BJP | మత పౌరసత్వం.. సీఏఏతో హిందూ ఓట్లను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్న బీజేపీ ప్రభుత్వం?
దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నపళంగా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ - సీఏఏ) బయటకు తీయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
BJP | దేశంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉన్నపళంగా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని (సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్ – సీఏఏ) బయటకు తీయడంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కేవలం మత ప్రాతిపదిక మీద పౌరసత్వం కల్పించే ఈ చట్టం 2019లో ఆమోదం పొందిన సంగతి తెలిసిందే. ఇంకా నిబంధనలు నోటిఫై చేయలేదంటూ ఇప్పటిదాకా కేంద్రం దీన్ని తాత్కాలికంగా చాప కింద పెట్టింది. ఈ చట్టం అమల్లోకి రాకుండా స్టే విధించాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇంకా నిబంధనలు రూపొందించలేదనే కారణంతో సీఏఏపై సుప్రీంకోర్టు స్టే విధించకుండా కేంద్రం అడ్డుకున్నదని ఆ పిటిషన్లో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ తెలియజేయడం గమనార్హం. గత నాలుగున్నరేండ్లలో ఈ చట్టం నిలుపుదలను కోరుతూ 250కి పైగా పిటిషన్లు దాఖలు కావడం దీనిపై తలెత్తిన వ్యతిరేకతకు అద్దం పడుతున్నది. సీఏఏ చట్టం పూర్తిగా వివక్షాపూరితంగా ఉన్నట్టు అగ్రరాజ్యం అమెరికా, ఐక్యరాజ్య సమితి కూడా విమర్శిస్తున్నాయి. పౌరసత్వం మంజూరులో ముస్లింలను మినహాయించడం రాజ్యాంగానికి పూర్తి విరుద్ధమని దేశంలోని మానవ హక్కుల సంఘాలూ వాదిస్తున్నాయి. ఎన్నికలకు ముందే ఈ చట్టాన్ని అమలు చేయవచ్చని గత కొన్ని నెలలుగా బీజేపీ నుంచి సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో సోమవారం నాటి ప్రకటన చాలామందికి ఆశ్చర్యం కలిగించలేదు.
నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత ‘జో కహా సో కియా’ (మేము చెప్పింది చేశాము) అని సోషల్ మీడియాలో బీజేపీ ప్రచారం చేసుకుంటున్నది. మరోవైపు కాంగ్రెస్ సహా విపక్షాలు, విపక్ష పాలిత రాష్ర్టాలు నోటిఫికేషన్‌పై భగ్గుమంటున్నాయి. అస్సోం సహా కొన్ని రాష్ర్టాల్లో సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. కేరళ, బెంగాల్, తమిళనాడు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని తాము అమలు చేయబోమని తెగేసి చెప్తున్నాయి. అయితే పౌరసత్వం కేంద్ర పరిధిలోని అంశం కనుక ఆచరణలో ఇది సాధ్యం కాకపోవచ్చని కొందరు అంటున్నారు. ఈ చట్టంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తీవ్రంగా విమర్శించారు. పౌరసత్వాన్ని మతంతో ముడిపెట్టడం ఈ చట్టం ప్రత్యేకత. స్వతంత్ర భారత చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్ దేశాల్లో అణచివేతకు గురైన మతపరమైన మైనారిటీలకు భారతదేశ పౌరసత్వాన్ని ఇచ్చేందుకు ‘పౌరసత్వ చట్టం-1955’ను సవరించి ఈ కొత్త చట్టాన్ని తెచ్చారు. ఆయా దేశాల నుంచి వచ్చిన మైనారిటీ హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్శీలు, క్రైస్తవులు ఈ చట్టం ద్వారా పౌరసత్వం పొందవచ్చు. అయితే ఆయా దేశాల నుంచి వచ్చిన ముస్లింలకు మాత్రం ఆ అవకాశం ఉండదు. ఈ చట్టం 2019లో పార్లమెంటు ఆమోదం పొందినప్పుడు తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. హింసాత్మక ఘటనల్లో పలువురు మరణించగా, అనేకమంది గాయాలపాలయ్యారు. వేల మంది నిరసనకారులు అరెస్టు అయ్యారు. చట్టం కింద నిబంధనలు ప్రకటించకపోవడంతో అవి సద్దుమణిగాయి. తాజాగా నిబంధనలు నోటిఫై చేయడంపై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి.
గమ్మత్తయిన విషయమేమంటే ఈ కొత్త చట్టం ముస్లిమేతర దేశాల నుంచి వచ్చే శరణార్థులకు పౌరసత్వం కల్పించదు. శ్రీలంక నుంచి వచ్చే తమిళ శరణార్థులకు, మయన్మార్ నుంచి వచ్చే రోహింగ్యాలకు ఇది ఊరట కలిగించదు. మరోవైపు ప్రతిపాదిత జాతీయ సిటిజెన్ రిజిస్టర్‌తో కలిపి ప్రయోగించినప్పుడు ఇది దేశంలోని 20 కోట్ల మంది ముస్లింలను అణచివేసే సాధనంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతుండటం తెలిసిందే. ఈ చట్టం కేవలం ముస్లింలను లక్ష్యంగా చేసుకుని రూపొందించారని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గతంలోనే దుయ్యబట్టారు. ఈ చట్టాన్ని అమలు చేయడం వల్ల వలసల వరదకు గేట్లెత్తినట్టు అవుతుందని భారత సరిహద్దులకు సమీపంలో నివసించేవారితో సహా ఇతర ప్రాంతాలవారూ హెచ్చరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో హిందూ ఓట్లను ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఏకాభిప్రాయ సాధన ద్వారా అమలు చేయాల్సిన అంశాలపై కేంద్రం ఒంటెత్తుపోకడలకు పోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు. సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడేలోగా అఖిలపక్షం నిర్వహించి చట్టం అమలుపై చర్చించాలి. ఈలోగా తాత్కాలికంగానైనా సీఏఏ అమలును నిలిపివేయడం ఉత్తమం.
Read Today's Latest Editorial News in Telugu and Telugu News
- Tags
- BJP
- CAA
- Social media
- supreme court
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

