వినియోగదారుల సమాచారాన్ని ఐదేండ్ల పాటు నిల్వ చేయాలంటూ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) ప్రొవైడర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం గోప్యతా హక్కుకు తీవ్ర భంగకరమైనది. సాధారణంగా తమ సమాచారం బయటపడకూడదని భావించే వారే ప్రైవేట్ నెట్వర్క్ను ఎంచుకుంటారు. ఇక వినియోగదారుల సమాచారానికి భద్రత కరువైతే ఇక ఈ నెట్వర్క్ను ఎంచుకోవడమెందుకు అనే ప్రశ్న తలెత్తుతున్నది. ప్రపంచవ్యాప్తంగా వ్యాపార దిగ్గజాల మధ్య గొంతులు కోసుకునే పోటీ నెలకొని ఉన్న నేపథ్యంలో సమాచార భద్రత కీలకమైనది. ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం అనుసరిస్తున్న ప్రభుత్వాల చిత్తశుద్ధి ప్రశ్నార్థకమవుతున్న వేళ ఇటువంటి నిబంధనలు ఆందోళనను సృష్టించడం సహజం. వ్యాపారసంస్థలకే కాకుండా ప్రజాస్వామిక హక్కులకు కూడా ఈ ఉత్తర్వు ప్రమాదకరమైనది. పాత్రికేయులను వేధించడానికే ఈ ప్రభుత్వం ఇటువంటి ఆదేశాలు జారీ చేస్తున్నదనే అభిప్రాయం కలుగుతున్నది.
సంఘ విద్రోహశక్తులను, సైబర్ నేరస్థులను కట్టడి చేయడానికి ఈ నిబంధన విధించినట్టు కేంద్రం చెప్పుకోవడం కూడా సమర్థనీయంగా లేదు. సాధారణంగా ప్రభుత్వాలు ప్రజల హక్కులకు భంగం కలిగించే చట్టం తెచ్చినప్పుడు, దానికి దేశ భద్రత, నేరస్థుల కట్టడి అనే మేలి ముసుగును తొడుగుతుంటాయనేది తెలిసిందే. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను హటాత్తుగా రద్దు చేసిన ప్పుడు కూడా నేరస్థుల కట్టడి కోసమనే బలహీనమైన వాదన వినిపించిది. ఈ హటాత్ నిర్ణయం వల్ల ప్రజలు నానా కష్టాలు పడ్డారే తప్ప, నేరాల కట్టడి మాత్రం జరగలేదనేది తెలిసిందే. ఇప్పుడు గోప్యతకు భంగకరమైన తాజా నిబంధనను కూడా మోదీ ప్రభు త్వం అనుసరిస్తున్న విధానాల్లో భాగంగానే చూడాలి. దర్యాప్తు ఏజెన్సీల చేత రాజకీయ ప్రత్యర్థులను వేధించడం, రాష్ర్టాల హక్కులను హరించడం, ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగవ్యవస్థలను నిర్వీ ర్యం చేయ యత్నించడం మొదలైన చర్యలు మోదీ ప్రభుత్వ స్వభావాన్ని వెల్లడిస్తున్నాయి. అందువల్లనే తాజా నిబంధన కూడా దుర్వినియోగం అవుతుందనే ఆందోళన వ్యక్తం అవుతున్నది.
ప్రజాస్వామిక వ్యవస్థలో భిన్న పార్టీలుంటాయి. ఇవాళ అధికారంలో ఉన్న రాజకీయపక్షం రేపు ప్రతిపక్ష స్థానంలోకి పోవచ్చు. ఇందిరాగాంధీ వంటి శక్తిమంతమైన నాయకురాలు అధికారాన్ని కోల్పోవలసి వచ్చింది. అందువల్ల కొన్ని క్రీడా నియమాలు పాటించడం ఏ పార్టీకైనా మంచిదే. కేంద్రంలో బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుందని చెప్పలేం. తాము చేసిన చట్టాలు, నెలకొల్పిన సంప్రదాయాలు తమకే ఉచ్చులా బిగియవచ్చు. పెగాసస్ వంటి గూఢచర్య సాఫ్ట్వేర్లను ఉపయోగించడం, ప్రత్యర్థులపై ఇతరత్రా నిఘా వేయడం ప్రజాస్వామిక వ్యవస్థలో వాంఛనీయం కాదు. అందువల్ల మోదీ సర్కారు విజ్ఞతతో వ్యవహరించి ప్రజాస్వామిక విరుద్ధ పోకడలను మానుకోవడం శ్రేయస్కరం.