించింది. ఆ 33 శాతంలో బడుగువర్గాల మహిళలకు రిజర్వేషన్ కల్పించడం అనే అంశంపై పీటముడి పడింది.
1998, 2003, 2008, 2014లో మరో నాలుగుసార్లు ఆ బిల్లు ముందుకు రావడం, వెనుకకు పోవడం యథావిధిగా జరిగిపోయింది. చివరిసారిగా 2023లో బిల్లు 128వ రాజ్యాంగ సవరణ రూపంలో పార్లమెంటు ఆమోదం పొందినా అమలుకు విధించిన గడువు వల్ల, బడుగువర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వివాదాస్పదమైంది. రాబోయే జనగణన అనంతరం 2029 ఎన్నికల నుంచి అమలు చేయాలనుకున్న రిజర్వేషన్ను 2011 జనగణన ఆధారంగా చేపట్టిన గుండుగుత్త 50 శాతం డీలిమిటేషన్తో ముడిపెట్టి ముందుకు తీసుకురావడం పెద్ద మోసమేనని చెప్పాలి.
మహిళా ప్రాతినిధ్యంలో ప్రపంచ సగటు 26.5 శాతం కాగా, ప్రపంచంలోనే ప్రప్రథమంగా మహిళలకు రిజర్వేషన్ కల్పించిన దేశంగా కీర్తి గడించిన ఫిలిప్పీన్స్ 28 శాతంతో ప్రపంచ సగటును దాటిపోయింది. మన ఇరుగుపొరుగు దేశాలైన పాకిస్థాన్, బంగ్లాదేశ్ల్లోనూ మహిళలకు సీట్ల రిజర్వేషన్ అమలవుతున్నది. నేపాల్, దక్షిణ కొరియాల్లో 50 శాతం రిజర్వేషన్ ఉండటం మహిళల ప్రాభవాన్ని చాటిచెప్తున్నది. కాగా, మనదేశంలో చట్టసభల్లో మహిళల వాటా 14 శాతం మాత్రమే. తీరా మహిళా బిల్లు వీగిపోయాక మహిళలకు విపక్షాలు అన్యాయం చేశాయని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ వాపోవడం విడ్డూరం.
‘భ్రూణహత్య’గా అభివర్ణించడం ఈ ధోరణికి పరాకాష్ట. మొత్తమ్మీద ప్రధాని నరేంద్ర మోదీ ప్రభ, ప్రాభవం తగ్గాయని పార్లమెంటరీ ఓటమి స్పష్టం చేసింది. ఇది ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ర్టాల ఎన్నికల దృష్ట్యా ఆడిన వ్యూహాత్మక నాటకం అనేది తెలుస్తూనే ఉన్నది. బిల్లును ఓడించి విజయం సాధించామని విపక్షం, విపక్షాలను ఇరకాటంలో పడేశామని పాలకపక్షం సంబరపడుతున్నాయి. కానీ అంతిమంగా ఓడింది మాత్రం మహిళలేననేది నిఖార్సయిన నిజం. ‘ఆకాశంలో సగమైన’ మహిళా లోకానికి మూడోవంతు వాటా అందకుండా పోవడం దారుణం.