Home Loans | సొంతిల్లు సాకారం చేసుకోవాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కొనుక్కోవాలంటే బ్యాంకుల నుంచి భారీగా రుణం తీసుకుంటే తప్ప సాధ్యం కాని పరిస్థితి. అయితే, కరోనా మహమ్మారితో దెబ్బ తిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి 2020లో వడ్డీరేట్లను భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) భారీగా తగ్గించేసింది. దీంతో వడ్డీరేట్లు 20 ఏండ్ల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దాదాపు మూడేండ్ల పాటు సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకున్న వారికి వడ్డీరేట్ల తగ్గింపు ఆనందకరమైన అంశం. వడ్డీరేట్ల తగ్గింపుతో పాత రుణాలపై ఈఎంఐ, రుణ చెల్లింపు గడువు కూడా తగ్గాయి.
కానీ, ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్న ధరలను అదుపు చేయడానికి ఆర్బీఐ గతేడాది మే నుంచి కీలక వడ్డీరేట్లు పెంచడం ప్రారంభించింది. దీంతో ఇండ్ల రుణాలపై నెలసరి వాయిదాలు (ఈఎంఐ) పెరిగాయి.. రుణ వాయిదాల చెల్లింపు గడువు పెరిగింది. ఇండ్ల రుణాలు తీసుకునే వారిలో అత్యధికులు ఈఎంఐలు పెరిగినా పెద్దగా లక్ష్య పెట్టరు. కానీ, ఇంటి రుణం సుదీర్ఘకాలం మీ కుటుంబ ఖర్చుల్లో కొనసాగే అతిపెద్ద ఖర్చుగా ఉంటుందని మరిచిపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. కనుక ఈఎంఐల చెల్లింపులు సరిగ్గా పూర్తి చేస్తున్నట్లయితే డబ్బు ఆదా చేయడం సాధ్యం అవుతుంది.
ఇంటి రుణం తీసుకున్న ప్రారంభంలో మీ కుటుంబ బడ్జెట్కనుగుణంగా ఈఎంఐ ఉండొచ్చు. తర్వాతీ కాలంలో వేతనం పెరుగవచ్చు. ఏడాదికోసారి బోనస్ కూడా అందుకునే అవకాశం ఉండొచ్చు. ఇతర క్యాష్ బెనిఫిట్లు కూడా లభిస్తుండవచ్చు. ఇటువంటి సందర్భాల్లో చేతికి వచ్చే మనీని మీ ఇంటి రుణ ముందస్తు చెల్లింపులకు ఉపయోగించుకోవాలి.
రుణ చెల్లింపులు చేసిన ప్రతిసారీ రుణ గడువు తగ్గించాలని బ్యాంకు అధికారులను అడగండి. ఈఎంఐ పేమెంట్స్ తగ్గించమని కోరడం కూడా సరి కాదు. దానికి బదులు ప్రతిసారీ ఇంటి రుణ గడువు తగ్గించమని కోరుతూ ఉండాలి. రుణం అంటేనే వడ్డీరేటుతో ముడిపడి ఉన్న అంశం. అంటే రుణ గడువు తగ్గించుకుంటే.. చెల్లించే వడ్డీ కూడా తగ్గించుకున్నట్లే. ఒక్కోసారి ఆర్బీఐ రెపోరేట్ తగ్గిస్తే తదనుగుణంగా ఇంటి రుణ వడ్డీరేటు తగ్గుతుంది. అటువంటప్పుడు మీరు ఈఎంఐ అలా కొనసాగించమని కోరడానికి బదులు రుణ గడువు తగ్గించమని కోరడం వల్ల దీర్ఘకాలం రుణం మీద అధిక వడ్డీ చెల్లించకుండా తగ్గించుకునే వెసులుబాటు లభిస్తుంది.
ఇంటి రుణం తీసుకున్న ప్రారంభ సమయంలో ఆస్తి స్వాధీనం అయ్యే వరకు మీరు ఊహించిన దానికంటే తక్కువ ఈఎంఐ చెల్లిస్తూ ఉంటారు. దీనికి కారణమేమిటంటే ఇల్లు స్వాధీనం చేసేవరకు రుణంపై వడ్డీ మాత్రమే చెల్లించమని మిమ్మల్ని బ్యాంకులు కోరుతూ ఉంటాయి. ఈఎంఐలో మీరు తీసుకున్న రుణంలో అసలు చెల్లించరు. ఒకవేళ ప్రాజెక్టు నిలిచిపోయినా, ఆలస్యమైనా ఏండ్ల తరబడి మీరు ప్రీ-ఈఎంఐ చట్రంలోనే ఉండిపోతారు. దీనివల్ల బ్యాంకుకే లాభం తప్ప.. రుణ గ్రహీతలకు ప్రయోజనం ఉండదు. కాబట్టి మీరు ఇంటి రుణం తీసుకున్నప్పటి నుంచి అసలుతోపాటు వడ్డీ చెల్లించడం మొదలు పెట్టాల్సిందే. దీంతో భవిష్యత్తులో చెల్లించే వడ్డీ భారం తగ్గుతూ ఉంటది. ప్రీ-ఈఎంఐ ఆప్షన్ పక్కన బెట్టి.. రెగ్యులర్ ఈఎంఐ ఆప్షన్ లోకి వెళ్లిపోవడమే బెటర్.
ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు ఎల్లకాలం ఒకలాగే ఉండవు. ఆర్బీఐ తన వడ్డీరేట్ల పాలసీలో మార్పులకు అనుగుణంగా వడ్డీరేట్లు మారతాయి. రెపోరేట్ పెంచితే వడ్డీ పెరుగుతుంది.. తగ్గిస్తే తగ్గుతుంది. సంవత్సరానికి ఒకసారైనా మారొచ్చు.. తదనుగుణంగా బ్యాంకు మీ ఇంటి రుణం ఈఎంఐ మార్చవచ్చు. లేదా రుణ గడువు మార్చొచ్చు. వడ్డీరేటును బట్టి రుణ బకాయి కూడా మారుతూ ఉంటుంది. కనుక మీ ఈఎంఐ, వడ్డీరేటు, రుణ గడువు మారిందా? లేదా? అనే అంశం ప్రతి మూడు నెలలకోసారి సమీక్షించుకోవాలని నిపుణులు అంటున్నారు.
రుణ గడువు ముగియడానికి ముందే లోన్ అకౌంట్ మూసేయాలనే అభిప్రాయం మీకు రావచ్చు. అలా ఆలోచన రాగానే తొందరపడి ముందుకెళ్లొద్దు. రుణం ముగిసే సమయానికి, ఈఎంఐ పేమెంట్ అత్యధికం అసలు మొత్తమే ఉంటుంది. వడ్డీ కొద్ది మొత్తం మాత్రమే ఉంటుంది. ఇటువంటి తరుణంలో మీ దగ్గర డబ్బు మిగిలినప్పుడు దాన్ని ఇన్వెస్ట్ మెంట్ పోర్ట్ ఫోలియోలో పెట్టుబడిగా పెట్టడం బెటర్. ఇంటిరుణం తీసుకున్న వారు ఆదాయం పన్నుపై మినహాయింపులు కూడా పొందొచ్చు. ఇతర టాక్స్ డిడక్షన్లు ఉంటే తప్ప.. ఇంటి రుణం యధావిధిగా కొనసాగించడం సరైందని ఆర్థిక వేత్తలు, నిపుణులు చెబుతున్నారు.