శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Mar 03, 2020 , 23:10:03

మహిళాభివృద్ధిలోనూ ఆదర్శం

మహిళాభివృద్ధిలోనూ ఆదర్శం

మహిళ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ. ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం ద్వారా మన కేసీఆర్‌ గారు తెలంగాణ ఆడబిడ్డలకు సుమున్నత గౌరవం ఇచ్చారు. ఆడపిల్ల పుడితేనే భారంగా భావించే సమాజం లో కేసీఆర్‌ కిట్‌తో పాటుగా రూ. 13,000ల నగదు ప్రోత్సాహకంగా ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం వల్ల సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగడమే కాకుండా, మాతా శిశు మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందంటూ నీతిఆయోగ్‌ పేర్కొనడం తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది.

ఎక్కడ మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని నానుడి. మన సమాజంలో దాదాపు 6000 సంవత్సరాల పూర్వం నుంచి అనగా సింధూ నాగరికత కాలం నుంచి భారతీయులు స్త్రీలను గౌరవిస్తూ, స్త్రీలను దేవతలుగా పూజిస్తారు. మన దేశాన్ని కూడా భారతమాతగా గౌరవిస్తూ, పూజిస్తూ ఉండటం మన దేశంలో స్త్రీల పట్ల గౌరవాన్ని సూచిస్తుంది. 


దుర్భర పని పరిస్థితులకు వ్యతిరేకంగా తమ హక్కుల సాధన కోసం మహిళా కార్మికులు చేసిన పోరాటాలు అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి నాంది పలికాయి. మహిళల డిమాండ్లను ముందుకు తెస్తూ ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని జరపాలనే నిర్ణయాన్ని 1910 ఆగస్టు 26న కోపెన్‌హేగెన్‌లో జరిగిన రెండవ అంతర్జాతీయ సోషలిస్ట్‌ మహిళా సదస్సులో తీసుకున్నారు. మొట్టమొదటి ఈ ప్రతిపాదనను సోషలిస్టు నాయకురాలు క్లారాజట్కిన్‌ ప్రవేశపెట్టింది. ఆ తర్వాత మహిళల సమస్యలపై దృష్టి పెట్టేందుకు అన్నిదేశాల్లోనూ ఒక దినోత్సవం జరపాలని 1977లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 150 దేశాలు ఆ తీర్మానానికి మద్దతునిచ్చాయి. తమ దేశాలలో మహిళల పట్ల వివక్షను తొలిగిస్తామని, మహిళా దినోత్సవం తమ ఎజెండాలో ప్రాధాన్యాంశంగా ఉంటుందని ప్రకటించాయి. అప్పటి నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము.


మహిళల సర్వతోముఖాభివృద్ధితో దేశాభివృద్ధి ముడిపడి ఉన్నది. మన దేశం లింగ వివక్షలో 114వ స్థానంలో, ఆర్థిక స్వావలంబనలో 134 స్థానంలో, వైద్యంలో 141వ స్థానంలో ఉన్నది. ప్రపంచదేశాలలో స్త్రీ, పురుష వ్యత్యాసం గతంలో (108) కంటే నాలుగు స్థానాలు దిగజారి 112వ స్థానానికి చేరింది. మహిళలపై దాడులు, దౌర్జన్యాలు రోజురోజు కు పెరిగిపోతున్నాయి. హింస అనేది ఏ రూపంలో ఉన్నా అది మానవ హక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. మహిళలపై హింస అంటే అది భౌతిక, మానసిక, లైంగిక వేధింపులు, స్త్రీ వ్యక్తిగత జీవితానికి భంగం కల్గించే ప్రవర్తన. వాటిలో లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, పెంపకంలో వ్యత్యాసం చూపించడం, అవకాశాలలో అసమానతలు, బాల్య వివాహాలు, అక్రమ తరలింపులు వంటివి వస్తాయి.


విద్యతో వచ్చిన ఆత్మవిశ్వాసం, అవగాహన శక్తితో కొద్దిమంది యువతులు నింగి, నేల, నీరు అన్నిరంగాల్లో అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయారు. మహిళా సమానత్వం సాధించడం అంటే పౌర సమాజంలో ఉన్న వివిధ వ్యవస్థలలో ఆధిపత్య భావజాలాన్ని రూపుమాపాలి. అందుకోసం చట్టాలను మార్చాలి. చట్టాలను అర్థవంతంగా అమలుచేయాలి.  దానికి అన్నివర్గాల నుంచి సహకారం కావాలి.


మన సమాజంలో స్త్రీ శ్రామికురాలిగా, పౌరురాలిగా వివక్షకు గురవుతున్న ది. ఇంటాబయటా మహిళలకు రక్షణ కరువైంది. ప్రపంచవ్యాప్తంగా మానవ అక్రమ రవాణాలో 71శాతం బాలికలు, మహిళలే బలవుతున్నారు. ప్రపంచంలో ప్రతి ముగ్గురు మహిళలో ఒకరు తమ జీవిత కాలంలో శారీరక లేదా లైంగికహింసకు గురవుతున్నారని ఒక అధ్య యనంలో వెల్లడైంది.


దేశంలో జనాభా గణాంకాలను పరిశీలిస్తే పురుషుల సంఖ్య కంటే స్త్రీల సంఖ్య తక్కువగా ఉండటమే కాకుండా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. 2015 ప్రపంచబ్యాంకు సర్వే ప్రకారం స్త్రీ, పురుష నిష్పత్తి ప్రతి 1000 మంది బాలురకు 903 మంది బాలికలు మాత్రమే. స్త్రీ, పురుష నిష్పత్తి ఆర్థికాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి సూచిక. స్త్రీ, పురుష నిష్పత్తిలో అసమానత ఇట్లాగే కొనసాగితే సమాజంలో సమతుల్యత దెబ్బతినే ప్రమాదం ఉన్నది. 


కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘బేటీ బచావో, బేటీ పఢావో’ పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా ఉన్నది. బాలికల పుట్టుక విషయంపై విధంగా ఉంటే చదువు విషయం మరింత దుర్భరంగా ఉన్నది. ప్రాథమిక పాఠశాలలో బాలికల నమోదు 100కు కేవలం 88.7 శాతం మాత్రమే ఉన్నది. సెకండరీస్థాయికి వచ్చే సరికి 52 శాతం ఉండగా ఉన్నత విద్య కొచ్చేసరికి కేవలం 33 శాతం మాత్రమే ఉన్నత విద్యను పూర్తి చేయగలుగుతున్నారు. అంటే నూటికి 67 మంది ఆడపిల్లలు చదువులకు దూరం చేయబడుతున్నారు.


ప్రపంచవ్యాప్తంగా గడిచిన పదేళ్ళలో మహిళా కార్మికశక్తి 150 కోట్ల నుంచి 175 కోట్లకు పెరిగింది. స్త్రీలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 79 శాతం ఆహారఉత్పత్తి చేస్తున్నారు. మన దేశంలో స్త్రీలు సగటున ప్రతిరోజు 4 నుంచి 5 గంటలు లేదా తమ జీవిత కాలం మొత్తంలో 16 శాతం వంటింటిలోనే గడుపుతున్న పరిస్థితి ఉన్నది. అయినా ఇంటి పనికి లెక్కే లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం శ్రామికులలో 40శాతం మంది మహిళలే ఉన్నారు. ప్రత్యేకించి వ్యవసాయరంగంలో పనిచేస్తున్న శ్రామికులలో 43 శాతం మహిళలే. కాని ప్రస్తుతం మహిళలు సంపాదిస్తున్న జీతం పదేళ్ళ కిందట పురుషుడు సంపాదించిన దానితో సమానం.


ప్రపంచవ్యాప్తంగా మహిళలకు అన్నిరంగాలలో సమానత్వం రావాలంటే 83 యేండ్లు పడుతుందని 2016లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం అంచనా వేసింది. కానీ ఇప్పుడా వ్యత్యాసం మరింత పెరిగి ఇంచుమించు వంద సంవత్సరాలు పడుతుందని చెబుతున్నది. అందుకే ‘మహిళల హక్కులు మానవ హక్కులే’ అనే నినాదం ముందుకు వచ్చింది.

మహిళ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ. ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించడం ద్వారా మన కేసీఆర్‌ గారు తెలంగాణ ఆడబిడ్డలకు సుమున్నత గౌరవం ఇచ్చారు. ఆడపిల్ల పుడితేనే భారంగా భావించే సమాజం లో కేసీఆర్‌ కిట్‌తో పాటుగా రూ. 13,000ల నగదు ప్రోత్సాహకంగా ఇస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకం వల్ల సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగడమే కాకుండా, మాతా శిశు మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందంటూ నీతిఆయోగ్‌ పేర్కొనడం తెలంగాణ ప్రభుత్వ పని తీరుకు అద్దం పడుతున్నది. గతంలో సర్కారు దవాఖానాలలో ప్రసవాల శాతం కేవలం 20 శాతంగా ఉండగా ఇప్పుడు అది 62  శాతానికి పెరిగింది.


ముఖ్యమంత్రి గారు సంపూర్ణ అక్షరాస్యతే లక్ష్యంగా ఈ సంవత్సరం ‘ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌' పథకాన్ని ప్రవేశపెట్టారు. బాలికల విద్యను ప్రోత్సహించేందుకు  భద్రత, సౌకర్యాలు కల్పించారు. సగం రెసిడెన్షియల్‌ పాఠశాలలను బాలికల కోసం స్థాపించారు. అలాగే మహిళల, ఆడపిల్లల రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా షీ టీంలను ఏర్పాటు చేసింది. మహిళా కార్మికుల శ్రమను గుర్తించి వారి ఆదాయాలను పెంచడం (అంగన్‌వాడీ, ఆశా) వంటివి మహిళల పట్ల, వారి విధుల పట్ల మన ముఖ్యమంత్రి గారి ప్రత్యేక శ్రద్ధను కనబరుస్తున్నాయి.


ఆడపిల్లకు పెళ్ళి చేయడం కోసం ఒక కన్న తండ్రి ఎన్ని కష్టాలు పడుతున్నాడో ములుగు మండలంలో ఉన్న భాగ్య తండాలో ప్రత్యక్షంగా చూసి చలించారు ముఖ్యమంత్రి గారు. రాష్ట్రం ఏర్పడ్డాక కళ్యాణ లక్ష్మి, షాదీ ముబాకర్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆడపిల్లల కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో వితంతు, ఒంటరి మహిళలు పురుషుల నుంచి సమాజం నుంచి సొంత కుటుంబం నుంచి నిరాదరణకు, అణచివేతకు గురవుతున్నారు. ఈ దుస్థితిని గమనించి ఏ రాష్ట్రంలో లేనివిధంగా వితంతు, ఒంటరి మహిళలకు, బీడి కార్మికులకు, వృద్ధులకు పింఛన్లు ఇస్తూ వారికి అండగా ఉంటున్నారు. మహిళ సంక్షేమానికి  ఏటా బడ్జెట్‌ లో పదివేల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.విద్యతో వచ్చిన ఆత్మవిశ్వాసం, అవగాహన శక్తితో కొద్దిమంది యువతు లు నింగి, నేల, నీరు అన్నిరంగాల్లో అప్రతిహతంగా ముందుకు దూసుకుపోయారు. 


మహిళా సమానత్వం సాధించడం అంటే పౌర సమాజం లో ఉన్న వివిధ వ్యవస్థలలో ఆధిపత్య భావజాలాన్ని రూపుమాపాలి. అందుకోసం చట్టాలను మార్చాలి. చట్టాలను అర్థవంతంగా అమలు చేయాలి. దానికి అన్నివర్గాల నుంచి సహకారం కావాలి. ప్రబలంగా నాటుకుపోయిన సాంస్కృతిక ప్రమాణాలు, వైఖరిలో కూడా మార్పు తేగలగాలి. దీనికి ముందుండి నడపడానికి దృఢమైన రాజకీయ సంక ల్పం, నాయకత్వం కావాలి. అటువంటి ఉద్యమసారథి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారి నాయకత్వాన మహిళా సంక్షేమం దిశగా రాష్ట్రం పయనిస్తున్నది. 

(వ్యాసకర్త: జడ్పీటీసీ, ములుగు)


logo