అగ్రరాజ్యం అమెరికా దుందుడుకు, దుస్సాహసిక చర్యలతో అంతర్జాతీయ ఆర్థిక, వ్యూహాత్మక రంగాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్-యూరోపియన్ యూనియన్ (ఈయూ) స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారైందనే వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సుదీర్ఘ చర్చల అనంతరం ఈయూ-భారత్ మధ్య వాణిజ్య సయోధ్య కొలిక్కి రావడం ముదావహం. త్వరలో సంతకాలు జరుగనున్న ఒప్పందాన్ని ‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’ (అన్ని ఒప్పందాలకు జేజెమ్మ లాంటి ఒప్పందం) అని అందరూ పిలుస్తున్నట్టు ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా ఫాన్ డెర్ లెయెన్ పేర్కొనడం ప్రపంచవ్యాప్తంగా పతాకశీర్షికగా నిలిచింది. అమెరికా ఒంటెత్తు వాణిజ్య పోకడలతో విసిగిపోయిన ఇరుపక్షాలూ ఉభయతారకమైన రీతిలో ఏకాభిప్రాయనికి రావడంపై వాణిజ్యవర్గాల్లో హర్షామోదాలు వ్యక్తమవుతున్నాయి. టారిఫ్‌లను ఆయుధాల్లా విసురుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ పరిణామం పెద్ద ఎదురుదెబ్బ. భారత్, ఈయూ సరుకులపై ఎడాపెడా టారిఫ్‌లు విధించిన సంగతి తెలిసిందే. వీటిని తప్పించుకునేందుకే భారత్, ఈయూ ఆగమేఘాల మీద ఒప్పందంపై నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందనేది పైకి తెలుస్తూనే ఉంది.
భారత్-ఈయూ ఒప్పందానికి సానుకూల వాతావరణం ఏర్పడిందన్న ఆశావహ వార్తల వల్ల సహజంగానే ఈ ఒప్పందంలో ఏమేం ఉండబోతున్నాయనే ఆసక్తి ఎక్కువైంది. భారత్, ఈయూ చారిత్రికంగా పటిష్టమైన వాణిజ్య సంబంధాలను కలిగి ఉన్నాయి. 2024లో ద్వైపాక్షిక వాణిజ్యం 135 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా పేరుపొందిన భారత్ జీడీపీ అభివృద్ధి 7.3 శాతం మేర ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేస్తున్నది. అటు ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థికశక్తి ఈయూ అనేది తెలిసిందే. 146 కోట్ల పైచిలుకు జనాభాతో కూడిన భారత్ ఈయూకు సువిశాలమైన మార్కెట్‌ను అందిస్తుంది. అమెరికా, చైనా ఒత్తిడులతో నిమిత్తం లేకుండా పరస్పర ప్రయోజనకర వాణిజ్య నిర్వహణకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
ప్రత్యేకించి భారత్‌కు కలిగే ప్రయోజనాలు ఏమిటని ఆలోచిస్తే పలు అంశాలు ముందుకు వస్తున్నాయు. తాజా సంకేతాలను బట్టి అమెరికాకు ఎగుమతి చేయలేకపోయిన సరుకులకు ఈయూలో అవకాశాలు ఏర్పడుతాయి. ఈయూలోని 27 దేశాలు భారత్ సరుకులు, సేవలకు ఈ ఒప్పందం విశాల ద్వారాలు తెరుస్తుంది. ముఖ్యంగా భారతీయ ఫార్మా, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు ఈయూ పెద్ద మార్కెట్‌గా నిలుస్తుంది. అమెరికా టారిఫ్‌ల కారణంగా దెబ్బతిన్న భారతీయ టెక్స్టైల్, ఆభరణాలు, చర్మ ఉత్పత్తుల పరిశ్రమలకు ఊరట లభిస్తుంది. భారతీయ దుస్తులపై ప్రస్తుతం ఉన్న 10 శాతం ఈయూ టారిఫ్ రద్దయిపోతుంది. అమెరికా ఒత్తిడితో సమస్యలు ఎదుర్కొంటున్న భారతీయ ఐటీ, సేవల రంగానికి ఈయూ ప్రత్యామ్నాయంగా చేతికి అంది వస్తుంది. అస్థిరతలు, అడ్డుకట్టలు తొలిగి, వాణిజ్య సహకారం కొత్తపుంతలు తొక్కుతుందనే ఆశాభావం వ్యక్తమవుతున్నది. వ్యూహాత్మక రంగంలోనూ భారత్, ఈయూ సహకారం విస్తరణకు ఈ ఒప్పందం దోహదం చేస్తుందని అంటున్నారు. ట్రంప్ టారిఫ్‌ల పుణ్యమా అని ఈ కీలక ఒప్పందం సత్వరమే కుదిరిందని చెప్పడం సత్యదూరం కాదు.