బుధవారం 08 ఏప్రిల్ 2020
Editorial - Jan 29, 2020 , 23:23:58

సంయమనంతో ప్రచారం

సంయమనంతో ప్రచారం

నిర్మాణాత్మక పద్ధతిలో ప్రచారం సాగించడం వల్ల ఉద్రిక్తతలకు తావుండదు. ప్రజల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకానీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ద్వారా గెలువాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యవ్యవస్థకే ప్రమాదకరం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ రాజకీయ పక్షం. అందువల్ల ఈ పార్టీ అనుసరించే విధానాలు ఇతర రాజకీయపక్షాలకు అదర్శంగా ఉండాలె. ఢిల్లీలో పోలింగ్‌ జరుగడానికి దాదాపు పది రోజులు ఉన్నది. ఈ లోగా అన్నిపక్షాలు ఉద్రిక్తలు పెరుగకుండా సంస్కారవంతంగా ప్రచారం సాగించాలె.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే రీతిలో మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరం. ఈ నాయకుల విద్వేష ప్రచారం ఎంత స్థాయికి దిగజారిందీ అంటే ఎన్నికల కమిషన్‌ ఇద్దరు నాయకులను స్టార్‌ క్యాంపెయినర్స్‌ స్థాయి నుంచి తొలిగించాలని బీజేపీని ఆదేశించింది. ఈ ఇద్దరు నాయకులలో ఒకరు సాక్షాత్తూ కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కాగా, మరొకరు బీజేపీకి చెందిన పార్లమెంటుసభ్యుడు పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌. వీరు స్టార్‌ క్యాంపెయినర్లు కాకున్నా సాధారణ ప్రచారకర్తలైనప్పటికీ, పరుషపదజాలంతో ప్రత్యర్థులపై విరుచుకుపడకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. కేంద్ర ఆర్థిక సహాయమంత్రి అయిన అనురాగ్‌ ఠాకూర్‌ ఈ నెల 27వ తేదీన ఢిల్లీలోని ఒకసభలో అనుచరులను ఉద్దేశించి ‘దేశ్‌కే గద్దారోంకో, గోలీ మారో...’ అనే అసభ్యకరమైన నినాదాలు ఇచ్చారు. 


బీజేపీకి చెందిన ఎంపీ పర్వేశ్‌ సాహిబ్‌ సింగ్‌ వర్మ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో- ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారి పట్ల అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘అక్కడ (షహీన్‌ భాగ్‌లో) లక్షలమంది వచ్చి చేరారు. ఢిల్లీ ప్రజలు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలె. వారు మీ ఇండ్లలోకి వచ్చి మీ అక్కా చెల్లెండ్లపై, బిడ్డలపై లైంగికదాడి చేసి హత్య చేస్తారు’ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారానికి వస్తే గంట సేపట్లో నిరసనకారులను లేకుండా చేస్తామని అన్నారు. తాము అధికారానికి వస్తే నెల రోజుల్లో తమ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమిలో ఉన్న ఒక మసీదుకు చెందిన ప్రార్థనాలయాలను అన్నింటినీ కూల్చివేస్తామని కూడా ఆయన అన్నారు. ‘కశ్మీర్‌లో మంటలంటుకున్నాయి. అక్కడ తల్లులు, అక్కా చెల్లెండ్లమీద లైంగిక దాడి జరిగింది. కేరళలో, ఉత్తరప్రదేశ్‌లో,  హైదరాబాద్‌లో కూడా ఇదే జరిగింది’ అంటూ ఆయన మాట్లాడిన తీరు దిగ్భ్రాంతికరంగా ఉన్నది. 


బీజేపీ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమొక్కటే కాదు, మొత్తం ప్రచారసరళే అభ్యంతరకరంగా ఉన్నది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు తెచ్చుకోవడానికి ప్రజలను రెచ్చగొట్టే వ్యూహాన్ని బుద్ధిపూర్వకంగా ఎంచుకున్నట్టు కనిపిస్తున్నది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని షహీన్‌ భాగ్‌లో నెలరోజులుగా సాగుతున్న నిరసన దేశవ్యాప్తంగా సాగుతున్న ఆందోళనలకు కేంద్రబిందువుగా మారింది. ఈ నిరసనలను దేశద్రోహమైనవిగా చిత్రీకరించడం తో పాటు ఢిల్లీలో ఓట్లు తెచ్చుకోవాలనే వ్యూహా న్ని బీజేపీ అమలు చేస్తున్నది. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఎన్నికల ప్రచారంలో షహీన్‌ భాగ్‌ నిరసనలకు వ్యతిరేకంగా మాట్లాడుతు న్నా రు. ఆయన ప్రసంగానికి ముందే కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ అభ్యంతరకరమైన నినాదాలు ఇచ్చారు. 


అదే సభలో ఆయన చప్ప ట్లు చరుస్తూ నినాదాలివ్వడం, మిగతా నాయకులు కూడా అక్కడ ఉండటం గమనార్హం. సోషల్‌ మీడి యా ద్వారా కూడా ఢిల్లీ ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం సాగుతున్నది. ఒక నాయకుడు ఈ ఎన్నికలను భారత్‌కు పాకిస్థాన్‌కు మధ్య సాగుతున్న పోరాటంగా చిత్రీకరించారు. నిరసనకారులను పాకిస్థాన్‌ ఏజెంట్లుగా పేర్కొనడం, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్‌ను వారితో జతకట్టడం ఈ ప్రచారం లక్ష్యం. కేజ్రీవాల్‌ (బొమ్మ) మెడలో పుర్రెల మాల వేయడం, బస్సుల దగ్ధమవుతున్న దృశ్యాలు మొదలైనవన్నీ మొత్తం గా గమనిస్తే సమాజాన్ని మత ప్రాతిపదికన విభజించి, ఒక వర్గం ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమం సాగుతున్నదని తెలిసిపోతుంది. 


ప్రజాస్వామ్యవ్యవస్థలో నిరసనలు తెలుపడం నేరం కాదు. ప్రభుత్వ నిర్ణయాలు తమకు నచ్చకపోతే ఏ వర్గమైనా వ్యతిరేకిస్తుంది. వివిధ రూపాలలో నిరసనలు తెలుపడంతో పాటు ఆ అంశాన్ని చర్చకు పెడుతుంది. శాంతియుత నిరసనలను సాగించడంలో తప్పేమీ లేదు. రాజకీయపక్షాలు ఎన్నికలలో పరస్పరం పోటీ పడినప్పటికీ అవేమీ శత్రుపక్షాలు కాదు. కేజ్రీవాల్‌ ఐదేండ్ల పాటు ఢిల్లీలో అధికారంలో ఉండి ప్రజల మధ్యకు వస్తున్నారు. ఈ ఐదేండ్లలో తాము సాధించినది ఏమిటో చెప్పుకుని ఓట్లు అడగడం మంచి పద్ధతి. ఇదే విధంగా ప్రతిపక్షాలు అధికారపార్టీ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా, తాము ఏమి చేయదలుచుకున్నామో చెప్పడం ద్వారా ప్రజల మద్దతు చూరగొనడానికి ప్రయత్నించాలె. ఢిల్లీలో కా ష్యం వంటి అనేక సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి తాము ఏమి చేయదలుచుకున్నామో చెప్పడం ద్వారా ఓట్లు తెచ్చుకోవచ్చు. 


బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నందున, తమ పరిపాలన గురించి చెప్పుకొని ఓట్లు వేయమని కోరవచ్చు. నిర్మాణాత్మక పద్ధతిలో ప్రచారం సాగించడం వల్ల ఉద్రిక్తతలకు తావుండదు. ప్రజల సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకానీ ఉద్రిక్తతలు రెచ్చగొట్టడం ద్వారా గెలువాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యవ్యవస్థకే ప్రమాదకరం. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ రాజకీయ పక్షం. అందువల్ల ఈ పార్టీ అనుసరించే విధానాలు ఇతర రాజకీయపక్షాలకు అదర్శంగా ఉండాలె. ఢిల్లీలో పోలింగ్‌ జరుగడానికి దాదాపు పది రోజులు ఉన్నది. ఈ లోగా అన్ని పక్షాలు ఉద్రిక్తలు పెరుగకుండా సంస్కారవంతంగా ప్రచారం సాగించాలె.


logo