శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Jul 14, 2020 , 23:50:54

బలహీన నాయకత్వం

బలహీన నాయకత్వం

రాజస్థాన్‌ సంక్షోభం కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వ బలహీనతను మరోసారి బట్టబయలు చేసింది. అసమ్మతి నేత సచిన్‌ పైలట్‌ చెప్పుకున్నంత మంది ఎమ్మెల్యేలు ఆయన వెంట లేకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి గెహ్లాట్‌ పీఠాన్ని కంపింపజేయడంలో సఫలమయ్యారు. 200 మంది సభ్యులున్న రాజస్థాన్‌ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌ పార్టీకి వంద మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉన్నది. కనీసం మరో సభ్యుడి మద్దతు లేకపోతే నిలబడటం సాధ్యం కాదు. ప్రియాంకగాంధీని రంగంలోకి దింపినా సచిన్‌ పైలట్‌ దిగిరాలేదు. రాజస్థాన్‌ సమస్యకు కారణం ఈ రెండు పక్షాల మధ్య కలహంగా కనిపిస్తున్నప్పటికీ, ఇందుకు మూలం ఢిల్లీలోనే ఉన్నదనవచ్చు. కపిల్‌ సిబల్‌, శశిథరూర్‌, సంజయ్‌ ఝా తదితర పార్టీ సీనియర్ల్ల అభిప్రాయాలను గమనిస్తే పార్టీ కేంద్ర నాయకత్వ బలహీనతే రాజస్థాన్‌తో సహా వివిధ రాష్ర్టాల్లో ముఠా కలహాలు హద్దులు మీరడానికి కారణమని స్పష్టమవుతుంది. 

మధ్యప్రదేశ్‌లో అసమ్మతి నేత జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయిన నాలుగు నెలలకే రాజస్థాన్‌లో ముసలం పుట్టింది. మిగతా రాష్ర్టాల్లో పరిస్థితి కూడా ఏమంత చక్కగా లేదు. పంజాబ్‌లో ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రతాప్‌సింగ్‌ సింగ్‌ బజ్వా, నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధు ఏకతాటిపైకి వచ్చారు. హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పలు రాష్ర్టాలలో ముఠా కలహాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. కాంగ్రెస్‌లో ముఠా కలహాల సంస్కృతి కొత్తదేమీ కాదు. కానీ అధిష్ఠానవర్గాన్ని లెక్కచేయకుండా ఎవరికి వారే వ్యవహరించడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. ఇటీవలి కాలంలో పార్టీని వీడిన ప్రముఖులు పలువురు రాహుల్‌గాంధీకి సన్నిహితులు. ఆయనతో అత్యంత సాన్నిహిత్యం కలిగిన సింధియా, పైలట్‌ వంటి బలమైన నాయకులు పార్టీని వీడిపోవడానికి కారణమేమిటనేది ఆలోచించవలసిన విషయం. 

సచిన్‌ పైలట్‌ తిరుగుబాటు తరువాత గెహ్లాట్‌ ప్రభుత్వం నిలబడగలిగిందా లేదా అనేదే ప్రధానం కాదు. పార్టీ బలాన్ని అంకెలతో కొలువలేము. రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ చేతిలో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పొంది కార్యకర్తలు నైతిక ైస్థెర్యం కోల్పోయినప్పుడు, పైలట్‌ పార్టీ పగ్గాలు చేపట్టి క్షేత్రస్థాయిలో కృషిచేశాడు. కాంగ్రెస్‌ గెలుపులో ఆయనది ప్రధాన పాత్ర. దీర్ఘకాలిక దృష్టితో, పార్టీ భవిష్యత్తుకు భరోసా ఇచ్చే, సామాజిక పునాదిగల యువ నాయకులను కాంగ్రెస్‌ నాయకత్వం కాపాడుకోవాలి. కానీ రాహుల్‌ గాంధీ క్రియాశూన్యత వల్ల కేంద్ర నాయకత్వమంటూ ఉన్నదా అనే అనుమానం కలుగుతున్నది. వివిధ రాష్ర్టాలలో పార్టీ వర్గాలు చెల్లాచెదురైపోవడంతో పార్టీ ఉనికికే ప్రమాదం వాటిల్లుతున్నది. కాంగ్రెస్‌ పార్టీ బలహీనపడితే జాతీయ స్థాయిలో ఆ స్థానాన్ని ప్రాంతీయ శక్తులు కూటమిగా ఏర్పడి భర్తీ చేస్తాయా అనే ఉత్కంఠకు ఈ పరిణామాలు తావిస్తున్నాయి.


logo