Shivanna – Ram Charan | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి, కన్నడ సినీ దిగ్గజం డా. రాజ్‌కుమార్ కుటుంబానికి మధ్య దశాబ్దాలుగా ఆప్యాయ బంధం కొనసాగుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో తాజాగా మరో అందమైన ఉదాహరణ కనిపించింది. ‘పెద్ది’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ కలిసి ఓ అరుదైన జ్ఞాపకాన్ని మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.’పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా, శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం అనంతరం రామ్ చరణ్, శివరాజ్‌కుమార్, జాన్వీ కపూర్ పాల్గొన్న ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ రికార్డ్ చేశారు.
ఈ ఇంటర్వ్యూలో యాంకర్, చిరంజీవి మరియు రాజ్‌కుమార్ కలిసి ఉన్న ఓ పాత ఫొటోను చూపించారు. ఆ ఫొటోలో రాజ్‌కుమార్ ప్రేమగా చిరంజీవిని ముద్దు పెట్టుకున్న సందర్భం ఉండగా, ఆ అరుదైన క్షణం పూర్తిగా కెమెరాలో క్యాప్చర్ కాలేదని ప్రస్తావించారు. అనంతరం అదే సన్నివేశాన్ని రీక్రియేట్ చేయాలని రామ్ చరణ్, శివరాజ్కుమార్లను కోరారు. యాంకర్ అభ్యర్థనకు స్పందించిన శివరాజ్‌కుమార్, రామ్ చరణ్‌ను ప్రేమగా హత్తుకుని ఆయన బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు. ఈ దృశ్యం అక్కడున్న వారిని ఆకట్టుకోగా, సోషల్ మీడియాలోనూ వేగంగా వైరల్ అయింది. రెండు సినీ కుటుంబాల మధ్య ఉన్న ఆత్మీయత, పరస్పర గౌరవానికి ఇది నిదర్శనమంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
చిరంజీవి, రాజ్‌కుమార్ కలిసి ఎప్పుడూ ఒకే సినిమాలో నటించకపోయినా, వ్యక్తిగతంగా మంచి స్నేహబంధాన్ని కొనసాగించారు. రాజ్‌కుమార్ మరణానంతరం కూడా ఇరు కుటుంబాల మధ్య ఆ అనుబంధం అలాగే కొనసాగుతోంది. ఇప్పుడు వారి వారసులు రామ్ చరణ్, శివరాజ్‌కుమార్ కలిసి తెరపై కనిపించనుండటం అభిమానులకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.ప్రస్తుతం చెర్రీ–శివన్న రీక్రియేట్ చేసిన ఈ ఎమోషనల్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, మెగా మరియు కన్నడ అభిమానులు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ‘పెద్ది’ సినిమా విడుదలకు ముందే ఈ ప్రత్యేక ఘట్టం ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచింది.
History recreated ❤️@AlwaysRamCharan Garu @NimmaShivanna Garu Recreate a Lovely Memory ✨#PEDDI pic.twitter.com/kNxSExAVlK
— PEDDI (@PeddiMovieOffl) May 29, 2026