గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Feb 10, 2020 , 23:01:29

తెలంగాణ యువతలో ‘జిజ్ఞాస’

తెలంగాణ యువతలో ‘జిజ్ఞాస’

తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని భవిష్యత్తులో భర్తీ చేయడానికి ఒక కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి మహా రచయితల వారసత్వాన్ని కొనసాగించేందుకు సంసిద్ధులవుతున్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ మానవవనరులను అందించేందుకు కీలకమైన తెలంగాణ కళాశాల విద్య పటిష్ఠమైన త్రిముఖవ్యూహంతో పనిచేస్తున్నది. భావి పరిశోధకులను, కవులను, కథకులను, క్రీడాకారులను సాంకేతిక నిపుణులను అందించబోతున్నది. ఉన్నతవిద్యలో ఇదొక మంచి పరిణామం.

ఇప్పుడు నడుస్తున్న వర్తమానం అనేకాంశాలలో విభిన్నమైనది. దశాబ్దాలుగా మరుగునపడిన అస్తిత్వ అంశాలు, సృజనాత్మక ప్రతిభలు, ప్రాంతీయ ప్రత్యేకతలు గడిచిన ఐదు సంవత్సరాలుగా స్పష్టమైన రూపాన్ని తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యం లో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, యువతకు డిగ్రీస్థాయి విద్యార్థులకు అతి ముఖ్యమైనది. ఒక ప్రాంత అభివృద్ధిలో, సామాజిక, ఆర్థిక, విద్యా, సాంస్కృతిక, రాజకీయ అంశాలలో వస్తున్న మార్పులే కీలకపాత్ర పోషిస్తాయి. మౌలికంగా విశిష్టత కలిగిన సమాజం తన ఉనికిని నిరూపించుకోవడానికి విద్య ద్వారానే సాధన చేస్తుంది. దార్శనికత కలిగిన దీపదారు లు పటిష్టమైన ప్రణాళికలు వేస్తారు. వాటిని అమలుపరిచి, ప్రతిఫలాలను అందించేందుకు నిరంతరం ఆలోచనలు చేస్తారు. అందుకు ముందడుగు వేస్తారు. వినూత్నంగా తమ ఆలోచనలను అమలుపరుస్తారు. ఒక తరానికి ప్రత్యేక కాలాన్ని బహూకరిస్తారు.

 ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యలో కీలకమైన డిగ్రీ విద్యావ్యవస్థలో శరవేగంగా పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. విద్య అంటే కేవలం మార్కుల కోసమో, భట్టీ పట్టడమో, స్టడీ మెటీరియల్‌ చదవడం కాదని తెలిసివస్తున్నది. యాంత్రికమైన అభ్యసన సంస్కృతిని ఇక ఎంత మాత్రం ఉపేక్షించకూడదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఉన్న త విద్యాశాఖాధికారులు గుర్తించారు. తెలంగాణ కళాశాల విద్యా కమిషనరేట్‌ పరిధిలోఉన్న 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో విద్యార్థి కేంద్రంగా విద్యాత్మక అంశాలు కొనసాగుతున్నాయి.


సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి ప్రాధాన్యాన్ని విస్తరిస్తున్నారు. కేవలం నిర్దే శిత పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా డిగ్రీ విద్యార్థుల్లో నిగూఢంగా దాగి ఉన్న ఆలోచనలను ఆవిష్కరించేందుకు గత ఐదేండ్ల నుంచి జమిలి గా విభిన్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది కళాశాల విద్య. దీనిలో మొదటిది ‘జిజ్ఞాస’ విద్యార్థి అధ్యయన నివేదకల సమర్పణ. రెండవది యువతరంగం  వివిధ సాహిత్య సాంస్కృతిక క్రీడాంశాలలో పోటీలు నిర్వహించడంగా చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంత విద్యార్థినీ, విద్యార్థులకు ఆధునిక ప్రపంచంలోకి ఆహ్వానించడం దీని ఉద్దేశం. చదు వంటే సెమిస్టర్‌ పరీక్షల్లో అడిగే ప్రశ్నావళిని అనుసరించి జవాబులు రాయ డం మాత్రమే కాదని కళాశాల విద్యా కమిషనరేట్‌ గుర్తించింది. దానికి అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను వెలికి తీసేందుకు అనేక సృజనాత్మక కార్యక్రమాలతో కార్యాచరణకు పూనుకున్నది.


భవిష్యత్తులో జ్ఞాన తెలంగాణబాటలో సాహిత్య సాంస్కృతిక క్రీడా  తెలంగాణ కోసం విస్పష్టమైన ‘విజన్‌'ను రూపొందించుకున్నది. తద్వారా మహత్తర ఆశయాలతో 2015 నుంచి ‘విజన్‌ డాక్యుమెంట్‌'ను తయారు చేసుకున్నది. దాని అమలుకోసం తగిన చర్యలను చేపట్టింది. ఇప్పుడు ఏటా జనవరి, ఫిబ్రవరి మాసాల్లో రాష్ట్రవాప్తంగా ఉన్న మారుమూల  కళాశాలల స్థాయి నుంచి క్లస్టర్‌, రాష్ట్రస్థాయి పోటీలను  ‘జిజ్ఞాస’  విద్యార్థి పరిశోధనా అధ్యయన నివేదికల రూపంలో ఉన్న అంశాలను సమర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఇందులో ఐదుగురు విద్యార్థినీ, విద్యార్థు  లు తాము ఎంచుకున్న అంశాన్ని నివేదిస్తారు. మరోవైపు యువతరంగం ద్వారా 28 అంశాలలో సాహిత్య సాంస్కృతిక, కళా, క్రీడాంశాలలో విద్యార్థులను భిన్న వేదికల ద్వారా ప్రోత్సహిస్తున్నది. ఫలితంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో  చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న సమయంలోనే భవిష్యత్తులో తమకిష్టమైన సబ్జెక్టులలో పరిశోధనను కొనసాగించేందుకు తొలిమెట్టుగా ‘జిజ్ఞాస’ ద్వారా ముందుకొస్తున్నారు. పీజీ అనంతరం తెలుసుకునే పరిశోధనా మౌలిక పద్ధతులను డిగ్రీలోనే తెలుసుకుంటున్నారు. అనూహ్యమైన నూత న అంశాల మీద నివేదికలను సమర్పిస్తున్నారు. పలు అంశాలను నిర్భయంగా, భాషావాక్పటిమతో యూనివర్సిటీ ప్రొఫెసర్ల ముందు  వెల్లడించడం ఒక ప్రత్యేక అంశం. కళాశాల విద్యా కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌, అకడమిక్‌ గైడెన్స్‌ సెల్‌ అధికారులు కళాశాల ప్రిన్సిపల్స్‌, అధ్యాపకులు, తల్లిదండ్రులు తగిన ప్రేరణను కల్పిస్తున్నారు. 2019-20 వార్షిక విద్యా సంవత్సరంలో వివిధ సబ్జెక్టులలో 150 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. వీటిని ఫిబ్రవరి మొదటివారంలో జరుగుతున్న ‘జిజ్ఞాస’ లో ప్రదర్శిస్తున్నారు.


ఈ నేపథ్యంలో రాష్ట్రంలో గుణాత్మక మార్పు డిగ్రీ కళాశాల విద్యలో కనిపిస్తుండటం శుభపరిణామం. ఈ రెండు కార్యక్రమాల ద్వారా విద్యార్థుల ఆలోచనాసరళిలో తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. కొత్త ఊహ, ఆలోచనలు మొగ్గతొడిగి కొత్త ఆవిష్కరణలవైపు వారు కదిలేటట్లు చేస్తున్నది. విద్య అంటే మొదడుకు ఇచ్చే శిక్షణ మాత్రమే కాదని విద్యార్థులు తెలుసుకుంటున్నారు. తరగతి గదులకే పరిమితమైపోయిన సంప్రదాయ బోధనా వ్యూహాలను అభ్యసన పద్ధతులను వదిలిపెట్టి పర్యవేక్షిత, మార్గదర్శక అభ్యసనామార్గంలోకి విద్యార్థి లోకం కదులుతున్నది. వారిలో నూతన శక్తియుక్తులు బలోపేతమౌతున్నాయి. ప్రాజెక్టు ఆధారిత అధ్యయనం అనేది విద్యార్థులు తామున్న సమాజ సంస్కృతులను అవగతం చేసుకోవడమే  కాకుండా సమాజంలోని భిన్న పార్శాలలో, విభిన్న అనుశాసనాల్లో సమస్యల మూలాలను తెలుసుకోవడమే కాకుండా సృజనాత్మక పరిష్కార మార్గాలనూ అన్వేషించగలుగుతున్నారు. కొన్ని ప్రాజెక్టు అధ్యయనాలలో వారు ఎంచుకొనే అంశాలు అధ్యయనం వలన పెరిగిన అవగాహన, ఆలోచనలు వారిని భవిష్యత్తులో విశిష్ట వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయనడంలో సందేహం లేదు. ఆవిష్కరణ అనేది సృజనాత్మకతకు ప్రారంభమని గుర్తించగలుగుతున్నారు. విద్యావ్యవస్థ పటిష్టంగా రూపొందాలంటే దార్శనికతగల వ్యక్తుల అవసరం ఎంతైనా ఉన్న ది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ సంవేదనలను కలిగి ఉండటం వల్ల ఆయా శాఖలను సమర్థవంతంగా నడుపుతున్న అధికారుల కృషి కూడా దీనికి సాక్షీభూతంగా నిలుస్తున్నది. 


జ్ఞానపరంగా జిజ్ఞాస పరిశోధనా రంగంలోకి విద్యార్థులు ప్రవేశించేందుకు ద్వారాలు తెరుస్తుంటే, మరోవైపు యువతరంగం తమ సృజనాత్మక ప్రతిభా పాటవాలతో కళాశాలలను సాహిత్య సాంస్కృతిక వేదికలుగా మలుస్తున్నారు. ముఖ్యంగా కథలు, కవితలు, వ్యాస రచన, వక్తృత్వం, పరిశీలనా ప్రకటన, స్పీడ్‌రీడింగ్‌ లాంటి అంశాలు వారికి విద్యలో అభ్యసనంలో సృజనాత్మక శక్తియుక్తుల ప్రాధాన్యాన్ని నొక్కి చెబుతున్నాయి. తెలంగాణ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని భవిష్యత్తులో భర్తీ చేయడానికి ఒక కాళోజీ, వట్టికోట ఆళ్వారుస్వామి లాంటి మహా రచయితల వారసత్వాన్ని కొనసాగించేందుకు సంసిద్ధులవుతున్నారు. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ మానవ వనరులను అందించేందుకు కీలకమైన తెలంగాణ కళాశాల విద్య పటిష్ఠమైన త్రిముఖ వ్యూహంతో పని చేస్తున్నది. భావి పరిశోధకులను, కవులను, కథకులను, క్రీడాకారులను సాంకేతిక నిపుణులను అందించబోతున్నది. ఉన్నత విద్యలో ఇదొక మంచి పరిణామం. 

(వ్యాసకర్త: తెలుగు అధ్యాపకులు, ఎస్‌.ఆర్‌.బి.జి.ఎన్‌.ఆర్‌. కళాశాల, ఖమ్మం)


డాక్టర్‌ ఎం.వి.రమణ


logo