సోమవారం 21 సెప్టెంబర్ 2020
Editorial - Apr 05, 2020 , 23:19:31

మనిషికీ చెవుల్లేవు

మనిషికీ చెవుల్లేవు

బుర్రలేని వైరస్‌ను నిందించలేను.మన్నించాలి. గమ్యం లేని సూక్ష్మక్రిమిని తూలనాడలేను. ఎవరినీ సమర్థించలే ను. ఏ నీతినీ తప్పు పట్టలేను. దీనికి కారణం ఏ ఒక్కరినీ చూపలేను. ఏ దేశాన్నీ, దేశాధినేతలను బోనులో నిలబెట్టలేను.. ఏమంటాను మరి...

సర్‌ పీటర్‌ మెడావర్‌ అనే శాస్త్రవేత్తను స్మరిస్తాను. వైరస్‌ను నిర్వచిస్తూ ఆయన ఏమన్నాడంటే... ‘పీస్‌ ఆఫ్‌ బ్యాడ్‌ న్యూస్‌ రాప్‌డ్‌ అప్‌ ఇన్‌ ఎ ప్రొటీన్‌'. ప్రొటీన్‌ కాగితంలో చుట్టచుట్టిన దుర్వార్తగా అనువదించనూ లేను.. 

ఓ మహాశాస్త్రవేత్తా.. జాషువా లెడర్‌బర్గ్‌ ఏమన్నావేమన్నావు.. ‘ది సింగిల్‌ బిగ్గెస్ట్‌ థ్రెట్‌ టు మీన్స్‌ కంటిన్యూడ్‌ డామినన్స్‌ ఆన్‌ ది ప్లానెట్‌ ఈజ్‌ వైరస్‌' అని కదా వచించా వు, ప్రవచించావు.ఎవడు విన్నాడెవడు విన్నాడు నీ మాట. ఎవడు కన్నాడెవడు కన్నాడు శాస్త్ర సత్యాన్ని.. 

ఆ ఒక్క పదం ఉంది చూశావూ.. కొనసాగుతున్న మాన వ ఆధిపత్యానికి భూ మండలం మీద పొంచి ఉన్న పెను ప్రమాదం.. వైరస్‌ వల్లనే అని. అది సత్యం, అదే సత్యం. 

మనిషి, వైరస్‌ సృష్టిలో కవల పిల్లలు. లాసా, ఎబోలా, హంటా, హెచ్‌ఐవీ, హెచ్‌ఐఎన్‌ఐ.. ఒకటా రెండా.. అన్నిటితోనూ యుద్ధమే..! 

1976 గుర్తుందా.. ఉత్తర జైరేలో అటవీప్రాంత గ్రామం.. యంబకు. ఓ ఉపాధ్యాయుడు తలనొప్పి జ్వరం తో స్థానిక మిషన్‌ స్టేషన్‌కు వచ్చాడు. బెల్జియన్‌ నర్సమ్మలు యాంటి మలేరియా ఇంజెక్షన్‌ ఇచ్చారు. అతనిది మలేరి యా కాదు, ఎబోలా.  వైద్యం చేసిన నర్సు, అతని కుటుంబమూ ఎబోలాకు బలైపోయింది. 318 మందికి సంక్రమించి 280 మందిని ఆ చిన్న సూక్ష్మజీవి తన వెంట తీసుకు పోయింది. 

నైజీరియాలో లాసా జ్వరాలు, అమెరికాలో హంటా వైరస్‌లు విధ్వంసం మానవాళికి కొత్తేమీ కాదు. అంతెందు కు హెచ్‌ఐవి మాత్రం తక్కువ తిన్నదా. మానవాళి లైంగిక నీతులను బట్టబయలు చేసింది. బ్యాక్టీరియాలు వేరు, వైరస్‌లు వేరు. పురుషులు స్త్రీలు వేర్వేరే కదా. ప్రకృతి రెండో ప్రకృతి వేరు కదా. విజ్ఞానమూ, నాగరికత వేరు వేరు కదా. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయలేని నిస్సహాయ మానవులం కరోనాతో ఏం పోరాడుతాం. 

నా కులము, నా పక్కింటి వారి కులమూ వేర్వేరే కదా. ఒకే అపార్ట్‌మెంట్‌లో మీ వాళ్ళూ మా వాళ్ళూ వేరే కదా. నీ కారు, నా కారు ఒకే కంపెనీవి కాదు కదా. 

ఏవో బ్యాక్టీరియాలంటావా, ప్రొటోజువాలంటావా, ఫంగి వేరు, అన్నీ చంపవు అంటావా.. కొన్నే చంపుతాయి. కానీ.. వైరస్‌లు అలా కాదు. మనుషుల నుంచి చాలా డిమాండ్‌ చేస్తాయి. అవి కూడా బతకాలి. కొన్నిటికి పునరుత్పాదించాలి. అది సజీవ కణాల్లోకి వెళ్ళాలి. లోపలికి వెళ్ళాక అవి తీసుకోవటమే తప్ప ఇచ్చేదేమీ ఉండదు. 

నేను తీసుకోవడంలా ప్రకృతి నుంచి.. తిరిగి నేనేమైనా ఇచ్చానా.. నా కారు తాళాలిచ్చానా? నా ఏటీఎం కార్డు ఇచ్చానా.. లేదే..! కనుక మనలాగే వైరస్‌లు పరాన్నజీవులే. కనీసం అవి కణాలు కూడా కావు. అవి ఒఠ్ఠి పార్టికల్స్‌. వాటికి ఎనర్జీ సోర్సేమీ ఉండదు. అవి ప్రొటీన్లను ఉత్పత్తి చేసుకునే సెల్యూలార్‌ యంత్రాంగమూ ఉండదు. ప్రతి పార్టికల్స్‌ చుట్టూ జన్యు పదార్థం ఉంటుంది. ప్రొటీన్‌ షీట్‌ ని కాపాడేదే కాప్సిడ్‌. మన చట్టూ లేరేంటి ఆధిక్యవాదులు.  వైరస్‌ అంటే 400 జన్యువులంత. అదే మనిషికి ముప్ఫై వేల జన్యువులు నో ప్రయోజనం. జన్యు సంకేతమే గొప్ప ది. ఈ చిన్న జన్యు పదార్థ శకలాలు వాటిని పునరుత్పాదించుకోవడానికి సంకేతాలను మోసుకు తిరుగుతాయి. లివింగ్‌ సెల్‌ లోకి రావటమే ఆలస్యం.. అంతా వాటి నియంత్రణే. అవేమీ చేయవు.. దేహాన్ని వైరస్‌ ఫ్యాక్టరీగా మార్చుకంటాయి. వ్యాధినిద్దాం, జబ్బు చేద్దాం అనే దృష్టి తో రావు వైరస్‌లు. మానవ బలహీనతలే వాటి బలం. పది రోజులు ఇంటి పట్టున ఉండలేనోడివి.. పది సార్లు చేతులు శుభ్రంగా కడుక్కోలేనోడివి.. సంక్షోభంలో ప్రభుత్వం చెప్పి న నాలుగు నియమాలు అమలు చేయలేనోడివి... 

నువ్వు అనబడే మనిషివి. నేను అనబడే నరుడిని, అభం శుభం ఎరుగని వైరస్‌లతో ఎలా నెగ్గగలవ్‌? కవులం అట మేము. కవనమట మాది. ఏ ఒక్కడిని మార్చలేకపోయిన వాళ్ళం. నాలుగు ధైర్యవచనాలు మాత్రమే చెప్పగలం. చెవులు వైరస్‌కు లేనట్టే మనిషికీ లేవు. 

 - సీతారాం


logo