వస్తాయి కొన్ని విషాదపు పిట్టలు
వలస పక్షులుగా వచ్చి వాలుతాయి
మన గుండె కొమ్మలపై
గదుల్లో కొన్నాళ్ళుండి పిల్లలను తీస్తాయి
పాడతాయి కరుకుగా ఉండే పాటలు
మనలోని తడి ఇంకిపోయేదాకా
ముక్కులతో పొడుస్తూ తిరుగాడతాయి
అటుగా వచ్చిన కొన్ని వర్షపు గాలులకు
రివ్వున మనలోంచి ఎగిరిపోయి
అరుస్తాయి నిశ్శబ్దాల గగనసీమలో
అప్పుడు మనం పాడటం మొదలెడతాం
ఆకాశంకేసి చూస్తూ ధవళ వర్ణంలో
కన్నీళ్ళను వాన నీళ్ళలో విలీనం చేస్తూ
నీటి పాటలతో పరస్పరం
ఒక్కో మెట్టు ఎక్కుతూ
ఒక్కో భావోద్వేగాన్ని ప్రతిష్టిస్తూ
ముఖాన్ని ముత్యపుచిప్పలా
జీవసంద్రం దాటిస్తూ
ఒక కలను దాని గర్భంలో నిక్షిప్తం గాంచి
తీరంలో మళ్ళీ చూస్తాము
కొత్త పక్షులకై బుద్ధికొమ్మలు పరిచి
ఈసారి ఎటునుంచి ఏవి వచ్చి వాలినా
అవి ఏమి పాడినా..
వినసొంపైన రాగాలుగా పరావర్తనం చెందుతూ
వెండి అలలపై
కాలం మింగని నెమలి గుైడ్డె వెలిగిపోతూ
విశ్వమానవాళి ఎద గడపలపై
వెన్నెల దీపాలుగా ప్రకాశిస్తూ నడిపిస్తుంటాయి!
– రఘు వగ్గు
96032 45215