బ్రెజిల్లో అధ్యక్ష ఎన్నికలలో తిరస్కరణకు గురైన దురహంకార శక్తులు ఆదివారం దేశ అధ్యక్ష భవనంతోపాటు చట్టసభ, సుప్రీంకోర్టులపై దాడి చేయడం దిగ్భ్రాంతికరం. వెంటనే సైన్యం ఈ ఉన్మాదులను చెదరగొట్టి వందలాది మందిని నిర్బంధంలోకి తీసుకోవడం వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం తప్పింది. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికలలో వామపక్ష భావజాలం గల లూలా డ సిల్వా ఎన్నికై ఇటీవలే అధికారం చేపట్టారు. కానీ మాజీ అధ్యక్షుడు బోల్సోనారో మద్దతుదారులు దాదాపు పది వారాలుగా సైనిక ప్రధాన కార్యాలయం ముందు గుడారాలు వేసుకొని ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నాడు అధికార పీఠాలపైనా దాడులకు తెగించారు. బోల్సోనారో ఓటమిని వీరు అంగీకరించలేక పోతున్నారు. గతంలో అమెరికా అధ్యక్ష పదవిలో ట్రంప్ ఓడిపోయినప్పుడు ఆయన మద్దతుదారులు కూడా ఎన్నిక చెల్లదంటూ దాడికి దిగారు. మత, జాతిపరమైన దురహంకార శక్తులు ఎక్కడ ఉన్నా ప్రజాస్వామిక వ్యవస్థను అంగీకరించవు అనడానికి ఈ ఘటనలు ఉదాహరణగా నిలుస్తాయి.
బోల్సోనారో కూడా ట్రంప్ మాదిరిగానే పేదల సంక్షేమానికి వ్యతిరేకి. పర్యావరణాన్ని పరిరక్షించే చట్టాలంటే ఆయనకు గిట్టవు. ప్రకృతి వనరులను తనకు నచ్చిన వ్యాపారులకు కట్టబెట్టడమే అతడి లక్ష్యం. లౌకికవాదానికి బద్ధ విరోధి. ప్రజల సమస్యలను పరిరక్షించకపోగా, రాజకీయ లబ్ధి కోసం మత రాజకీయాలను రెచ్చగొట్టడమే అతడి విధానం. ఇటువంటి నాయకులు ప్రజాస్వామ్య వ్యవస్థలే ఆలంబనగా ఎన్నికవుతారు, ఆ తర్వాత ఆ ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తారు. బోల్సోనారో కూడా తాను ఎన్నికైన పార్టీనే బలహీనపరచి తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని చూశాడు. కానీ పేదరికం పెరిగిపోవడంతో ప్రజలు మార్పు కోరుకున్నారు. మత దురహంకారాన్ని రెచ్చగొట్టినప్పటికీ, ప్రజలు వామపక్ష నాయకుడైన లూలాను గెలిపించారు. దీంతో మతవాదులు ఈ దాడులకు, విధ్వంసానికి దిగారు.
నేడు లాటిన్ అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితికి బ్రెజిల్ అద్దం పడుతున్నది. ప్రపంచీకరణ తరువాత కొన్ని కార్పొరేట్ శక్తుల మద్దతుతో మత, జాత్యహంకారులు అధికారానికి రావడానికి ప్రయత్నిస్తున్నారు. జర్మనీ, ఫ్రాన్స్ మొదలుకొని ఉత్తమ ప్రజాస్వామిక రాజ్యాలుగా వెలుగుతున్న నార్వే వంటి దేశాలలో కూడా ఈ విద్వేష శక్తులు తలెత్తాయి. కానీ ఆయా సమాజాలలో ప్రజాస్వామిక భావజాలం పాదుకొని ఉండటం వల్ల వాటి ఆటలు సాగడం లేదు. అమెరికాలోనూ ట్రంప్ నాయకత్వంలో ఇదే జరిగింది. లాటిన్ అమెరికాలోనూ కొన్నేండ్లుగా ప్రజలు సామ్యవాద భావజాలం గల పార్టీలకే పట్టం గడుతున్నారు. బ్రెజిల్లోనూ ఇదే జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలు ఇదే విధంగా అప్రమత్తమై ఉన్మాద శక్తులను తిరస్కరించి ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుకోవాలి. ప్రజలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలనేదే బ్రెజిల్ పరిణామాలు అందిస్తున్న హెచ్చరిక.