గోల్కొండ, చార్మినార్, ముత్యాలు, బిర్యానీ.. ఇలా కొన్నింటిని పేర్కొనగానే మనకు హైదరాబాదు గుర్తుకు వస్తుంది లేదా హైదరాబాద్ అనగానే ఇలాంటివి గుర్తుకురావడం కద్దు. అయితే కాలం గడిచే కొద్దీ పరిణామాలు ముంచుకు వచ్చే దారిలో మరెన్నో అద్భుతాలు జరుగుతాయి. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఓ ప్రముఖ విశ్వనగరం. మన హైదరాబాద్‌కు చెందిన సైన్స్ పాత్రికేయుడు, ఆంగ్ల రచయిత దినేశ్ సీ శర్మ ‘బియాండ్ బిర్యాని-ది మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబలైజ్డ్ హైదరాబాద్’ అనే పేరుతో సుమారు 350 పేజీల ఆంగ్ల గ్రంథాన్ని వెలువరించారు. ఈ పుస్తకం పేరు చూడగానే ఇదేదో బిర్యాని వంటకానికి సంబంధించిన గ్రంథమని అనిపించొచ్చు. కానీ కవర్ పేజీ చూస్తే అడుగున చార్మినార్, పైన హైటెక్ సిటీ కనబడి మధ్యలో ఎలక్ట్రానిక్ సర్క్యూట్‌ను తలపించే ప్రతీకలు పాఠకుడికి విజ్ఞాన భరితమైన అభిప్రాయాన్ని కల్పిస్తుంది.
వెస్ట్‌ల్యాండ్ ప్రచురించిన ఈ గ్రంథం స్థూలంగా 1908 నుంచి 2022 వరకు హైదరాబాద్ నగర పరిణామాన్ని 15 అధ్యాయాల్లో వివరిస్తుంది. తొలి ఐదు అధ్యాయాలు హైదరాబాద్ నైజాం సంస్థానంలో ఆధునికత, సైన్స్ ఎలా విప్పారాయో చెప్తూ క్లోరోఫామ్, మలేరియా సంబంధించిన నేపథ్యాలను మొదలుకొని దేశంలో ప్రాంతీయ భాషలో మొదలైన తొలి విశ్వవిద్యాలయం ఉస్మానియా గురించి వివరిస్తారు. తర్వాతి నాలుగు అధ్యాయాలు 1948-1999 మధ్యకాలంలో ఎలా కొత్త విజ్ఞానం నూతన దిక్తటాలను తెరిపించగలిగిందో చెబుతూ పరిశ్రమలు మొదలుకొని ఎలక్ట్రానిక్స్, న్యూక్లియర్ ఫ్యూయల్, మిస్సైల్స్ వంటి వాటి దాకా చరిత్ర పుటలను స్పృశిస్తాయి. చివరి ఆరు అధ్యయాలు ప్రపంచీకరణతో మొదలై తర్వాత నెలకొన్న ఔషధాలు, ఇంజనీరింగ్ పరిశ్రమలు, వ్యాక్సిన్లు, జినోమ్ వ్యాలీ.. మొదలైన పరిణామాలను విపులీకరిస్తాయి. హైదరాబాద్ ఎలా ప్రపంచ నగరంగా సమాయత్తమైందో.. ఆ నేపథ్యాన్ని, వైజ్ఞానిక పరిణామాలను పరిగణనలోనికి తీసుకొని రచయిత ఓ మహానగర వికాస, వైభవాలను ఆవిష్కరిస్తారు.
అయితే ఈ మార్పులను పాఠకులకు సులువుగా వివరించడానికి అనుకూలమైన రీతిలో ఉపోద్ఘాతంగా నాలుగు శతాబ్దాల హైదరాబాద్ గతిని రచయిత ముందు పేజీల్లో చెబుతారు. 16, 17 శతాబ్దాలలోనే మధ్య ఆసియా, యూరప్ దేశాల నుంచి పర్యాటకులను, వర్తకులను ఆకర్షించే రీతిలో ఈ నగరం ఎదిగిందని చెబుతూ గోల్కొండ నుంచి తీరప్రాంతంలో ఉండే మచిలీపట్నానికి రోడ్డు నిర్మించారని వివరిస్తారు. కుతుబ్‌షాహీల కాలపు ప్రణాళిక, ఆర్కిటెక్చర్, ఇంజనీరింగ్, శాస్త్ర దృక్పథం మొదలైన వాటిని చార్మినార్ నిర్మాణం తెలియచెప్తుందని అంటారు.
డైమండ్ కటింగ్‌కి సూరత్, దుస్తులకు కోయంబత్తూర్, ఎలక్ట్రానిక్స్‌కు చెన్నై, సాఫ్ట్వేర్ సేవలకు బెంగళూరు లాగానే హైదరాబాదు ఔషధాలకు, వ్యాక్సిన్ లకు, టెక్నాలజీ సర్వీసులకు పర్యాయపదంగా మారిందని చెబుతారు. ఇలా ఎదగడం అనేది ఆయా ప్రాంతాల స్వాభావికమేమో అని సూచిస్తూ బెంగళూరు, హైదరాబాదు, పుణే, భువనేశ్వర్, గాంధీనగర్, తిరువనంతపురంలలో దాదాపు ఒకేసారి సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కులు వచ్చినా కేవలం బెంగళూరు, హైదరాబాదు నగరాలు మాత్రమే ఈ రంగంలో అభివృద్ధి చెంది కీలకంగా మారడం ఏమిటో ఆలోచించమంటారు.
1980 నుండి పెద్దసంఖ్యలో రిసెర్చ్ ల్యాబ్స్, పబ్లిక్ సెక్టార్ కంపెనీలు, చిన్నాపెద్దా ప్రైవేట్ సెక్టార్ సంస్థలు, మరెన్నో ఔత్సాహిక పారిశ్రామిక సంస్థలు, సంబంధిత ఇంజనీరింగ్ కళాశాలు రావడం అనేవి నేపథ్యంగా పనిచేయడం వల్లనే నేడు సైబరాబాద్, జెనోమ్ వ్యాలీ అనేవి హైదరాబాదుకు ప్రపంచ స్థాయి గుర్తింపును తెచ్చిపెట్టాయి.
1948 సెప్టెంబర్ చివరి వారంలో బొంబాయి నుంచి మార్వాడి వ్యాపారస్తుల కుటుంబం ఒకటి హైదరాబాద్‌కు తరలివచ్చింది. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఈ రచయిత దినేశ్ సీ శర్మ హైదరాబాద్ సంబంధించిన ఎంతో మంది వ్యక్తులను కలవడమే కాకుండా ఆయా సంస్థల చరిత్రను శోధించి ఈ గ్రంథాన్ని రాశారు. ఏదో ఒక వ్యక్తి చేసిన ప్రయత్నాల వల్ల మాత్రమే కాకుండా, దశాబ్దాల తరబడి జరిగిన సమష్టి కృషి ఫలితంగానే నేడు భాగ్యనగరం విశ్వనగరంగా జేజేలు పొందుతోందని చారిత్రాత్మకమైన వైజ్ఞానిక ఆధారాలను ఈ రచయిత మన ముందుంచుతారు. హైదరాబాద్ నగర చరిత్రకు ఈ ‘బియాండ్ బిర్యానీ’ పుస్తకం ఒక విలువైన ఆభరణం.
– డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ 9440732392