న్యాయానికి అర్థం మారిపోతున్నది. కర్ర ఉన్నోనిదే బర్రె అన్నట్టుగా న్యాయమూ అదే కోవలోకి జారిపోతున్నది. కారణాలు ఏమిటో, పరిమితులు ఏమిటో తెలియదు కానీ, అధికార బలానికి అతీతంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కూడా పక్షపాత ధోరణితో తీర్మానిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికే అందుకు తాజా ఉదాహరణ. ఈ నివేదికలోని విషయాలేవీ అధికారికంగా బయటకు రాలేదు. కానీ, ఘోష్ కమిషన్ నివేదిక పేరిట ప్రభుత్వం ఉటంకిస్తున్న వ్యాఖ్యలు విస్తుగొల్పడమే కాకుండా విపరీతంగా కనిపిస్తున్నాయి.
ఒక న్యాయాధికారిగా, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిగా ఇరువైపుల వాదనలు విని న్యాయసమ్మతమైన నివేదిక రూపొందించాల్సిన జస్టిస్ ఘోష్ కేవలం రాష్ట్ర ప్రభుత్వం, అధికారపక్షమైన కాంగ్రెస్ వాదనలను నివేదిక నిండా పొందుపర్చి అన్యాయంగా వ్యవహరించారు. ఇవతలి పక్షం సమర్పించిన పత్రాలను, నివేదికలను కమిషన్ పట్టించుకోలేదు. ఇదంతా గమనిస్తుంటే ప్రభుత్వం సరఫరా చేసిన అబద్ధాలతో ఏకపక్ష నివేదికను వండివార్చిందనిపించక మానదు.
కమిషన్ పనితీరు మొత్తంగా వివాదాస్పదంగానే ఉన్నది. వాంగ్మూలాల ఉటంకింపులు, పత్రాల ప్రస్తావనలు ఒక నిర్దేశిత లక్ష్యంతో పని చేసిందని తెలియజేస్తున్నాయి. సాంకేతిక అంశాల కన్నా రాజకీయాలకే కమిషన్ ప్రాధాన్యం ఇచ్చినట్టు పైకి తెలుస్తూనే ఉన్నది. అందుకు తుమ్మిడిహట్టి గురించి చేసిన వ్యాఖ్యలే తార్కాణం. కమిషన్ పరిశీలనాంశాల్లో లేని ఈ ప్రతిపాదన గురించి ప్రస్తావించడం ప్రస్తుత పాలకవర్గానికి పనిగట్టుకుని వంత పాడటమే అవుతుంది. మూడు బరాజ్‌ల గురించి తేల్చమంటే దేనికీ సంబంధం లేని తుమ్మిడిహట్టిని ఎందుకు ముందుకు తెచ్చినట్టు? కేవలం కేసీఆర్‌ను తప్పుబట్టడమే లక్ష్యంగా వండివార్చిన రాజకీయ నివేదిక ఇది. ఉచితానుచితాలు, న్యాయాన్యాయాలు నిష్పక్షపాతంగా విచారించి లెక్కతేల్చాల్సిన తీర్పరి వ్యవహరించాల్సిన తీరు ఇది కాదు.
ఆ సంగతి అలా ఉంచితే ‘తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి’ అన్నట్టుగా కమిషన్‌కు సారథ్యం వహించిన పెద్దమనిషి ‘నా పని అయిపోయింది’ అంటూ నోరు మెదపకుండానే వెళ్లిపోవడం విడ్డూరం. ఈయన కంటే ముందుగా కరెంట్ కమిషన్ పెద్దగా నియమితుడైన పెద్దమనిషి మీడియా ముందు మాట్లాడి, పూర్వనిర్ధారిత అభిప్రాయాలతో అడ్డంగా దొరికిపోయి, ఆపై తప్పుకోవాల్సి వచ్చిన ఉదంతం గుర్తుండే ఉంటుంది. ఆ సంగతి అలా ఉంచితే ప్రస్తుతం ప్రభుత్వం ఘోష్ కమిషన్ నివేదికను బహిర్గతపర్చకుండా అందులో తనకు అనుకూలమైన కొన్ని పేజీలను పట్టుకొని హంగామా చేస్తున్నది.
నివేదికపై తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కమిషన్ చైర్మన్ తాలూకు గతకీర్తి వెనుక దాక్కుని రాళ్లు వేయాలని చూస్తున్నది. గొప్పవాళ్లు ఇచ్చిన నివేదికలు గొప్పగా ఉండాలని ఏమీ లేదు. గతంలో శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకు పచ్చి వ్యతిరేకంగా నివేదికలో కొన్ని అంశాలు చేర్చి, వాటిపై ‘రహస్య’ ముసుగు కప్పింది. అందులోని సంగతులు తెలుసుకున్న న్యాయస్థానం కమిటీపై మండిపడిన సంగతి తెలిసిందే. అందులో గిలికిన చిలకపలుకులు అంత దుర్భరంగా ఉన్నాయన్న మాట. ప్రస్తుత చర్చలోని కమిషన్ కూడా ఇలాంటి వివాదాలకు అతీతం కాదనే చెప్పాలి. ఒక భారీ నీటిపారుదల ప్రాజెక్టులో తప్పులు జరిగాయని, అందుకు రాజకీయ నాయకత్వానిదే బాధ్యత అని చెప్పడంలోనే తిరకాసు ఉన్నది. అన్నింటిని వదిలిపెట్టి అప్పటి సీఎంను లక్ష్యంగా చేసుకోవడం వెనుక ఉద్దేశం ఏమై ఉంటుంది?
ఒక మహానేత కన్న మహోన్నత జలస్వప్నం కాళేశ్వరం. మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌లో చెప్పినట్టుగా కాళేశ్వరం చిన్నాచితకా వ్యవహారం కాదు. అది ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ ఎత్తిపోతల ప్రాజెక్టు. మూడు బరాజ్‌లు, ఏడు లింకులు, భారీ రిజర్వాయర్లతో కూడిన బృహత్తరమైన జలశిఖరం. అది అనేకమంది నిపుణుల మేధోమథనంతో, ఆపై కేంద్ర జలసంఘం వంటి ఉన్నతస్థాయి పర్యవేక్షక సంస్థల అనుమతులతో నిర్మితమైంది.
అందులో ఒకటిన్నర పిల్లర్ దెబ్బతినడం మినహా ఇంతవరకు వేరే నష్టమేదీ జరుగలేదు. దానిని సాకుగా చూపుతూ మొత్తంగా ప్రాజెక్టునే పండబెట్టడం ఒకెత్తయితే, అప్పటి రాజకీయ నాయకత్వంపైనే బురద జల్లడం మరొకెత్తు. పైగా ప్రాజెక్టుకు అవసరమైన మరమ్మతుల గురించి కమిషన్ ఏమైనా చెప్పిందా? ఎక్కడో గోడకు చిన్న పగులు కనిపించిందని మొత్తంగా ఇంటినే కూల్చేసుకుంటామా? చిన్నచిన్న మరమ్మతులు చేసి పొలాలకు నీటిని పారించవచ్చు కదా? భారీగా ప్రజాధనంతో కట్టిన భూరి ప్రాజెక్టును ఏదో వంకతో పడావు పెట్టి చోద్యం చూడటం భావ్యం కాదని కమిషన్ కనీసం చెప్పాల్సింది.
‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ రాజేంద్రసింగ్ సహా దేశవిదేశాల జలనిపుణులు ఎందరో కేసీఆర్ నీటిపారుదల రంగంలో సాధించిన విజయ పరంపరపై అబ్బురం వ్యక్తం చేశారు. తెలంగాణ సాగు ముఖచిత్రాన్ని కాళేశ్వరం మార్చివేసిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర కితాబిచ్చారు. మరో ఆర్థర్ కాటన్‌గా మన్ననలు అందుకున్నారు కేసీఆర్. ఇలాంటివేవీ లెక్కలోకి తీసుకోకుండా కేవలం కేసీఆర్ మీద జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారాన్ని నివేదికలో కూరితే సరిపోతుందా? ఇదెక్కడి న్యాయ నిర్ణయం? కాళేశ్వరం గురించి తక్కువ చేసి మాట్లాడటం, బట్టకాల్చి మీదేయడం మరో జలద్రోహానికి తెరతీయడమే. ఆ పని ఇక్కడి కాంగ్రెస్ నాయకత్వం వెలగబెడుతూనే ఉన్నది. కమిషన్ అందులో గొంతు కలపాల్సిన అవసరం ఉన్నదా?