గురువారం 03 డిసెంబర్ 2020
Editorial - Oct 01, 2020 , 02:29:22

తేలని నేరం

తేలని నేరం

బాబ్రీ మసీదు కూల్చివేత వివాదంలో 28 ఏండ్ల అనంతరం కూడా సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం దోష నిర్ధారణ చేయలేకపోయింది. నిందితులకు వ్యతిరేకంగా నిశ్చితమైన రుజువులు లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. కోర్టు తీర్పు మూలంగా అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి వంటి బీజేపీ ఉన్నతస్థాయి నాయకులకు విముక్తి లభించింది. బీజేపీ అగ్రశ్రేణి నాయకుడిగా ఉన్న అద్వానీ రాజకీయ లక్ష్యంతో రథయాత్ర నిర్వహించిన తదనంతర పరిణామాలు బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీశాయి. అయితే ఆయన రాజకీయ లక్ష్యాలకే పరిమితమయ్యారా అనేదే ప్రశ్న. భారీ ఎత్తున జనం కూడినప్పుడు, కొందరు అప్పటికప్పుడు ఆవేశంతో కూల్చివేసి ఉండవచ్చు లేదా కొందరు పథకం ప్రకారం వచ్చి ఆ కార్యక్రమం చేపట్టి ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని అద్వానీ ఇదివరలో వ్యక్తం చేశారు. వాజపేయితోపాటు అద్వానీ దీనినొక దురదృష్టకర ఘటనగా అభివర్ణించారు. కూల్చివేత పథకం వంటి అంశాలలో సీబీఐ స్పష్టమైన ఆధారాలు సమర్పించలేకపోయిందా అనేది ఆలోచించవలసిన విషయమే. ఈ తీర్పుతో విభేదించేవారు పై న్యాయస్థానానికి వెళ్లే అవకాశం కూడా ఉన్నది.

కూల్చివేతకు సంబంధించిన దోష నిర్ధారణ, శిక్షకు మాత్రమే సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం విచారణ పరిమితమైనది. కానీ బాబ్రీ మసీదు వివాదం ఇంకా విస్తృత స్వభావం కలది. వివిధ పక్షాలను సంప్రదించి సామరస్యంగా పరిష్కరించి ఉండాల్సిన అంశమిది. నిరుడు సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా పరిష్కార దిశలో ఇప్పటికే అడుగులు పడటం గమనార్హం. వివాదాస్పద భూమిని మందిర నిర్మాణం కోసం ఒక ట్రస్టుకు అప్పగించాలని, మసీదు నిర్మాణం కోసం మరోచోట ఐదెకరాల భూమిని ఉత్తరప్రదేశ్‌ సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాలని పరమోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ప్రాతిపదికగా చేసుకొని సామాజిక సామరస్యత కోసం ప్రయత్నం చేయాలి. సమాజంలోని భిన్నవర్గాల మధ్య అగాధం ఏర్పడినప్పుడు పరస్పర అవగాహనకు కృషిచేయడం రాజకీయ నాయకత్వ బాధ్యత. అదీ అంత సులభంగా, హఠాత్తుగా జరిగేది కాదు. 

అయోధ్య వివాదం స్వతంత్ర భారతం ఎదుర్కొన్న అత్యంత విషమ పరీక్ష. ఈ వివాదం ఎంతోకాలం కొనసాగడం ఏ వర్గానికీ శ్రేయస్కరం కాదు. యురోపియన్‌ సమాజాలు కూడా ఇటువంటి ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నాయి, అధిగమించాయి. అమెరికా వంటి ఆధునిక దేశం అంతర్యుద్ధాన్ని చవి చూసింది. వర్ణ విభేదాలు ఇంకా రగులుతూనే ఉన్నాయి. ఏ జాతికైనా సంక్షోభాలు రావడం సాధారణమే. కానీ వాటిని రాజనీతిజ్ఞతతో అధిగమించగలగాలి. అయోధ్య వివాదం సృష్టించిన గాయాలు మాసిపోవడం, ఉద్వేగాలు చల్లారడం అంత సులభం కాదు. కానీ ఇటువంటి సంక్షోభాలను అధిగమించే నిబ్బరత్వం, పరిణతి భారతీయ సమాజానికి ఉన్నది. అయోధ్య భూ వివాదంపై సుప్రీం తీర్పును మెజారిటీ పక్షాలు ఆమోదించి, స్వాగతించడం ఇందుకు నిదర్శనం