ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Editorial - Jun 09, 2020 , 00:28:11

తెల్ల దేశంలో నల్లటి పొద్దు

తెల్ల దేశంలో నల్లటి పొద్దు

‘ఐకాంట్‌ బ్రీత్‌'.. ఇప్పుడు అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న నినాదం.  అమెరికా నల్లజాతీయభావ పునాదుల మీద ఏర్పడినా, నేడు తీవ్రమైన జాత్యంహకార భావనలతో రగిలిపోతున్నది. నాకు ఊపిరాడటం లేదంటూ.. మరణయాతన పడి చివరికి ఊపిరి వదిలేశాడు ఆఫ్రో అమెరికన్‌ జార్జి ఫ్లాయిడ్‌. ఒక జాతిపై మరొక జాతిలో ఇంతటి స్థాయిలో అసహనం, విద్వేషం ఉండ టం అనాగరికమైన చర్యగానే చెప్పవచ్చు. 

జాతుల మధ్య విద్వేషాలు ఈనాటివి కావనే వాస్తవం జగమెరిగినదే అయినా ఈ కాలంలో కూడా ఇలాంటి క్రూరమైన హింసలు అనాగరిక చేష్టలకిందికే వస్తాయి. మనమంతా ప్రాంతీయ తత్వాలు, కులాలు, మతాలు, వర్ణ వివక్షతలు, లింగ భేదాలు, ధనిక బీద లాంటి అసమానతల ప్రపంచంలో బతుకుతున్నాం. 

 అమెరికా ప్రపంచంలో ఆర్థికాభివృద్ధిలో ముందువరసలో ఉండే దేశం. కానీ అభివృద్ధి అంటే ఎత్తైన మేడలు, రోడ్లు కాదు. మానవతతో కూడిన విలువలు, విజ్ఞతతో నడుచుకునే ప్రజలున్న దేశమే మానవాభివృద్దిని సాధించిన దేశంగా ప్రకటించుకోవాలి. ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక చాలా పెద్ద  నిరసనలు, వ్యతిరేక ఉద్యమాలు జరిగాయి కానీ వైట్‌హౌస్‌ను చుట్టుముట్టేంతటి నిరసన పెల్లుబుకడం ఇదే మొదటిసారి. 1968లో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ (జూనియర్‌) మరణించినప్పుడు భారీ ఎత్తున పౌర నిరసనలు వ్యక్తమయ్యాయి ఆ తర్వాత అంతటి నిరసనో ద్యమం జరగడం ఇదే ప్రథమం. ఈ ఉద్యమం తెల్లదేశంలో నల్లటి పొద్దు.

కేవలం ఇరవై డాలర్ల నోటు నకిలీదేమోననే అనుమానమే ఇంతటి దారుణానికి కారణమైనది. సమస్య చిన్నదైనా వివక్ష వికృత ఫలితాలు ఇలాంటి సంఘటనల ద్వారా బయటపడుతుంటాయి. జార్జి ఫ్లాయిడ్‌కు మాత్రమే కాదు అక్కడ నాలుగున్నర కోట్ల మంది నల్లజాతీయులకూ ఊపిరాడటం లేదు. అమెరికాలోని నల్లజాతీయుల్లో 14 శాతం కడు పేదరికంలో బతుకుతున్నారు. ఈ పేదరికమే నల్ల,తెల్ల జాతీయుల మధ్య సామాజికదూరాన్ని పెంచుతున్నది. కరోనా వైరస్‌కు ఎక్కువగా బలైంది కూడా నల్లజాతీయులే.  

నల్ల, తెల్ల జాతీయులు అనే వివక్ష అమెరికాకే పరిమితం కాలేదు. ఇది ప్రపంచమంతటా బలమైన వేర్లతో వివిధ రూపాల్లో వివిధ దశలలో అల్లుకున్నది. నల్లనివాడు చెడ్డవాడు, ఉగ్రవాద ఆలోచనలు కలిగిన హింసావాది అని భావించడం అమానుషం. తెల్ల జాతీయుల్లోనే కాదు అందరిలో ఈ భావన తొలగిపోవాలి. ప్రపంచశాంతికే భంగకరమయ్యే పరిణామాలు తలెత్తుతాయి. ముందుగా తెల్ల జాతీయుల్లో ఈ ఆలోచనలను చెదరగొట్టాలి. అప్పుడే అన్ని వర్ణాల వారు ఏకతాభావంతో జీవించగలుగుతారు.


logo